ఈసారైనా బీజేఎల్పీ నేతను నియమిస్తారా..?

ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో బండి సంజయ్, ఈటల రాజేందర్ వంటి సీనియర్ నాయకులు ఎవరూ విజయం సాధించలేదు. దీంతో ఎమ్మెల్యేగా మూడుసార్లు వరుసగా విజయం సాధించిన రాజాసింగ్ సీనియర్ గా ఉన్నారు. ఆయన శాసనసభ పక్ష నేత రేసులో ముందున్నారు.

Advertisement
Update: 2023-12-14 11:06 GMT

తెలంగాణలో బీజేపీ బలం పెరిగింది రాష్ట్ర విభజన తర్వాతే. అంతకుముందు రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో మాత్రమే బీజేపీ ఉనికి అంతో ఇంతో ఉండేది. విభజన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా కొంతమేర బీజేపీ బలపడింది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రంలో మూడుసార్లు అసెంబ్లీ ఎన్నికలు జరగ్గా.. 2014 ఎన్నికల్లో 5 స్థానాలు, 2018 లో జరిగిన ఎన్నికల్లో ఒక్క స్థానంలో, ఇటీవల జరిగిన ఎన్నికల్లో 8 స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. బీజేపీకి గతంతో పోలిస్తే ఈసారి మెరుగైన స్థానాలే దక్కాయి. తెలంగాణలో అంతో ఇంతో ప్రభావం చూపుతున్న బీజేపీ అసెంబ్లీలో మాత్రం బీజేఎల్పీ నేతను నియమించడం లేదు.

గత ఎన్నికల్లో బీజేపీ ఒకే స్థానానికి పరిమితం కాగా.. బీజేఎల్పీ నేత లేకుండానే గత అసెంబ్లీ ముగిసిపోయింది. ఈసారి బీజేపీకి 8 స్థానాలు దక్కడంతో ఈ దఫా ఆ పార్టీ శాసనసభ పక్ష నేతను ఎంపిక చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఒకవేళ శాసనసభ పక్ష నేతను నియమించాల్సి వస్తే ఎవరిని ఎంపిక చేస్తారనే విషయం ఆసక్తికరంగా మారింది.

ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో బండి సంజయ్, ఈటల రాజేందర్ వంటి సీనియర్ నాయకులు ఎవరూ విజయం సాధించలేదు. దీంతో ఎమ్మెల్యేగా మూడుసార్లు వరుసగా విజయం సాధించిన రాజాసింగ్ సీనియర్ గా ఉన్నారు. ఆయన శాసనసభ పక్ష నేత రేసులో ముందున్నారు.

ఈయనతోపాటు ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి కూడా బీజేఎల్పీ నేత రేసులో నిలిచారు. వెంకటరమణారెడ్డి కామారెడ్డి లో కేసీఆర్, రేవంత్ రెడ్డిలను ఓడించి ఎమ్మెల్యేగా నెగ్గిన సంగతి తెలిసిందే. బీజేఎల్పీ నేతగా వెంకటరమణారెడ్డిని నియమిస్తే బాగుంటుందనే చర్చ కూడా బీజేపీలో జరుగుతోంది. మరి ఈసారైనా బీజేపీ అధిష్టానం బీజేఎల్పీ నేతను నియమిస్తుందా? లేదా? ఒకవేళ నియమిస్తే ఎవరికీ అవకాశం ఇస్తుంది అన్నది ఆసక్తికరంగా మారింది.

Tags:    
Advertisement

Similar News