అధికారుల ముందు జాగ్రత్త.. ఆస్పత్రుల నుంచి రోగుల తరలింపు..

మంచిర్యాల, మంథనిలో ఇటీవల ప్రారంభించిన మాతా శిశు ఆరోగ్య కేంద్రాల నుంచి బాలింతలను, గర్భిణులను హుటాహుటిన వేరే ఆస్పత్రులకు తరలించి వారి ప్రాణాలు కాపాడారు.

Advertisement
Update: 2022-07-15 10:00 GMT

తెలంగాణలో గోదావరి ఉగ్రరూపంతో ప్రజలు విలవిల్లాడిపోతున్నారు. గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలు ఇళ్లు, వాకిళ్లు వదిలిపెట్టి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. మరి ఆయా ప్రాంతాల్లో ఉన్న‌ ఆస్పత్రుల్లోని రోగుల పరిస్థితి ఏంటి..? వారిని ఎవరు తీసుకెళ్లాలి.. ఉన్నట్టుండి వరద ప్రవాహం పెరిగితే కదలలేని స్థితిలో ఉన్నవారు ఏం చేయాలి. ఈ విషయంలో అధికారులు ముందుగానే అప్రమత్తం అయ్యారు. నష్టం జరగక ముందే రోగుల్ని తరలించారు. మంచిర్యాల, మంథనిలో ఇటీవల ప్రారంభించిన మాతా శిశు ఆరోగ్య కేంద్రాల నుంచి బాలింతలను, గర్భిణులను హుటాహుటిన వేరే ఆస్పత్రులకు తరలించి వారి ప్రాణాలు కాపాడారు.

మంచిర్యాలలో ఇటీవల ఏర్పాటు చేసిన మాతాశిశు ఆరోగ్య కేంద్రం(MCH) గోదావరి నదికి కేవలం 300 మీటర్ల దూరంలో ఉంది. గోదావరికి వరదలొచ్చినా ఈ ప్రాంతంలోకి నీరు పెద్దగా రాదు. కానీ ఈసారి వచ్చింది మామూలు వరద కాదు, వందేళ్లలో ఎప్పుడూ రానంత రికార్డ్ స్థాయి వరద. దీంతో ఆరోగ్య కేంద్రాన్ని కూడా వరదనీరు చుట్టుముట్టింది. ఈ ఆస్పత్రిలోని గర్భిణులు, బాలింతలు, పురిటి పిల్లలు.. ఇలా మొత్తం 100 మందికి పైగా రోగుల్ని దగ్గరలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. MCH సూపరింటెండెంట్ హరిశ్చంద్ర ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఆస్పత్రిని నదీ మట్టానికి బాగా ఎత్తులో నిర్మించినా క్రమక్రమంగా వరదనీరు మెట్లపైకి చేరింది. నీటిమట్టం మరింత పెరిగే అవకాశముండటంతో అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు.

ఇక మంథనిలో కూడా ఇదే పరిస్థితి. అక్కడ కేవలం ముగ్గురు రోగులు మాత్రమే ఆస్పత్రిలో ఇన్ పేషెంట్లుగా ఉన్నారు. వారిని దగ్గరలోని సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. రోగులతోపాటు ఆస్పత్రిలో ఉన్న వైద్య పరికరాలను కూడా తరలించారు. భవిష్యత్తులో వరదలు వస్తే ఆస్పత్రుల్లో ఉన్న రోగులకు ఇబ్బందులు లేకుండా రక్షణ చర్యలు చేపడతామని చెప్పారు తెలంగాణ వైద్య విధాన పరిషత్ జిల్లా అధికారి మందల వాసుదేవ రెడ్డి.

Tags:    
Advertisement

Similar News