రేణుక చెప్పిందని కాదు.. అక్టోబర్ నుంచే లీకులు మొదలు పెట్టిన రాజశేఖర్, ప్రవీణ్!

టీఎస్‌పీఎస్సీ కార్యాలయంలో రాజశేఖర్, ప్రవీణ్ కలిసి చేసిన అక్రమాలు తెలిసి అధికారులే ఆశ్చర్యపోతున్నారు.

Advertisement
Update: 2023-03-18 09:23 GMT

టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్న కొద్దీ విస్తుపోయే నిజాలు బయట పడుతున్నాయి. లీకేజీ వ్యవహారంలో రేణుక పాత్ర స్వల్పమేనని.. గతేడాది అక్టోబర్ నుంచే సిస్టమ్ అడ్మిన్ రాజశేఖర్, కార్యదర్శి పీఏ ప్రవీణ్ లీకేజీ బాగోతానికి తెర తీసినట్లు సిట్ అధికారులు గుర్తించారు. ఇప్పటి వరకు దాదాపు 7 ప్రశ్నాపత్రాలను గుట్టు చప్పుడు కాకుండా లీక్ చేసినట్లు అధికారులు చెబుతున్నారు. టీఎస్‌పీఎస్సీ కార్యాలయంలో అంతా తానై వ్యవహరించిన రాజశేఖరే కీలక సూత్రధారి అని.. అతడు ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రశ్నాపత్రాలను దొంగిలించి పీఏ ప్రవీణ్‌కు అందజేసేవాడని అధికారులు చెబుతున్నారు.

టీఎస్‌పీఎస్సీ కార్యాలయంలో రాజశేఖర్, ప్రవీణ్ కలిసి చేసిన అక్రమాలు తెలిసి అధికారులే ఆశ్చర్యపోతున్నారు. వాస్తవానికి టౌన్ ప్లానింగ్ పరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్రం లీక్ అయ్యిందనే ఫిర్యాదు మేరకు అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. అక్కడ నుంచే ప్రవీణ్ వ్యవహారం బయటపడింది. తనపై వచ్చిన ఆరోపణల నుంచి తప్పించుకునేందుకే.. రేణుక అభ్యర్థన మేరకు ప్రశ్నాపత్రం లీక్ చేశానని.. దానికి రాజశేఖర్ సహకరించాడని ప్రవీణ్ సిట్ అధికారులకు చెప్పాడు. తాను రేణుక కోసం ఏఈఈ పరీక్ష పత్రం లీక్ చేశానని ఒప్పుకున్నాడు. మిగిలిన ప్రశ్నాపత్రాల విషయం బయట పడుతుందేమో అనే భయంతో రేణుక పేరును ప్రస్తావించినట్లు అధికారులు గుర్తించారు.

వాస్తవానికి ప్రవీణ్, రాజశేఖర్ కలసి రేణుక చెప్పడానికంటే ముందే పరీక్ష పత్రాలు దొంగిలించి.. బయట విక్రయించడం మొదలు పెట్టినట్లు సిట్ అధికారులు చెబుతున్నారు. టీఎస్‌పీఎస్సీ కార్యాలయానికి చెందిన ఒక ఉద్యోగి యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌ను దొంగిలించి ప్రశ్నాపత్రాలు ఉన్న ఫోల్డర్లను నాలుగు పెన్ డ్రైవ్‌లలో కాపీ చేసుకున్నారు. అక్టోబర్ నుంచే ఈ తతంగం అంతా నడుస్తున్నట్లు సిట్ అధికారుల విచారణలో తేలింది. అక్టోబర్‌లో జరిగిన గ్రూప్-1 ప్రిలిమ్స్ ఎగ్జామ్‌లో ప్రవీణ్‌కు మంచి మార్కులు వచ్చాయి. ఈ విషయం తెలిసుకున్న అధికారులు ఆ దిశగా దర్యాప్తు చేయగా.. అక్టోబర్ నుంచే ప్రశ్నాపత్రాలు లీక్ చేస్తున్నట్లు స్పష్టమైంది.

ఏడాది క్రితం టీఎస్‌పీఎస్సీ కార్యాలయంలోని కంప్యూటర్లను అధికారులు అప్‌గ్రేడ్ చేశారు. అప్పుడే రాజశేఖర్, ప్రవీణ్ కలిసి లీకేజీ వ్యవహారానికి శ్రీకారం చుట్టారు. రాజశేఖర్ మొదట వేరే దగ్గర పని చేసేవాడు. కానీ ప్రశ్నాపత్రాలు లీకేజీ చేయాలనే ఉద్దేశంతోనే టీఎస్‌పీఎస్సీలోకి డిప్యుటేషన్‌పై వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. రావడంతోనే పీఏ ప్రవీణ్‌తో సాన్నిహిత్యం పెంచుకున్నాడు. కంప్యూటర్ల అప్‌గ్రేడేషన్ తర్వాత తన పనిని మొదలు పెట్టాడు. సెక్రటరీ, చైర్మన్‌లకు మాత్రమే అజమాయిషీ ఉండే కాన్ఫిడెన్షియల్ విభాగంలోని కంప్యూటర్లలో ప్రశ్నాపత్రాలు ఉన్నాయని తెలసుకున్న రాజశేఖర్.. నెట్‌వర్క్ అప్‌గ్రెడేషన్ పేరుతో డైనమిక్ ఐపీని కాస్తా స్టాటిక్ ఐపీగా మార్చి.. ఆ తర్వాత సిస్టమ్ హ్యాక్ చేయడం ప్రారంభించాడు.

అక్టోబర్ నుంచి వరుసగా ప్రశ్నాపత్రాలు దొంగిలించడం మొదలు పెట్టారు. గ్రూప్-1, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్, సీడీపీవో, సూపర్ వైజర్ గ్రేడ్-2, ఏఈఈ, డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్, ఏఈ వంటి ప్రశ్నాపత్రాలన్నీ దొంగిలించినట్లు తెలుస్తున్నది. కాగా, గ్రూప్-1లో ప్రవీణ్‌కు 100కు పైగా మార్కులు వచ్చాయి. అతడు ఆ ప్రశ్నాపత్రాలను ఇంకా ఎవరికైనా ఇచ్చారా అనే విషయాన్ని కూడా అధికారులు ఆరా తీస్తున్నారు. రాజశేఖర్, ప్రవీణ్ ఫోన్లలో ఏమైనా సమాచారం ఉందా అని అధికారులు విశ్లేషిస్తున్నారు. గ్రూప్-1 ప్రిలిమ్స్‌లో 100కు పైగా మార్కులు వచ్చిన వారిని సిట్ అధికారులు పిలిచి విచారిస్తున్నారు. ఎవరైనా ప్రశ్నాపత్రాలను పొందినట్లు తేలితే వారిని కూడా నిందితుల జాబితాలో చేర్చనున్నట్లు తెలుస్తున్నది. 

Tags:    
Advertisement

Similar News