అగ్రికల్చర్ యూనివర్సిటీలో ర్యాగింగ్ కలకలం.. 16 మంది సీనియర్ల‌పై వేటు

జూనియర్ల ఫిర్యాదును యాంటీ ర్యాగింగ్ టీమ్ ఇంచార్జ్ వైస్ ఛాన్సలర్‌కు తెలిపింది. దీంతో ర్యాగింగ్‌కు పాల్పడిన 16 మంది విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకున్నారు.

Advertisement
Update: 2022-07-29 10:32 GMT

హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ర్యాగింగ్ కలకలం రేపింది. సీనియర్ విద్యార్థులు కొంత మంది జూనియర్లను తమ హాస్టల్‌కు పిలిపించుకొని.. ర్యాగింగ్ పేరుతో అసభ్యంగా ప్రవర్తించిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తమకు జరిగిన అవమానాన్ని జూనియర్లు చెప్పడంతో 16 మంది సీనియర్లను రెస్టికేట్ చేశారు.

వివరాల్లోకి వెళితే..

వ్యవసాయ యూనివర్సిటీలో కొత్తగా చేరిన జూనియర్లను ఇటీవల కొంత మంది సీనియర్లు తమ హాస్టల్‌కు పిలిపించుకొని వికృత చేష్టలకు పాల్పడ్డారు. ర్యాగింగ్ అని చెప్పి అసభ్యంగా ప్రవర్తించారు. దీంతో యూనివర్సిటీలోని యాంటీ ర్యాగింగ్ టీమ్‌కు బాధిత విద్యార్థులు తమకు జరిగిన అవమానంపై ఫిర్యాదు చేశారు. సీనియర్లు ఎలా తమను ఇబ్బంది పెట్టారో ఫిర్యాదులో పేర్కొన్నారు.

జూనియర్ల ఫిర్యాదును యాంటీ ర్యాగింగ్ టీమ్ ఇంచార్జ్ వైస్ ఛాన్సలర్‌కు తెలిపింది. దీంతో ర్యాగింగ్‌కు పాల్పడిన 16 మంది విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకున్నారు. సదరు సీనియర్లను హాస్టల్ నుంచి పంపించి వేయడమే కాకుండా.. ఒక సెమిస్టర్ పాటు రెస్టికేట్ చేస్తున్నట్లు ప్రకటించారు. వ్యవసాయ యూనివర్సిటీలో ర్యాగింగ్ వంటి అమానుష చర్యలకు అనుమతి లేదని వీసీ స్పష్టం చేశారు. ఈ ఘటన తర్వాత కూడా ఎవరైనా ర్యాగింగ్‌కు పాల్పడితే వారిని పూర్తిగా రెస్టికేట్ చేస్తామని హెచ్చరించారు.

కాగా, ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీలో గత కొంత కాలంగా సీనియర్ స్టూడెంట్స్ ధోరణి విపరీతంగా ఉంటున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. జూనియర్ల పట్ల శృతిమించేలా ప్రవర్తిస్తున్నట్లు పలు ఫిర్యాదులు కూడా అందాయి. ఇక తాజాగా.. ర్యాగింగ్ పేరుతో అసభ్యంగా ప్రవర్తించడంతో జూనియర్లు తిరగబడినట్లు తెలుస్తున్నది. ఈ క్రమంలోనే హాస్టల్ వేదికగా జరుగుతున్న పలు ఆకృత్యాలు కూడా వీసీ దృష్టికి వచ్చాయి. ప్రస్తుతం క్యాంపస్‌లో మరింతగా భద్రతను పెంచారు. సీనియర్లు ఇబ్బంది పెడితే వెంటనే యాంటీ ర్యాగింగ్ టీమ్‌కు తెలియజేయాలని స్పష్టం చేశారు.

Tags:    
Advertisement

Similar News