ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్, ఈటల.. కౌశిక్ రెడ్డి కౌంటర్లు

"2018 ఎన్నికల్లో కేసీఆర్‌ నీ వెంట ఉంటే గెలిచావు, ఇప్పుడు కేసీఆర్ నా వెంట ఉన్నారు, వచ్చే ఎన్నికల్లో చూసుకుందాం ఎవరు గెలుస్తారో, ఎవరు ఓడతారో.." అంటూ ఈటలకు సవాల్ విసిరారు కౌశిక్ రెడ్డి.

Advertisement
Update: 2023-01-25 14:12 GMT

హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ని ఓ రేంజ్ లో ఆటాడేసుకున్నారు ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి. హుజురాబాద్ నియోజక అభివృద్ది కోసం ఈటల తట్టెడు మట్టి పోయలేదని విమర్శించారు. ఈటలను టీవీల్లో చూడాలని చెబుతున్నాడని, ఆయన ఏమైనా ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్ అనుకుంటున్నాడా అని ప్రశ్నించారు. మాజీ ఎంపీ వివేక్ దగ్గర రూ.40 లక్షల నుండి వంద కోట్ల వరకు తీసుకున్నానని, ఆ డబ్బుల్ని హుజురాబాద్ లో ఖర్చు పెట్టానని ఈటల చెప్పుకుంటున్నాడని.. ఆ విషయంపై ఐటీ, ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.

ఇప్పుడు కేసీఆర్ నా బలం..

"2018 ఎన్నికల్లో కేసీఆర్‌ నీ వెంట ఉంటే గెలిచావు, ఇప్పుడు కేసీఆర్ నా వెంట ఉన్నారు, వచ్చే ఎన్నికల్లో చూసుకుందాం ఎవరు గెలుస్తారో, ఎవరు ఓడతారో.." అంటూ ఈటలకు సవాల్ విసిరారు కౌశిక్ రెడ్డి. తాను ఓడిపోతే ముక్కు నేలకు రాస్తానని అన్నారు. 24గంటలు విద్యుత్ సరఫరా చేయడం లేదని ఈటల అంటున్నారని, హుజురాబాద్ నియోజకవర్గంలోని ఏ మండలంలో అయినా చర్చకు తాను సిద్దంగా ఉన్నానన్నారు కౌశిక్‌ రెడ్డి.

గవర్నర్ పై కూడా విమర్శలు..

గవర్నర్‌ తమిళిసై పై కూడా విమర్శలు ఎక్కుపెట్టారు కౌశిక్ రెడ్డి. అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేసిన ఫైళ్ళను గవర్నర్ ఎక్కడ పెట్టుకున్నారని మండిపడ్డారు. ఒక్క ఫైల్ కూడా కదలనివ్వడం లేదని ఆరోపించారు. గవర్నర్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి తప్పు చేయలేదని, కావాలనే ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ఆమె ఆరోపణలు చేస్తున్నారని, ఆమెకు బీజేపీ నేతలు వత్తాసు పలుకుతున్నారని మండిపడ్డారు కౌశిక్ రెడ్డి. 

Tags:    
Advertisement

Similar News