ఉప్పల్‌ స్టేడియంలో మళ్లీ పవర్‌ కట్‌.. పరువు పోయిందిగా..!

స్టేడియంలోని కార్పొరేట్‌ బాక్సుల్లో గంటకు పైగా కరెంట్‌ సరఫరా నిలిచి చీకట్లు అలుముకున్నాయి. దీంతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement
Update: 2024-05-03 03:21 GMT

కరెంట్‌ కోతలు ఉప్పల్‌ స్టేడియాన్ని వీడటం లేదు. గతంలో HCA కరెంట్‌ బిల్లు కట్టలేదని కరెంట్‌ తొలగించామని స్వయంగా విద్యుత్‌ అధికారులే చెప్పగా, తాజాగా మరోసారి ఉప్పల్‌ స్టేడియంలో కరెంట్‌ సమస్య తలెత్తింది. గురువారం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ జట్ల మధ్య మ్యాచ్‌ జరిగింది. సాయంత్రం 6 గంటల నుంచి కరెంట్‌ సరఫరా లేక అభిమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

గంటకుపైగా పవర్ కట్..

స్టేడియంలోని కార్పొరేట్‌ బాక్సుల్లో గంటకు పైగా కరెంట్‌ సరఫరా నిలిచి చీకట్లు అలుముకున్నాయి. దీంతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వేలాది రూపాయలు ఖర్చు పెట్టి, మ్యాచ్‌ చూద్దామని వస్తే కరెంట్‌ లేక తీవ్ర అవస్థలు పడ్డామని మండిపడ్డారు. అసలే ఉష్ణోగ్రతలు పెరిగి ఇబ్బందులు పడుతుంటే కరెంట్‌ పోవడం తమను మరింత బాధించిందని సోషల్‌ మీడియా వేదికగా పలువురు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్టేడియంలో వేలాది మంది ఉంటారు. టీవీల్లో కోట్లమంది చూస్తారు. ప్రపంచ దిగ్గజ క్రికెటర్ల ముందు విద్యుత్తు సమస్య తలెత్తడం సిగ్గుచేటని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇది రెండో సారి..

గతంలో ఉప్పల్‌ స్టేడియం వేదికగా హైదరాబాద్‌, చైన్నె జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లోనూ కరెంట్ కట్ అయింది. కొన్నినెలల నుంచి బిల్లులు చెల్లించకపోవడంతో ఉప్పల్‌ స్టేడియానికి విద్యుత్తు సరఫరాను నిలిపేసినట్టు ఆనాడు అధికారులు తెలిపారు. రూ.1.57 కోట్లు విద్యుత్తు బిల్లులు HCA చెల్లించలేదని చెప్పారు. ఇప్పుడు కూడా అదే కారణంతోనే పవర్ కట్ చేశారా?. లేక ఏదైనా సమస్య ఉత్పన్నమైందా అన్న చర్చ జరుగుతోంది. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటినుంచి పవర్ కట్స్‌ ఎక్కువ అయ్యాయనే విమర్శలు ఉన్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం అందుకు అంగీకరించట్లేదు. మరి దీనిపై ఏం వివరణ ఇస్తుందో చూడాలి.

Tags:    
Advertisement

Similar News