వైద్య రంగంలో తెలంగాణకు భారీ పెట్టుబడులు..

లైఫ్ సైన్సెస్ రంగంలో అమెరికాలోని ప్రముఖ కంపెనీ స్టెమ్ క్యూర్స్ హైదరాబాద్ లో స్టెమ్ సెల్ ల్యాబ్ ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. స్టెమ్‌ క్యూర్స్ వ్యవస్థాపకుడు డాక్టర్ సాయిరామ్ అట్లూరి ఈ ప్రాజెక్ట్ గురించి మంత్రి కేటీఆర్ కి వివరించారు.

Advertisement
Update: 2023-05-24 16:38 GMT

వైద్య రంగంలో తెలంగాణకు భారీ పెట్టుబడులు రాబోతున్నాయి. అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్ ఈ పెట్టుబడులకు ఆహ్వానం పలికారు. అమెరికాలోని 'పై' హెల్త్ సహ వ్యవస్థాపకుడు డాక్టర్ బాబీ రెడ్డి తాజాగా మంత్రి కేటీఆర్ తో సమావేశమయ్యారు. హైదరాబాద్‌ లో సమీకృత క్యాన్సర్ ఆసుపత్రితోపాటు క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్ ని కూడా ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఆయన ముందుంచారు. త్వరలో ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చుతుంది. హైదరాబాద్‌ లో అత్యాధునిక టెక్నాలజీతో ఇంటిగ్రేటెడ్ క్యాన్సర్ హాస్పిటల్, రీసెర్చ్ సెంటర్‌ ను స్థాపించాలని 'పై' హెల్త్ నిర్ణయించడం సంతోషదాయకం అన్నారు మంత్రి కేటీఆర్. క్యాన్సర్ పై జరిగే పోరాటంలో ఇది మరిన్ని అవకాశాలను సృష్టిస్తుందని, భవిష్యత్తుపై మరింత భరోసానిస్తుందని చెప్పారు.


లైఫ్ సైన్సెస్ రంగంలో..

లైఫ్ సైన్సెస్ రంగంలో అమెరికాలోని ప్రముఖ కంపెనీ స్టెమ్ క్యూర్స్ హైదరాబాద్ లో స్టెమ్ సెల్ ల్యాబ్ ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. భారత్ లోనే అతిపెద్ద స్టెమ్ సెల్ ల్యాబ్ ని హైదరాబాద్ లో ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చారు ఆ సంస్థ ప్రతినిధులు. బోస్టన్ లో మంత్రి కేటీఆర్ ని కలసి ఈ ప్రాజెక్ట్ పై చర్చించారు. 54మిలియన్ అమెరికన్ డాలర్ల పెట్టుబడితో రెండుదశల్లో ఈ ల్యాబ్ ఏర్పాటు చేస్తామంటున్నారు. 150మందికి ప్రత్యక్షంగా ఈ ల్యాబ్ ఉపాధి చూపిస్తుంది. పరోక్షంగా మరికొన్ని వందలమందికి దీనిద్వారా ఉపాధి లభించే అవకాశాలున్నాయి. స్టెమ్‌ క్యూర్స్ వ్యవస్థాపకుడు డాక్టర్ సాయిరామ్ అట్లూరి ఈ ప్రాజెక్ట్ గురించి మంత్రి కేటీఆర్ కి వివరించారు.


ఇప్పటికే టాప్ 10 ఫార్మా కంపెనీలతో సహా 1000కి పైగా లైఫ్ సైన్సెస్ కంపెనీలతో ప్రపంచ లైఫ్ సైన్సెస్ పరిశ్రమకు హైదరాబాద్ నాలెడ్జ్ క్యాపిటల్‌ గా ఎదుగుతోందని చెప్పారు మంత్రి కేటీఆర్. స్టెమ్ క్యూర్స్ రాకతో ఈ రంగంలో హైదరాబాద్ మరింత పురోగమిస్తుందన్నారు. స్టెమ్‌ క్యూర్స్‌ సంస్థకు స్వాగతం పలుకుతున్నామన్నారు. స్టెమ్ సెల్ థెరపీతో అధునాతన వైద్యం అందుబాటులోకి తెచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం పూర్తిస్థాయి సహాయ సహకారాలు అందిస్తుందని హామీ ఇచ్చారు మంత్రి కేటీఆర్. 

Tags:    
Advertisement

Similar News