మాఫీ కాదు రికవరీ.. రైతన్నలకు కాంగ్రెస్ ప్రభుత్వం షాక్

తమది రైతు పక్షపాత ప్రభుత్వం అని దావోస్ సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి కీలక ఉపన్యాసం ఇచ్చిన రోజే, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల ఇక్కడ రైతు రుణాల రికవరీపై కఠిన ఆదేశాలు ఇవ్వడం విశేషం.

Advertisement
Update: 2024-01-19 06:08 GMT

రైతు రుణాల విషయంలో ఏ ప్రభుత్వాలయినా ఉదారంగా ఉంటాయి. అవసరం అనుకుంటే వడ్డీలు మాఫీ చేస్తాయి, ఇంకా మేలు చేయాలంటే అసలు, వడ్డీ అన్నీ మాఫీ చేస్తారు నేతలు. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రుణ మాఫీ చివరి దశ ఎన్నికల కోడ్ కారణంగా ఆగిపోయింది. కాంగ్రెస్ హయాంలో ఆ మాఫీ వర్తిస్తుందని రైతన్నలు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ దశలో వారికి ఇది షాకింగ్ న్యూస్ అని చెప్పాలి. రైతు రుణాలను రికవరీ చేయాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తాజాగా అధికారులను ఆదేశించారు. జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలలో ఉన్న రుణాల మొండి బకాయిలు, వ్యవసాయేతర రుణాలను వెంటనే వసూలు చేయాలన్నారు. మొండి బకాయిలపై అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన ఈ కఠిన ఆదేశాలు జారీ చేశారు. దీనిపై ఇప్పుడు తెలంగాణలో కలకలం రేగింది.

మొండిబకాయిలన్నిటినీ ఒకే గాటన కట్టేస్తే వాస్తవానికి నష్టపోయేది రైతులే. ఇతర బ్యాంకుల్లో రుణాల చెల్లింపుల్లో నిక్కచ్చిగా ఉన్నా.. సహకార సంఘాల రుణాల విషంలో రైతులు కాస్త ధీమాతో ఉంటారు. పట్టాదారు పాస్ పుస్తకాలను తనఖా పెట్టి, కొన్నిసార్లు పొలాలను కూడా మార్టిగేజ్ చేసి రుణాలు తీసుకుంటారు. ఇలా తీసుకున్న స్వల్పకాల, దీర్ఘకాల రుణాల రికవరీ విషయంలో వ్యవసాయ మంత్రి తుమ్మల ఇచ్చిన ఆదేశాలు కలకలం రేపుతున్నాయి. మొండి బకాయిల్ని ముక్కుపిండి వసూలు చేయాలని, అలా చేయని అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారాయన. వారం రోజుల్లోగా ప్రోగ్రెస్ కనిపించాలన్నారు.

రైతులపై చర్యలా..?

రుణాలు చెల్లించని రైతులపై చర్యలు తీసుకుంటామన్న మంత్రి వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. రైతులకు పెట్టుబడి సాయం చేయాల్సిన ప్రభుత్వం రుణ చెల్లింపులు ఆలస్యమయితే చర్యలు తీసుకుంటామనడం దారుణమంటున్నారు రైతు సంఘాల నేతలు. మంత్రి వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించారు. తమది రైతు పక్షపాత ప్రభుత్వం అని దావోస్ సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి కీలక ఉపన్యాసం ఇచ్చిన రోజే, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల ఇక్కడ రైతు రుణాల రికవరీపై కఠిన ఆదేశాలు ఇవ్వడం విశేషం.

అయితే మంత్రి ఉద్దేశం అది కాదని, పారు బాకీలు, నిబంధనలకు విరుద్ధంగా తీసుకున్న రుణాలపైనే ఆయన ఆ ఆదేశాలిచ్చారని వివరణ ఇస్తున్నారు కాంగ్రెస్ నేతలు. మొత్తమ్మీద మంత్రి వ్యాఖ్యలు మాత్రం తెలంగాణలో కలకలం సృష్టించాయి. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను బలోపేతం చేయాలంటే వాటికి మూలధనం సమకూర్చి ప్రభుత్వం ఆదుకోవాలి. బ్యాంకింగ్ కార్యకలాపాల పటిష్టతకోసం కృషి చేయాలి. అది చేయలేక, సాగుకోసం తీసుకున్న రుణాల చెల్లింపుకోసం పట్టుబట్టడం సరికాదంటున్నారు రైతు సంఘాల నేతలు. ఇలాంటి తలతిక్క నిర్ణయాలతో కాంగ్రెస్ ప్రభుత్వం అభాసుపాలవడం ఖాయమని కౌంటర్ ఇస్తున్నారు. 

Tags:    
Advertisement

Similar News