కౌరవుల పక్కన కూర్చుని ధర్మ యుద్ధమా..?

కౌరవుల పక్కన ఉండి ధర్మయుద్ధం గురించి ఈటల మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. ధర్మం, భాష గురించి మాట్లాడి ఈటల సానుభూతి పొందలేరని చెప్పారు.

Advertisement
Update: 2022-11-02 14:35 GMT

తనపై హత్యాయత్నం జరిగిందని, తనని హత్య చేసేందుకు టీఆర్ఎస్ కుట్ర చేస్తోందంటూ ఈటల రాజేందర్ చేసిన ఆరోపణలపై ఘాటుగా స్పందించారు మంత్రి జగదీష్ రెడ్డి. ఈటల రాజేందర్ సానుభూతికోసం ప్రయత్నిస్తున్నారని, తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. కౌరవుల పక్కన ఉండి ధర్మయుద్ధం గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. ధర్మం, భాష గురించి మాట్లాడి ఈటల సానుభూతి పొందలేరని చెప్పారు జగదీష్ రెడ్డి.

సీఎం కేసీఆర్ పై బీజేపీ నాయకులు మాట్లాడే భాషను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు జగదీష్ రెడ్డి. రెండేళ్లుగా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి ఈటల ప్రయత్నిస్తున్నారని చెప్పారు. పరివేలి గ్రామంలో బీజేపీకి మెజారిటీ రాదని స్పష్టంగా తేలడంతో.. హైదరాబాద్‌ నుంచి వచ్చిన గూండాలు టీఆర్ఎస్ కార్యకర్తలపై దాడి చేశారని వివరించారు. గతంలో పశ్చిమ బెంగాల్ లో కూడా ఇలాగే దాడులు జరిగాయని, చివరకు బీజేపీకి ఎదురు దెబ్బ తగిలిందని గుర్తు చేశారు. హింసను కేసీఆర్‌ ఎప్పుడూ ఇష్టపడరని, శాంతియుత వాతావరణం ఉంటేనే అభివృధ్ధి సాధ్యమనేది కేసీఆర్ సిద్ధాంతం అని చెప్పారు. 8 ఏళ్ల కేసీఆర్‌ పాలనలో ఎప్పుడూ రాజకీయ ఘర్షణలు జరగలేదని చెప్పారు జగదీష్ రెడ్డి.

ఎప్పుడు ఎవరు మాయమవుతారో..?

దాడులు చేయడం, సాక్షులు కనిపించకుండా చేయడం, మనుషుల్ని మాయం చేయడం అన్నీ బీజేపీకి అలవాటేనని అన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. ఏక్షణంలో మాయమైపోతామోనని బీజేపీలోని పెద్ద నాయకులే భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. కేంద్ర సంస్థలను అడ్డుపెట్టి మునుగోడు వెళ్లకుండా తనని అడ్డుకున్నా, తానెప్పుడూ సానుభూతికోసం ప్రయత్నించలేదని చెప్పారు. జనం లేకే బీజేపీ నేతలు సభలు రద్దు చేసుకున్నారని దెప్పిపొడిచారు. రాష్ట్ర పోలీసులు బీజేపీ నేతల ఇళ్లలో సోదాలు చేయడం లేదని, కానీ కేంద్రం.. దర్యాప్తు సంస్థల పేర్లు చెప్పి రాష్ట్ర నేతల్ని బీజేపీ భయపెట్టాలని చూస్తోందని చెప్పారు జగదీష్ రెడ్డి.

Tags:    
Advertisement

Similar News