వెంటనే ఆ పని మొదలు పెట్టండి.. కూసుకుంట్లకు కేసీఆర్ దిశానిర్దేశం

అభివృద్ధి పనులపై తక్షణం దృష్టి సారించాలని సూచించారు. ఎన్నికలకు వెళ్లేలోగా మునుగోడులో అభివృద్ధి చూపించాలన్నారు. గత ఎమ్మెల్యేకు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు మధ్య తేడా ఏంటో ప్రజలు గుర్తించేలా పని చేయాలన్నారు సీఎం కేసీఆర్.

Advertisement
Update: 2022-11-07 15:40 GMT

మునుగోడులో ప్రత్యర్థులను చిత్తు చేసిన టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, సీఎం కేసీఆర్‌ని మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ని కలసి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. తన విజయానికి కారణమైనందుకు ముఖ్యమంత్రికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా కూసుకుంట్లతో మాట్లాడారు కేసీఆర్. భవిష్యత్ కార్యాచరణపై దృష్టి పెట్టాలన్నారు.

మునుగోడు ప్రచారంలో నియోజకవర్గ ప్రజలకు పలు హామీలను ఇచ్చారు అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి. మంత్రి కేటీఆర్ మునుగోడుని దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తానని చెప్పారు. సీఎం కేసీఆర్ కూడా ప్రత్యేకంగా ఇప్పుడు ఆ హామీలను కూసుకుంట్లకు గుర్తు చేశారు. అభివృద్ధి పనులపై తక్షణం దృష్టి సారించాలని సూచించారు. ఎన్నికలకు వెళ్లేలోగా మునుగోడులో అభివృద్ధి చూపించాలన్నారు. గత ఎమ్మెల్యేకు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు మధ్య తేడా ఏంటో ప్రజలు గుర్తించేలా పని చేయాలన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను కార్యాచరణలో పెట్టేందుకు సిద్ధమవ్వాలని చెప్పారు కేసీఆర్. సంబంధిత శాఖల మంత్రులు, అధికారులతో సమన్వయం చేసుకుంటూ తగిన విధంగా ప్రణాళికలు తయారు చేసుకోవాలని చెప్పారు.

అందరికీ అభినందనలు..

టీఆర్ఎస్ నాయకత్వంపై నమ్మకంతో ప్రజలు మునుగోడులో కూసుకుంట్లను గెలిపించారని అన్నారు సీఎం కేసీఆర్. ఈ సందర్భంగా తనను కలవడానికి వచ్చిన మంత్రి జగదీష్ రెడ్డి సహా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కేసీఆర్ అభినందించారు. మునుగోడులో అందరూ సమన్వయంతో కలసి పనిచేయడం వల్ల విజయం సాధించగలిగామని చెప్పారు. భవిష్యత్తులో కూడా కూసుకుంట్లకు అదే స్థాయిలో మద్దతు ఇవ్వాలని, నియోజకవర్గ అభివృద్ధిపై అందరూ దృష్టి పెట్టాలన్నారు.

Tags:    
Advertisement

Similar News