బీఆర్ఎస్ శాసనసభపక్ష నేతగా కేసీఆర్ ఏకగ్రీవ ఎన్నిక

ఎమ్మెల్యేలు తెలంగాణ భవన్‌లో సమావేశమై శాసనసభ పక్షనేతను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమం బీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కె. కేశవరావు అధ్యక్షతన జరిగింది.

Advertisement
Update: 2023-12-09 06:31 GMT

బీఆర్ఎస్ శాసనసభపక్ష నేతగా కేసీఆర్‌ను ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ 39 స్థానాలు గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం తెలంగాణ భవన్‌లో సమావేశం అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఈ మేరకు తీర్మానం చేశారు. శాసనసభ పక్ష నేతగా కేసీఆర్ పేరును బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ప్రతిపాదించారు. ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, తలసాని శ్రీనివాస్ యాదవ్ దాన్ని బలపరిచారు. శాసనసభ పక్షనేతగా పార్టీ అధినేత కేసీఆర్‌ను ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

శాసనసభ పక్షానికి సంబంధించి మిగిలిన సభ్యుల ఎంపిక బాధ్యతను కేసీఆర్‌కు అప్పగిస్తూ బీఆర్ఎస్ఎల్పీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇటీవల ఇంట్లో జారి పడటంతో య‌శోద ఆస్ప‌త్రిలో శస్త్రచికిత్స జరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఆరోగ్య ప‌రిస్థితి నిల‌క‌డ‌గా ఉంద‌ని వైద్యులు చెప్పారు.

ఈ నేపథ్యంలో మిగిలిన 38 మంది ఎమ్మెల్యేలు తెలంగాణ భవన్‌లో సమావేశమై శాసనసభ పక్షనేతను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమం బీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కె. కేశవరావు అధ్యక్షతన జరిగింది. సమావేశం ముగిసిన తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంతా అసెంబ్లీ ముందు ఉన్న తెలంగాణ అమరవీరుల స్థూపం వద్దకు వెళ్లి నివాళులు అర్పించారు. అనంతరం అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు.

Tags:    
Advertisement

Similar News