నేడు తెలంగాణ అసెంబ్లీని ప్రోరోగ్ చేయనున్న గవర్నర్!

గతంలో అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు వాటిని నిరవధిక వాయిదా (ఇన్‌డెఫినేట్ పోస్ట్ పోన్) వేశారు. దీంతో ఆ సమావేశాలను ప్రోరోగ్ చేస్తున్నట్లు రాజ్‌భవన్ నుంచి ఇవ్వాళ నోటిఫికేషన్ వెలువడనున్నది.

Advertisement
Update: 2023-01-31 03:20 GMT

తెలంగాణ గవర్నర్, ప్రభుత్వానికి మధ్య ఉన్న వివాదం సమసిపోవడంతో అసెంబ్లీ సమావేశాలకు లైన్ క్లియర్ అయ్యింది. ఈ సారి బడ్జెట్ సమావేశాల ముందు గవర్నర్ ప్రసంగం ఉంటుందని ప్రభుత్వం ఇప్పటికే హైకోర్టుకు స్పష్టం చేసింది. ఫిబ్రవరి 3 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండగా.. అదే రోజు మధ్యాహ్నం 12.10 గంటలకు గవర్నర్ ప్రసంగం ఉంటుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అయితే గవర్నర్ ప్రసంగంతో సమావేశాలు మొదలు కావాలంటే సాంకేతికంగా గత సమావేశాలను ప్రోరోగ్ చేయాల్సి ఉన్నది.

గతంలో అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు వాటిని నిరవధిక వాయిదా (ఇన్‌డెఫినేట్ పోస్ట్ పోన్) వేశారు. దీంతో ఆ సమావేశాలను ప్రోరోగ్ చేస్తున్నట్లు రాజ్‌భవన్ నుంచి ఇవ్వాళ నోటిఫికేషన్ వెలువడనున్నది. అదే సమయంలో బడ్జెట్ సమావేశాలకు సంబంధించిన ఆమోదం కూడా గవర్నర్ ఇవ్వనున్నారు. బడ్జెట్ సమావేశాలను ప్రారంభించి, ప్రసంగించాల్సిందిగా గవర్నర్ తమిళిసైని ఆర్థిక శాఖ ప్రత్యేకకార్యదర్శి రామకృష్ణారావు, అసెంబ్లీ కార్యదర్శి నర్పింహాచార్యులు ఆహ్వానించారు. గవర్నర్ బడ్జెట్ ముసాయిదాకు ఆమోదం తెలియజేయడంతో దానికి తుది మెరుగులు దిద్దే ప్రక్రియ వేగవంతమైంది.

ఫిబ్రవరి మధ్యాహ్నం 12.10కి గవర్నర్ ప్రసంగించనున్నారు. ఆ తర్వాత రాజు ఆమె ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై శాసన సభ,శాసన మండలిలో చర్చ జరిపి ఆమోదం పొందనున్నారు. ఇక ఆదివారం సెలవు ఇచ్చిన తర్వాత సోమవారం ఉదయం నుంచి బడ్జెట్ సెషన్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తున్నది. ఫిబ్రవరి 6న ఉదయం 10.30 గంటలకు ఆర్థిక మంత్రి టి. హరీశ్ రావు బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెడతారు. అలాగే మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి శాసన మండలిలో ప్రవేశపెడతారు.

సమావేశాలకు ముందే బిజినెస్ అడ్వయిజరీ కమిటీ (బీఏసీ) తీసుకునే నిర్ణయానికి అనుగుణంగా ఎన్ని రోజులు సభ జరగాలి, ఏయే అంశాలపై చర్చ జరగాలనే విషయాలు తెలియనున్నాయి. ఈ సారి బడ్జెట్ సమావేశాలు వారం రోజుల పాటు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది.

బిల్లులకు మోక్షం:

గతంలో ఇరు సభలు ఆమోదించిన పలు బిల్లులు గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. వాటికి కూడా ఇవాళ మోక్షం కలిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. గతంలోనే మంత్రి సబితా ఇంద్రారెడ్డి దీనిపై గవర్నర్‌ను కలిసి చర్చించారు. కానీ రాజ్‌భవన్ నుంచి మాత్రం అవి బయటకు రాలేదు. ప్రస్తుతం గవర్నర్‌తో సయోధ్య కుదరడంతో ఆ బిల్లులు ఆమోదం పొంది చట్టరూపం దాల్చే అవకాశం ఉన్నది.

Tags:    
Advertisement

Similar News