హైదరాబాద్‌ను వరల్డ్ హెరిటేజ్ సిటీగా మార్చడమే ప్రభుత్వం లక్ష్యం : మంత్రి కేటీఆర్

నగరానికి వారసత్వంగా వచ్చిన కట్టడాలను సంరక్షించుకోవడం మన బాధ్యత అని మంత్రి కేటీఆర్ చెప్పారు.

Advertisement
Update: 2023-04-18 12:05 GMT

హైదరాబాద్ నగరాన్ని వరల్డ్ హెరిటేజ్ సిటీగా మార్చడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. వరల్డ్ హెరిటేజ్ డే సందర్భంగా నగరంలోని పలు వారసత్వ కట్టడాలకు సంబంధించిన ఫొటోలను ఆయన ట్విట్టర్‌లో షేర్ చేశారు. గత కొన్నేళ్లుగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ ఆధ్వర్యంలో.. ఇతర ప్రభుత్వ శాఖల సహకారంతో అనేక వారసత్వ కట్టడాలను పునరుద్ధరించాము. గతంలో శిథిలావస్థకు చేరుకున్న ఆ సంపదను.. ఇప్పడు అద్భుతమైన టూరిస్ట్ ప్లేస్‌లుగా మార్చినట్లు మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

హైదరాబాద్ నగరంలో ఉన్న ఇలాంటి ప్రదేశాలు సరికొత్త శోభను సంతరించుకొని పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. బన్సీలాల్‌పేటలోని మెట్ల బావి పూర్తిగా చెత్తాచెదారంతో నిండిపోగా.. ఇటీవలే దాన్ని పునరుద్ధరించారు. మొజంజాహీ మార్కెట్, క్లాక్ టవర్, గోల్కొండ మెట్ల బావి కూడా పూర్వ శోభను సంతరించుకున్నాయి. నగరానికి వారసత్వంగా వచ్చిన కట్టడాలను సంరక్షించుకోవడం మన బాధ్యత అని మంత్రి చెప్పారు.

యునెస్కో ప్రతీ ఏడాది ఏప్రిల్ 18న వరల్డ్ హెరిటేజ్ డేగా నిర్వహిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వారసత్వ కట్టడాలను పునరుద్ధరించడం, రాబోయే తరాల కోసం వాటిని సంరక్షించడం యునెస్కో బాధ్యత. స్థానిక ప్రభుత్వాలతో కలిసి ఈ పనులను గత కొన్నేళ్లుగా యునెస్కో చేపడుతున్నది. ఆయా ప్రభుత్వాలకు ప్రోత్సహకంగా అవార్డులు కూడా అందిస్తోంది.

ప్రతీ ఏడాది ఒక థీమ్‌తో ఈ వరల్డ్ హెరిటేజ్‌ డేను నిర్వహిస్తోంది. కనుమరుగు అవుతున్న సంస్కృతి, కట్టడాలను రక్షిస్తూ.. వాటిని భావి తరాలకు అందిస్తోంది. వారసత్వ కట్టడాలను రక్షించుకోవడం మనందరి బాధ్యత అని.. వాటి వల్లే ఒక దేశ, ప్రాంత సంస్కృతి ఏంటో తెలుస్తుందని యునెస్కో చెబుతున్నది. సంస్కృతి, వారసత్వ సంపదపై అవగాహన కోసమే ఈ రోజు వరల్డ్ హెరిటేజ్ డేగా పాటిస్తోంది.


Tags:    
Advertisement

Similar News