ఒరిజినల్ కాంగ్రెస్.. వ‌ల‌స‌ల కాంగ్రెస్..

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మారతారనే ప్రచారంపై స్పందించిన వీహెచ్ అనుకోకుండా ఇలా చేరికలపై సెటైర్లు వేశారు.

Advertisement
Update: 2022-07-24 02:14 GMT

పార్టీలో చేరికల ద్వారా ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్లకు అన్యాయం చేయొద్దు.. అధిష్టానం ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాలని అంటున్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు. పరోక్షంగా ఆయన రేవంత్ రెడ్డిని దృష్టిలో పెట్టుకుని మరోసారి ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్లు అంటూ తన అక్కసు వెళ్లగక్కారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మారతారనే ప్రచారంపై స్పందించిన వీహెచ్ అనుకోకుండా ఇలా చేరికలపై సెటైర్లు వేశారు.

కాంగ్రెస్‌ అంటేనే నల్గొండ అని చెబుతుంటారని.. కానీ, ఆ జిల్లాలోనే కాంగ్రెస్ పార్టీలో లుకలుకలు ఉన్నాయని అన్నారు వీహెచ్. కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి విషయంలో ఎంపీలు వెంకట్ రెడ్డి, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి స్పందించాలని కోరారు. తమ్ముడు పార్టీ వీడి వెళ్తానంటే.. స్టార్‌ క్యాంపెయినర్‌ వెంకట్ రెడ్డి మాట్లాడకపోతే ఎలా? అని ప్రశ్నించారు వీహెచ్. రాజగోపాల్‌ రెడ్డి కూడా పార్టీని వదిలి వెళ్లిపోతే కాంగ్రెస్‌ కి తెలంగాణలో ఇక నలుగురే ఎమ్మెల్యేలు ఉంటారని అన్నారు వీహెచ్. దీనిపై సీఎల్పీనేత భట్టి విక్రమార్క కూడా స్పందించాలని కోరారు.

పీసీసీ పదవి రేవంత్ రెడ్డికి ఇవ్వడంపై మొదటినుంచీ వీహెచ్ అసంతృప్తితో ఉన్నారు. సమయం వచ్చినప్పుడల్లా ఆయన అదే విషయాన్ని ఎత్తిపొడుస్తుంటారు. జగ్గారెడ్డి, ఇతర నేతలతో కలసి వీహెచ్ గ్రూపు రాజకీయాలు నడుపుతున్నా.. అధిష్టానానికి మాత్రం వీరంతా బద్ధులుగానే ఉంటామని చెబుతుంటారు. తాజాగా రాజగోపాల్ రెడ్డి పార్టీ మారతారనే ప్రచారంతో వీహెచ్ ఒరిజినల్ కాంగ్రెస్ వాదులు అనే పదప్రయోగం చేశారు.

రాజగోపాల్ రెడ్డి లాంటి నేతలు మొదటినుంచీ కాంగ్రెస్ ని నమ్ముకుని ఉన్నారని, అలాంటివారిని వదులుకోవడం సరికాదని అంటున్నారు. అలాంటి ఒరిజినల్ నాయకులను వదులుకుని, పార్టీలో చేరేవారితో బలపడతామని అనుకోవద్దని హితవు పలికారు. చేరికల ద్వారా ఒరిజినల్ నాయకులకు అన్యాయం జరుగుతుందని, అధిష్టానం ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు వీహెచ్. మొత్తమ్మీద రాజగోపాల్ రెడ్డి ఎపిసోడ్ తో ఒరిజినల్, చేరికల కాంగ్రెస్ అంటూ.. నాయకుల్ని సెపరేట్ చేస్తూ వీహెచ్ మాట్లాడటం ఇప్పుడు హాటి టాపిక్ గా మారింది.

Tags:    
Advertisement

Similar News