కొడంగల్ అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

తాను ఎక్కడున్నా తన రెండు కళ్లలో ఒక కన్ను మాత్రం కొడంగల్‌పై ఉంటుందని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక్కడి ప్రజల్ని తాను ఎప్పుడూ కాపాడుకుంటానని చెప్పారు.

Advertisement
Update: 2024-03-28 15:56 GMT

కొడంగల్ అభివృద్ధి తన లక్ష్యమని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. తన ప్రతి కష్టంలోనూ కొడంగల్ ప్రజలు అండగా నిలిచారని, అందుకే వారి అభివృద్ధిలో తాను భాగస్వామి కావాలనుకుంటున్నానని అన్నారు. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం కొడంగల్ లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారాయన. ఎమ్మెల్యేగా ఈ ప్రాంత అభివృద్ధి తన బాధ్యత అని, ముఖ్యమంత్రి హోదాలో ఈ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెడతానన్నారు రేవంత్ రెడ్డి.

కొడంగల్ ప్రాంతానికి త్వరలో సిమెంటు పరిశ్రమలు రాబోతున్నాయని తెలిపారు రేవంత్ రెడ్డి. ఈ ప్రాంతంలో అపారమైన సున్నపు గనులు ఉన్నాయని, గత పాలకుల నిర్లక్ష్యంతో పరిశ్రమలు రాలేదని, ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో పరిశ్రమలు తీసుకొస్తామన్నారు. పరిశ్రమలు ఏర్పాటైతే ఈ ప్రాంతంలో భూముల విలువలు పెరుగుతాయని చెప్పారాయన. ఫార్మా కంపెనీలు కూడా కొడంగల్ కు వస్తాయన్నారు. స్థానిక యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి.

భూ సేకరణ కీలకం..

కొడంగల్ అభివృద్ధికి పరిశ్రమలు రావాలని, అవి రావాలంటే భూ సేకరణ కీలకం అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. భూసేకరణకు ప్రజలు సహకరిస్తే పరిశ్రమల ఏర్పాటు సులభతరం అవుతుందని విజ్ఞప్తి చేశారు. భూసేకరణలో పట్టా భూములకు, అసైన్డ్ భూములకు ఒకే ధర చెల్లించాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని ఆయన చెప్పారు. తాను ఎక్కడున్నా తన రెండు కళ్లలో ఒక కన్ను మాత్రం కొడంగల్‌పై ఉంటుందని అన్నారు. ఇక్కడి ప్రజల్ని తాను ఎప్పుడూ కాపాడుకుంటానని చెప్పారు రేవంత్ రెడ్డి. 

Tags:    
Advertisement

Similar News