ఆక్రమణలు లేని నగరంగా హైదరాబాద్..

రిమూవల్ ఆఫ్ అబ్ స్ట్రక్టివ్ పార్కింగ్ అండ్ ఎన్ క్రోచ్ మెంట్ (రోప్) పేరుతో కార్యాచరణ రూపొందించారు. ఏడాదిలోగా హైదరాబాద్ ని ఆక్రమణలు లేని నగరంగా మారుస్తామంటున్నారు నగర కమిషనర్ సీవీ ఆనంద్.

Advertisement
Update: 2022-09-30 02:21 GMT

ఇటీవల భారీ వర్షాల సందర్భంగా హైదరాబాద్, బెంగళూరు మధ్య పోలికలు బయటకొచ్చాయి. బెంగళూరులో ట్రాఫిక్ నరకం చూపెడుతుందని, హైదరాబాద్ లో ఆ అవస్థ అంతగా ఉండదని కొంతమంది టెకీలు తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. జనాభాపరంగా చూస్తే హైదరాబాద్ లో ఆ మాత్రం ట్రాఫిక్ సమస్యలు సహజమే. కానీ ఆ సమస్యకు కూడా ఫుట్ పాత్ ల ఆక్రమణ, అక్రమ పార్కింగ్ కారణాలుగా నిలుస్తున్నాయి. దీనిపై ఇప్పుడు నగర పోలీసులు సీరియస్ గా దృష్టిపెట్టారు. రిమూవల్ ఆఫ్ అబ్ స్ట్రక్టివ్ పార్కింగ్ అండ్ ఎన్ క్రోచ్ మెంట్ (రోప్) పేరుతో కార్యాచరణ రూపొందించారు. ఏడాదిలోగా హైదరాబాద్ ని ఆక్రమణలు లేని నగరంగా మారుస్తామంటున్నారు నగర కమిషనర్ సీవీ ఆనంద్.

ఆక్రమణలపై దృష్టి..

ఇటీవల ట్రాఫిక్ సిబ్బందితో సమీక్ష నిర్వహించామని చెప్పారు సీవీ ఆనంద్. సిగ్నళ్ల వద్ద కిలోమీటర్ల మేర వాహనాల బారులు ఉండటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, వీటిని పరిష్కరించేందుకు కఠిన నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారాయన. హైదరాబాద్‌లో పార్కింగ్‌, ఫుట్‌ పాత్‌ ఆక్రమణలపై దృష్టి పెడతామన్నారు సీవీ ఆనంద్. ఫుట్ పాత్ ని కూడా కాదని, రోడ్డుపైకే వచ్చి చాలామంది వ్యాపారాలు చేస్తున్నారని, అలాంటి వారికి జరిమానాలతో కాకుండా, అవగాహన కల్పించి మార్పు తీసుకొస్తామన్నారు.

పార్కింగ్ ఏరియా ఉండాల్సిందే..

మల్టీ ప్లెక్స్‌ లకు నిర్మాణ స్థలంలో 60శాతం పార్కింగ్ ఏరియా ఉండాలి. మాల్స్‌లో 60శాతం, కమర్షియల్‌ బిల్డింగ్స్‌ కి 40శాతం, అపార్ట్‌ మెంట్స్‌లో 30శాతం పార్కింగ్‌ ఏరియా కచ్చితంగా ఉండాలి. జీహెచ్‌ ఎంసీతో కలిసి ఈ నియమ నిబంధనలు కచ్చితంగా అమలయ్యేలా చూస్తామన్నారు సీవీ ఆనంద్. ట్రాఫిక్‌ రూల్స్‌ అందరూ పాటించేలా చూస్తామని, చలాన్లు, కేసుల సంఖ్యపై కాకుండా.. ప్రజలకు అవగాహన కల్పించడంపై దృష్టిపెడతామన్నారు.

అన్ని ఫోన్ కాల్స్ ఇవే..

నేర నియంత్రణకోసం పెట్టిన డయల్‌ 100 టోల్ ఫ్రీ నెంబర్ కు ప్రతి రోజూ 70 నుంచి 80శాతం ఫోన్లు ట్రాఫిక్‌ సమస్యలపైనే వస్తుంటాయి. ఫిర్యాదులు చేసే వారే చాలా సార్లు ట్రాఫిక్ నిబంధనలు పాటించరు. తమదాకా వస్తే మాత్రం కంప్లయింట్ ఇచ్చేందుకు వెనకాడరు. ముందు ప్రజల్లో అవగాహన పెంచాలని, ఆ దిశగా అడుగులేస్తున్నామని చెప్పారు హైదరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్. అదే సమయంలో రోడ్డుకు అడ్డంగా ఉన్న ఎలాంటి నిర్మాణాలనైనా తొలగిస్తామంటూ హెచ్చరించారు. హైదరాబాద్ ని ఆక్రమణలు లేని నగరంగా మారుస్తామని చెబుతున్నారు.

Tags:    
Advertisement

Similar News