కేసీఆర్ తో సీపీఐ నేతల సమావేశం...మునుగోడులో టీఆరెస్ కు మద్దతు ?

మునుగోడు ఉపఎన్నికలో టీఆరెస్ అభ్యర్థికి సీపీఐ మద్దతు ఇవ్వబోతున్నట్టు సమాచారం ఈ రోజు సీపీఐ నేతలు చాడా వెంకట్ రెడ్డి, కూనంనేని సాంభశివరావులు ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిశారు.

Advertisement
Update: 2022-08-19 18:00 GMT

మునుగోడు ఎన్నికలు అన్ని పారీలకు ప్రతిష్టాత్మకంగా తయారయ్యాయి. ఎవరికి వారు గెలుపు ధీమాతో ఉన్నారు. అక్కడ ప్రధానంగా మూడుపార్టీల మ‌ధ్య‌ పోటీ కేంద్రీకృతం కానుంది. టీఆరెస్, కాంగ్రెస్, బీజేపీలు గెలుపు కోసం తీవ్రంగానే కృషి చేస్తున్నాయి. అయితే ఇక్కడ దాదాపు ఐదు సార్లు గెలిచి మంచి ఓటు బ్యాంకు ఉన్న సీపీఐ ఎవరికి మద్దతుగా నిలుస్తుందనే విషయం ఇప్పటి వరకు స్పష్టం కాలేదు. సీపీఐ ఎవరికీ మద్దతు ఇవ్వకుండా ఆ పార్టీ కూడా రంగంలో ఉంటే తమకు ఉపయోగమని భావిస్తున్న బీజేపీ సీపీఐని రంగంలోకి లాగడానికి ప్రయత్నాలు చేస్తోంది. మరో వైపు టీఆరెస్, కాంగ్రెస్ పార్టీలు సీపీఐ మద్దతు కోసం ప్రయత్నిస్తున్నాయి.

అయితే బీజేపీని ఓడించడమే తమ లక్ష్యమని, ఆ పార్టీని ఓడించగలిగే పార్టీకే తమ మద్దతు ఇస్తామని సీపీఐ గతంలోనే ప్రకటించింది. ఈనేపథ్యంలో ఇవ్వాళ్ళ సీపీఐ నేతలు చాడా వెంకట్ రెడ్డి, కూనంనేని సాంభశివరావులు ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిశారు. గంటకు పైగా జరిగిన వీరి సమావేశంలో ప్రధానంగా మునుగోడు ఎన్నిక పైనే చర్చజరిగినట్టు సమాచారం. బీజేపీని ఓడించడం కోసం టీఆరెస్ కు మద్దతు తెలపడానికి సీపీఐ నేతలు అంగీకరించినట్టు తెలుస్తోంది. అయితే బహిరంగంగా మాత్రం ఇప్పటి వరకు సీపీఐ నేతలు స్పష్టమైన‌ ప్రకటన చేయ‌కపోయినప్పటికీ కేసీఆర్ తో సమావేశం తర్వాత ప్రగతిశీల శక్తులకు తమ మద్దతు ఉంటుందని ప్రకటించారు. 

Tags:    
Advertisement

Similar News