'బీజేపీ నాయకులు సత్య హరిశ్చంద్రుడి బావమ‌రుదులు'

ప్రతిపక్షాలపై సీబీఐ , ఈడీ దాడులకు పాల్పడటం పట్ల తెలంగాణ మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు. బీజేపీలో ఒక్కరు కూడా అవినీతి పరులు లేరా అంటూ ఆయన ప్రశ్నించారు.

Advertisement
Update: 2022-10-07 08:30 GMT

మోడీ అధికారంలోకి వచ్చాక బీజేపీ నాయకులంతా హరిశ్చంద్రుడి బావమరుదులై పోయారని తెలంగాణ మున్సిపల్, ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ అన్నారు. అందుకే ఒక్క బీజేపీ నాయకుడి మీద సీబీఐ, ఈడీ, ఐటీ దాడులు జరగడం లేదని ఆయన చెప్పారు.

అదే సమయంలో ప్రతిపక్ష పార్టీల నాయకులంతా మోడీ దృష్టిలో అవినీతిపరులై పోయి దాడులను ఎదుర్కొంటున్నారని, పన్ను ఎగవేత దారులు, ఆర్థిక నేరస్తులు తదితరులందరినీ వదిలేసి ప్రతిపక్ష నాయకుల మీదనే ఈ బీజేపీ ప్రభుత్వం దృష్టి సారించిందని ఆయన ఆరోపించారు.

ఒక వేళ ప్రతిపక్షంలో ఉ‍ండి ఆర్థిక నేరాలకు పాల్పడినా... సీబీఐ, ఈడీ దాడులను ఎదుర్కొన్నప్పటికీ వాళ్ళు బీజేపీ తీర్థం పుచ్చుకోగానే హరిశ్చంద్రుడి బావమరుదులై పోతున్నారని వ్యంగ్యంగా విమర్శించారు. బీజేపీ నాయకులెవరిపైనైనా సీబీఐ, ఈడీ దాడులు జరుగుతున్నాయా? ఆ పార్టీలో ఎవ్వరూ ఆర్థిక అవకతవకలకు పాల్పడటం లేదా ? అని ఆయన ప్రశ్నించారు.

ఈ పరిస్థితి ఇలాగే కొనసాగదని త్వరలోనే బీజేపీ నాయకుల అవినీతి అక్రమాలను బైట పెట్టి.. బీజేపీ పార్టీని బట్టలూడదూసి జనం ముందు నిలబెడతామని కేటీఆర్ అన్నారు. 

Tags:    
Advertisement

Similar News