అన్నయ్య అన్నయ్యే.. పార్టీ పార్టీయే..

అన్నయ్య కంటే జగనన్నయ్యే తమకు ముఖ్యమని అంటున్నారు ఆనం సోదరుడు విజయ్ కుమార్ రెడ్డి. కుటుంబంతో సహా వెళ్లి ఆయన సీఎం జగన్ ని కలిశారు.

Advertisement
Update: 2023-01-09 16:33 GMT

మాజీ మంత్రి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డిని వైసీపీ కాస్త పక్కనపెట్టిన సంగతి తెలిసిందే. ఆయన ప్లేస్ లో నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డికి పార్టీ బాధ్యతలు అప్పగించారు. ఇన్ చార్జ్ ని చేశారు. ఆనం కూడా పార్టీ మారబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. టీడీపీలో బెర్త్ ఖాయమైందని అంటున్నారు. అయితే అన్నయ్య కంటే జగనన్నయ్యే తమకు ముఖ్యమని అంటున్నారు ఆనం సోదరుడు విజయ్ కుమార్ రెడ్డి. కుటుంబంతో సహా వెళ్లి ఆయన సీఎం జగన్ ని కలిశారు. భార్య అరుణమ్మ, కొడుకు కార్తికేయరెడ్డితో కలసి తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో జగన్ ని కలిశారు విజయ్ కుమార్ రెడ్డి. తమ కుటుంబం ఎప్పుడూ వైసీపీలోనే ఉంటుందని, జగన్ తోనే తమ ప్రయాణం అని చెప్పారు.

ఆనం కుటుంబంలో చీలికలా..?

ఆనం సోదరులు నలుగురు. వివేకానందరెడ్డి, రామనారాయణ రెడ్డి తర్వాత జయ కుమార్ రెడ్డి, విజయ్ కుమార్ రెడ్డి కవల సోదరులు. వివేకానందరెడ్డి, రామనారాయణ రెడ్డి ఎప్పుడూ కలిసే రాజకీయాలు చేసేవారు. వివేకా మరణం తర్వాత విజయ్ కుమార్ రెడ్డి, రామనారాయణ రెడ్డి వైసీపీలో మిగిలారు. జయకుమార్ రెడ్డి టీడీపీతో ఉన్నారనుకున్నా ప్రస్తుతం ఆయన యాక్టివ్ పాలిటిక్స్ కి దూరంగా ఉన్నారు. ఇప్పుడు రామనారాయణ రెడ్డికి వైసీపీలో పొగపెట్టారు. ఆయనతోపాటు విజయ్ కుమార్ రెడ్డి కూడా బయటకు వెళ్తారనుకున్నా, ఆయన అనూహ్యంగా అన్నయ్యకు షాకిచ్చారు. నేరుగా వెళ్లి జగన్ ని కలిశారు. సొంత అన్నయ్య కంటే, జగనన్నే తనకు ముఖ్యమని తేల్చి చెప్పారు. రామనారాయణ రెడ్డి పార్టీ మారితే, అప్పుడు నెల్లూరు రాజకీయం మరింత రంజుగా ఉండటం ఖాయం.

రూరల్ లో కాక..

నెల్లూరు రూరల్ లో స్థానిక ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డికి, ఆనం విజయ్ కుమార్ రెడ్డికి మధ్య సఖ్యత లేదు. ఇప్పుడు విజయ్ కుమార్ రెడ్డి నేరుగా సీఎం జగన్ ని కలిసి మీతోనే మా ప్రయాణం అన్నారు. అన్నను కాదని తనతోనే ఉన్నందుకు విజయ్ కుమార్ రెడ్డికి జగన్ ఎలాంటి న్యాయం చేస్తారనేది తేలాల్సి ఉంది. నెల్లూరు రూరల్ టికెట్ విషయంలో ఇప్పుడిదే హాట్ టాపిక్ గా మారింది. మొత్తమ్మీద ఎన్నికలకు ఏడాదిన్నర ముందుగానే నెల్లూరు రాజకీయాలు, ముఖ్యంగా వైసీపీ అంతర్గత రాజకీయాలు వేడెక్కాయి.

Tags:    
Advertisement

Similar News