మోదీకి అదానీ పెద్ద కొడుకు, అంబానీ చిన్న కొడుకు..

ప్రధాని నరేంద్రమోదీకి అదానీ, అంబానీ.. పెద్దకొడుకు, చిన్న కొడుకు లాంటి వారని ఎద్దేవా చేశారు సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి.

Advertisement
Update: 2022-08-28 10:54 GMT

ప్రధాని నరేంద్రమోదీకి అదానీ, అంబానీ.. పెద్దకొడుకు, చిన్న కొడుకు లాంటి వారని ఎద్దేవా చేశారు సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి. సహజ వనరులు, దేశ సంపదను మోదీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు దోచి పెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ద్రవ్యోల్బణంతో దేశంలో పేదలు అల్లాడుతోంటే.. మోదీ ప్రభుత్వం జీఎస్టీతో సామాన్యులపై మరింత భారం వేస్తోందని మండిపడ్డారు. మోదీ ప్రభుత్వం అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తోందని, విద్యుత్ సవరణ చట్టం వల్ల సబ్సిడీ ఉండదని, రైతులకు ఉచిత విద్యుత్ దక్కదని అన్నారు.

చరిత్ర వక్రీకరణ..

తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు.. బీజేపీ రాష్ట్ర చరిత్రను వక్రీకరిస్తోందని విమర్శించారు వెంకట రెడ్డి. కొత్తగూడెంలో జరిగిన ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర మహాసభలో మాట్లాడిన ఆయన బీజేపీపై ధ్వజమెత్తారు. మతోన్మాదంతో దేశంలో బీజేపీ పాలన సాగిస్తోందని అన్నారు. విద్యాలయాలు కాషాయ నిలయాలు అవుతున్నాయని, విద్య కాషాయీకరణకు వ్యతిరేకంగా పోరాడాల్సిన సమయం వచ్చిందన్నారు. విద్యాలయాలు మత, కుల నిలయాలు కాకూడదని పోరాడుతోన్న ఏకైక విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్ అని చెప్పారు వెంకట రెడ్డి.

సంఘ్ పరివార్ తో మరింత చేటు..

సంఘ్ పరివార్ శక్తుల ఆగడాలు కూడా పెరిగిపోయాయని అన్నారు చాడ వెంకటరెడ్డి. ప్రశ్నించే వారిని హతమారుస్తూ, రాజద్రోహం కేసులు పెడుతున్నారని చెప్పారు. పౌర హక్కుల ఉల్లంఘనకు ప్రభుత్వాలు వెనకాడ్డంలేదని అన్నారు. విద్యార్థులు చదువుకుంటూనే, సామాజిక ఉద్యమాలకు సిద్ధంగా ఉండాలని సూచించారు. కేంద్రం ప్రజా వ్యతిరేక, విద్యార్థి వ్యతిరేక విధానాలపై తిరగబడాలని పిలుపునిచ్చారు వెంకటరెడ్డి.

Tags:    
Advertisement

Similar News