ప్రపంచకప్ లో ఎవర్ గ్రీన్ స్టార్లు!

భారత కెప్టెన్ రోహిత్ శర్మ, బంగ్లాదేశ్ సారధి షకీబుల్ హసన్ ప్రస్తుత ప్రపంచకప్ లో పాల్గొనడం ద్వారా ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకోబోతున్నారు.

Advertisement
Update: 2022-10-22 05:21 GMT

భారత కెప్టెన్ రోహిత్ శర్మ, బంగ్లాదేశ్ సారధి షకీబుల్ హసన్ ప్రస్తుత ప్రపంచకప్ లో పాల్గొనడం ద్వారా ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకోబోతున్నారు. 2007 ప్రారంభ ప్రపంచకప్ నుంచి ప్రస్తుత 2022 ప్రపంచకప్ వరకూ ప్రతిటోర్నీలోనూ పాల్గొంటూ వచ్చిన అరుదైన క్రికెటర్లుగా చరిత్ర సృష్టించారు....

క్రికెట్ ఫీల్డ్ లో బ్యాటు, బంతి పట్టిన ప్రతిఆటగాడికీ జీవితకాలంలో కనీసం ఒక్కసారి ప్రపంచకప్ టోర్నీలో తమ దేశానికి ప్రాతినిథ్యం వహించినా జన్మధన్యమైనట్లేనని అనుకోవడం సహజమే. అయితే..ఆ అదృష్టం దక్కేది మాత్రం కొందరికే.

మరికొందరు మాత్రం విసుగు విరామం లేకుండా వరుసగా ప్రపంచకప్ టోర్నీలలో పాల్గొంటూనే వస్తూ ఉంటారు. అలాంటి అరుదైన క్రికెటర్లలో భారత, బంగ్లాదేశ్ కెప్టెన్లు రోహిత్ శర్మ, షకీబుల్ హసన్ ప్రముఖంగా కనిపిస్తారు.

2007 నుంచి 2022 ప్రపంచకప్ వరకూ...

2007 ప్రారంభ ప్రపంచకప్ లో పాల్గొన్న రోహిత్ శర్మ, షకీబుల్ హసన్ , దినేశ్ కార్తీక్, సీన్ విలియమ్స్ ప్రస్తుత 2022 ప్రపంచకప్ లో సైతం పాల్గొంటూ తమకుతామే సాటిగా నిలిచారు.

దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన 2007 ప్రారంభ ప్రపంచకప్ లో మహేంద్రసింగ్ ధోనీ నాయకత్వంలోని భారతజట్టు ఓపెనర్ గా బరిలోకి దిగిన రోహిత్ శర్మ పలు కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ప్రపంచకప్ విజేతగా భారత్ నిలవడంలో రోహిత్ తనవంతు పాత్ర నిర్వర్తించాడు. అంతేకాదు..2007 నుంచి ప్రస్తుత 2022 ప్రపంచకప్ వరకూ...ప్రతిటోర్నీలోనూ పాల్గొంటూ వచ్చిన అతికొద్దిమంది ఆటగాళ్లలో రోహిత్ ఒకడుగా మిగిలిపోతాడు. ప్రస్తుత ప్రపంచకప్ లో భారత్ కు రోహిత్ నాయకత్వం వహిస్తున్నాడు. తనజట్టును 15 సంవత్సరాల విరామం తర్వాత మరోసారి ప్రపంచ చాంపియన్ గా నిలపాలన్న పట్టుదలతో ఉన్నాడు.

దటీజ్ దినేశ్ కార్తీక్...

2007 ప్రపంచకప్ లో పాల్గొన్న భారతజట్టులో సభ్యుడిగా ఉన్న వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ దినేశ్ కార్తీక్...ప్రస్తుత ప్రపంచకప్ లో సైతం ప్రధాన వికెట్ కీపర్ గా బరిలోకి దిగుతున్నాడు. తుదిజట్టులో చోటు లేకున్నా సబ్ స్టిట్యూట్ ఫీల్డర్ గా కళ్లు చెదిరే క్యాచ్ పట్టి వారేవ్వా అనిపించుకొన్నాడు. ఆ తర్వాత 2010 ప్రపంచకప్ లో సైతం భారత్ కు దినేశ్ కార్తీక్ ప్రాతినిథ్యం వహించాడు. తిరిగి 12 సంవత్సరాల సుదీర్ఘవిరామం తర్వాత తన కెరియర్ లో ఆఖరి ప్రపంచకప్ ఆడుతున్నాడు. ఫినిషర్ గా కీలకపాత్ర వహించబోతున్నాడు.

బంగ్లా సూపర్ ఆల్ రౌండర్ షకీబుల్...

బంగ్లాదేశ్ లెఫ్టామ్ స్పిన్ ఆల్ రౌండర్ షకీబుల్ హసన్ సైతం 2007 ప్రారంభ ప్రపంచకప్ నుంచి ప్రస్తుత 2022 ప్రపంచకప్ వరకూ ప్రతిటో్ర్నీలోనూ ఆడుతూ వచ్చిన మొనగాడిగా రికార్డుల్లో నిలిచాడు.

ఆల్ రౌండర్ గా పలు అరుదైన రికార్డులు నెలకొల్పిన షకీబుల్ హసన్ ప్రస్తుత 2022 ప్రపంచకప్ టోర్నీలో మాత్రం తనజట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు.

సీన్ విలియమ్స్ అరుదైన ఘనత..

2007 ప్రారంభ ప్రపంచకప్ లో ఆస్ట్ర్రేలియాపై సంచలన విజయం సాధించిన జింబాబ్వేజట్టులో సభ్యుడిగా ఉన్న వెటరన్ సీన్ విలియమ్స్ తిరిగి 15 సంవత్సరాల విరామం తర్వాత మరోసారి ప్రపంచకప్ లో పాల్గొనబోతున్నాడు. బ్యాటర్ గా, బౌలర్ గా జింబాబ్వేకి కీలక ఆటగాడుగా ఉన్న సీన్ విలియమ్స్ తనజట్టు జయాపజయాలను తీవ్రంగా ప్రభావితం చేయనున్నాడు.

కంగారూ సూపర్ హిట్టర్ టిమ్ డేవిడ్, భారత స్వింగ్ బౌలర్ హర్షల్ పటేల్, మిస్టర్ 360 హిట్టర్ సూర్యకుమార్ యాదవ్, ఆస్ట్ర్రేలియా ఆల్ రౌండర్ మార్కుస్ స్టోయినిస్ లకు ఇదే తొలి టీ-20 ప్రపంచకప్ కావడం విశేషం.

ఇక..యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు చెందిన 16సంవత్సరాల అయాన్ ఖాన్ ప్రస్తుత ప్రపంచకప్ లో పాల్గొన్న అతిపిన్నవయస్కుడైన క్రికెటర్ కాగా...భారత క్రికెటర్ దినేశ్ కార్తీక్ 37 సంవత్సరాల వయసుతో అతిపెద్ద ఆటగాడిగా రికార్డుల్లో చేరారు.

Tags:    
Advertisement

Similar News