టీ-20 ప్రపంచకప్ లో భారత ఓపెనర్ గా విరాట్ కొహ్లీ?

2024-ఐసీసీ టీ-20 ప్రపంచకప్ లో పాల్గొనే 15 మంది సభ్యుల భారతజట్టును ఖరారు చేయటానికి ఎంపిక సంఘం మల్లగుల్లాలు పడుతోంది. ఓపెనర్ గా విరాట్ కొహ్లీ ఎంపిక దాదాపు ఖాయమయ్యింది.

Advertisement
Update: 2024-04-29 07:30 GMT

2024-ఐసీసీ టీ-20 ప్రపంచకప్ లో పాల్గొనే 15 మంది సభ్యుల భారతజట్టును ఖరారు చేయటానికి ఎంపిక సంఘం మల్లగుల్లాలు పడుతోంది. ఓపెనర్ గా విరాట్ కొహ్లీ ఎంపిక దాదాపు ఖాయమయ్యింది...

వెస్టిండీస్, అమెరికా క్రికెట్ బోర్డుల సంయుక్త ఆతిథ్యంలో జరుగనున్న 2024- ఐసీసీ టీ-20 ప్రపంచకప్ లో పాల్గొనే 15 మంది సభ్యుల భారతజట్టుకు రోహిత్ శర్మ నాయకత్వం వహించడం, ఓపెనర్ గా విరాట్ కొహ్లీని, వికెట్ కీపర్ బ్యాటర్ గా రిషభ్ పంత్ ను, ఓపెనింగ్ బౌలర్ గా జస్ ప్రీత్ బుమ్రా ఎంపిక ఖాయమైపోయింది.

ఐసీసీ విధించిన గడువు ప్రకారం మరో 48 గంటల్లో వివిధ దేశాల క్రికెట్ బోర్డులు తమతమ జట్లను ప్రకటించాల్సి ఉంది.

నాలుగు కీలక నిర్ణయాలపై భారత సెలక్టర్ల కుస్తీ....

టీ-20 ప్రపంచకప్ లో పాల్గొనే భారతజట్టు ను ప్రకటించడానికి సమయం దగ్గర పడుతున్న కొద్దీ..అజిత్ అగార్కర్ నేతృత్వంలోని బీసీసీఐ ఎంపిక సంఘానికి టెన్షన్ పెరిగిపోతోంది. రోహిత్ శర్మ నాయకత్వంలో 15 మంది సభ్యుల తుదిజట్టును ప్రకటించడానికి ఆచితూచి..వేచిచూసే ధోరణిని సెలెక్షన్ కమిటీ అవలంభిస్తోంది.

ప్రస్తుతం దేశంలోని 10కి పైగా వేదికల్లో జరుగుతున్న ఐపీఎల్ -17వ సీజన్ మ్యాచ్ ల్లో ప్రధాన ఆటగాళ్లు కనబరుస్తున్న ప్రదర్శన పైన సెలెక్టర్లు ఓ కన్నేసి ఉంచారు.

తుదిజట్టు కూర్పుపై ఇప్పటికే జట్టు కెప్టెన్ రోహిత్ శర్మతో చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ చర్చించినట్లు బోర్డు వర్గాలు చెబుతున్నాయి.

ఎవరా నలుగురు?

ప్రస్తుత ఐపీఎల్ లో ఉపయోగిస్తున్న పిచ్ లను పోలిఉండే వెస్టిండీస్, అమెరికా దేశాల స్టేడియాలలో జరిగే ప్రపంచకప్ లో టాప్ ర్యాంకర్ భారత్ హాట్ ఫేవరెట్ గా టైటిల్ వేటకు దిగనుంది.

ప్రస్తుత ఐపీఎల్ లో బెంగళూరు ఓపెనర్ గా ఇప్పటికే 500కు పైగా పరుగులు సాధించిన రన్ మెషీన్ విరాట్ కొహ్లీని..ప్రపంచకప్ లో భారత ఓపెనర్ గా బరిలో నిలపడం దాదాపుగా ఖాయమైపోయింది.

ఐపీఎల్ గత 17 సీజన్లలో ఏడుసార్లు 500కు పైగా పరుగులు సాధించిన భారత తొలిబ్యాటర్ గా రికార్డు నెలకొల్పిన విరాట్ కొహ్లీతో కలసి కెప్టెన్ రోహిత్ శర్మ..భారత ఇన్నింగ్స్ ను ప్రారంభించనున్నాడు.

అయితే.. తుదిజట్టులోకి సీనియర్లకే చోటు కల్పించాలా? లేక ఐపీఎల్ లో చెలరేగిపోతున్న యువఆటగాళ్లను చేర్చుకోవాలా అన్న అంశమై సెలెక్టర్లు తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

శుభ్ మన్ గిల్ తో యశస్వీ పోటీ....

భారత మూడో ఓపెనర్ బెర్త్ కోసం యువబ్యాటర్లు శుభ్ మన్ గిల్, యశస్వీ జైశ్వాల్ పోటీపడుతున్నారు. రాజస్థాన్ తరపున యశస్వీ ఇప్పటికే ఓ శతకం బాదడం ద్వారా సత్తా చాటుకోగా..శుభ్ మన్ గిల్ మాజీ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ కు నాయకత్వం వహిస్తూ నిలకడగా రాణిస్తున్నాడు. ఈ ఇద్దరిలో ఒక్కరికి మాత్రమే మూడో ఓపెనర్ గా చోటు దక్కనుంది.

ప్రధాన వికెట్ కీపర్ బ్యాటర్ గా రిషభ్ పంత్ ఎంపిక ఖాయం కాగా..బ్యాకప్ వికెట్ కీపర్ బ్యాటర్ స్థానం కోసం కెఎల్ రాహుల్, సంజు శాంసన్ ల నడుమ గట్టిపోటీనే నెలకొని ఉంది.

ప్రస్తుత ఐపీఎల్ లో రాహుల్ స్థాయికి తగ్గట్టుగా రాణించలేకపోతుంటే..రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ గా సంజు శాంసన్ అంచనాలకు మించి రాణించడం ద్వారా బ్యాకప్ వికెట్ కీపర్ బ్యాటర్ బెర్త్ రేస్ లో నిలిచాడు.

అనుభవంలో రాహుల్, కళ్లు చెదిరే ఫామ్ లో సంజు శాంసన్ ఉండడంతో..ఎవరిని ఎంపిక చేయాలన్న విషయం సెలెక్టర్లకు సవాలుగా మారింది.

హాట్ హాటుగా పేస్ బౌలర్ల పోటీ...

భారత ఓపెనింగ్ బౌలర్ గా జస్ ప్రీత్ బుమ్రా ఎంపిక ఖాయం కాగా..మిగిలిన మూడుస్థానాల కోసం మహ్మద్ సిరాజ్, ముకేశ్ కుమార్, ఆవేశ్ ఖాన్, అర్షదీప్ సింగ్ పోటీపడుతున్నారు.

అర్షదీప్, సిరాజ్ లకు అవకాశం ఎక్కువగా ఉన్నా..మరో స్థానం కోసం ఆవేశ్, ముకేశ్ ల నడుమే పోటీ ప్రధానం కానుంది.

పవర్ హిట్టర్ చోటు ఎవరికో...?

భారత బ్యాటింగ్ ఆర్డర్లో పవర్ హిట్టర్ బెర్త్ కోసం సైతం పోటీ తీవ్రంగా సాగుతోంది. హార్థిక్ పాండ్యా, రవీంద్ర జడేజా స్థాయికి తగ్గట్టుగా రాణించలేకపోడంతో...చెన్నై సూపర్ కింగ్స్ హిట్టర్ శివం దూబే, రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ రియాన్ పరాగ్, కోల్ కతా హిట్టర్ రింకూ సింగ్, ముంబై హిట్టర్ తిలక్ వర్మ సైతం రేస్ లో ముందుకు వచ్చారు.

ప్రస్తుత ఐపీఎల్ ఫామ్ ను పరిగణనలోకి తీసుకొంటే మాత్రం..తుదిజట్టులో శివం దూబేకు చోటు ఖాయం కానుంది. ముంబై కెప్టెన్ , పేస్ ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యా ప్రపంచకప్ అవకాశాలు గాల్లో దీపంగా మారాయి.

బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ లోనూ హార్థిక్ పాండ్యా పూర్వపుస్థాయి జోరును కనబరచక పోడంతో ఎంపిక సంఘం పక్కన పెట్టినా ఆశ్చర్యపోనక్కరలేదు.

Tags:    
Advertisement

Similar News