ఆంధ్రా అథ్లెట్ చేజారిన పారిస్ ఒలింపిక్స్ బెర్త్!

ఆంధ్రా బుల్లెట్, విశాఖ రన్నర్ జ్యోతి ఎర్రాజీని దురదృష్టం వెంటాడింది. వెంట్రుకవాసిలో పారిస్ ఒలింపిక్స్ బెర్త్ చేజారింది.

Advertisement
Update: 2024-05-10 06:35 GMT

ఆంధ్రా బుల్లెట్, విశాఖ రన్నర్ జ్యోతి ఎర్రాజీని దురదృష్టం వెంటాడింది. వెంట్రుకవాసిలో పారిస్ ఒలింపిక్స్ బెర్త్ చేజారింది.

మహిళల 100మీటర్ల హర్డల్స్ లో పారిస్ ఒలింపిక్స్ బెర్త్ సాధించాలని కలలు కన్న విశాఖ రన్నర్, ఆంధ్రా బుల్లెట్ జ్యోతి యర్రాజీని దురదృష్టం వెంటాడింది. సెకనులో 10వ వంతు తేడాలో ఒలింపిక్స్ అర్హత లక్ష్యాన్ని చేరడంలో విఫలమయ్యింది.

స్వర్ణం నెగ్గినా....

పారిస్ ఒలింపిక్స్ కు అర్హతగా నెదర్లాండ్స్ లోని వాట్ వేదికగా జరుగుతున్న 2024- హారీ షుల్టింగ్ గేమ్స్ మహిళల 100 మీటర్ల హర్డల్స్ రేస్ లో జ్యోతి యర్రాజీ ప్రధమస్థానంలో నిలిచినా..ఒలింపిక్స్ అర్హత లక్ష్యాన్ని మాత్రం సాధించలేకపోయింది.

100 మీటర్ల లక్ష్యాన్ని 12.87 సెకన్ల టైమింగ్ తో జ్యోతి పూర్తి చేసింది. అయితే..ఒలింపిక్స్ అర్హత లక్ష్యాన్ని చేరుకోడంలో మాత్రం 0.10 సెకన్ల తేడాలో విఫలమయ్యింది.

ప్రస్తుత సీజన్లో భాగంగా యూరోప్ అవుట్ డోర్ రేస్ లో తొలిసారిగా పాల్గొన్న జ్యోతి బంగారు పతకం గెలుచుకొన్నా ప్రయోజనం లేకపోయింది. నెదర్లాండ్ కు చెందిన మిరా గ్రూట్ 13.67 టైమింగ్ తో రెండు, మరో డచ్ రన్నర్ హన్నా వాన్ బాస్ట్ 13. 84 సెకన్ల టైమింగ్ తో కాంస్య పతకం అందుకొంది.

ఆసియాక్రీడల హర్డల్స్ రేస్ లో రజత పతకం సాధించిన జ్యోతి ఒలింపిక్స్ అర్హత లక్ష్యం 12.77 సెకన్ల టైమింగ్ సాధించలేకపోయింది. అంతకుముందు జరిగిన హీట్స్ ప్రారంభ రేస్ లో 13.04 సెకన్ల టైమింగ్ సాధించిన జ్యోతి ఫైనల్ రేస్ లో టైమింగ్ ను మెరుగు పరచుకొన్నా సెకనులో 10వ వంతు తేడాలో విఫలం కాక తప్పలేదు.

భువనేశ్వర్ లో జ్యోతి సాధన...

భువనేశ్వర్ లోని రిలయన్స్ ఫౌండేషన్ శిక్షణ కేంద్రంలో సాధన చేసిన జ్యోతి...తన కెరియర్ లో సాధించిన అత్యుత్తమ టైమింగ్ రికార్డు 12.78 సెకన్లుగా ఉంది.

చైనాలోని చెంగ్డు వేదికగా జరిగిన ప్రపంచ విశ్వవిద్యాలయ క్రీడలతో పాటు..ఆసియా ఇండోర్ మీట్ లోనూ స్థాయికి తగ్గట్టుగానే రాణించగలిగింది.

ఒలింపిక్స్ కు అర్హత సాధించడానికి జూన్ 30 తుది గడువుగా అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం నిర్ణయించింది.

జూన్ 30 లోగా మరో ఐదు వేర్వేరు రేస్ ల్లో జ్యోతి యర్రాజీ పాల్గోనుంది. ఈ ఐదు రేస్ ల్లో ..ఏ ఒక్క రేసులో 12.77 సెకన్ల టైమింగ్ సాధించినా ఒలింపిక్స్ బెర్త్ దక్కించుకొనే అవకాశం లేకపోలేదు.

ఇదే టోర్నీలో భాగంగా జరిగిన పురుషుల 110 మీటర్ల హర్డల్స్ రేస్ లో భారత్ కు చెందిన తేజాస్ శిర్సీ 13.56 సెకన్ల టైమింగ్ తో బంగారు పతకం అందుకొన్నాడు. పురుషుల 200 మీటర్ల రేస్ లో జాతీయ చాంపియన్ అమ్లాన్ బోర్గెయిన్ పాల్గొనాల్సి ఉంది.

పారిస్ ఒలింపిక్స్ ట్రాక్ అండ్ ఫీల్డ్ అంశాలలో ఇప్పటి వరకూ భారత్ కు చెందిన 19 మంది పురుషుల, మహిళల అథ్లెట్లు ఒలింపిక్స్ బెర్త్ లను సంపాదించగలిగారు.

పారిస్ ఒలింపిక్స్ జులై 26 నుంచి ఆగస్టు 11 వరకూ జరుగనున్నాయి. 204 దేశాలకు చెందిన 10వేల మంది అథ్లెట్లు 32 రకాల క్రీడల్లోతలపడబోతున్నారు.

పారిస్ ఒలింపిక్స్ కు అర్హత సాధించిన ఆంధ్రప్రదేశ్ ఏకైక క్రీడాకారిణి ఇప్పటి వరకూ.. పీవీ సింధు మాత్రమే.

తెలంగాణా బాక్సర్ నిఖత్ జరీన్ ఒలింపిక్స్ మహిళల బాక్సింగ్ 50 కిలోల విభాగంలో పోటీకి దిగనుంది.

Tags:    
Advertisement

Similar News