2024 ప్రపంచకప్ వరకూ రాహుల్ ద్రావిడ్ కాంట్రాక్టు పొడిగింపు!

భారత క్రికెట్ చీఫ్ కోచ్ గా రాహుల్ ద్రావిడ్ కాంట్రాక్టును 2024 టీ-20 ప్రపంచకప్ వరకూ పొడిగించాలని బీసీసీఐ నిర్ణయించింది.

Advertisement
Update: 2023-12-01 12:06 GMT

భారత క్రికెట్ చీఫ్ కోచ్ గా రాహుల్ ద్రావిడ్ కాంట్రాక్టును 2024 టీ-20 ప్రపంచకప్ వరకూ పొడిగించాలని బీసీసీఐ నిర్ణయించింది. ద్రావిడ్ టీమ్ లోని మిగిలిన ముగ్గురు సహాయ శిక్షకులకు సైతం కాంట్రాక్టు పొడిగింపు వర్తిస్తుంది.

ప్రపంచంలోనే అత్యంత భాగ్యవంతమైన భారత క్రికెట్ బోర్డు ఓ తెలివైన నిర్ణయం తీసుకొంది. గత రెండేళ్లుగా భారత క్రికెట్ కు అపురూపసేవలు అందించిన చీఫ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ టీమ్ నే 2024 టీ-20 ప్రపంచకప్ వరకూ కొనసాగించాలని నిర్ణయించింది. ద్రావిడ్ జట్టు అందించిన సేవలను కొనియాడుతూ కాంట్రాక్టు పొడిగింపునకు కారణాలు వివరిస్తూ బీసీసీఐ కార్యదర్శి జే షా అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేశారు.

రాహుల్ ద్రావిడే ఎందుకంటే?

2021 సీజన్లో రవిశాస్త్రి నుంచి భారత చీఫ్ కోచ్ గా పగ్గాలు అందుకొన్న రాహుల్ ద్రావిడ్ గత రెండేళ్ల కాలంలో భారత జట్టును క్రికెట్ మూడు ఫార్మాట్లలోనూ ప్రపంచ నంబర్ వన్ జట్టుగా నిలిపారు.

విక్రమ్ రాథోడ్ బ్యాటింగ్, పరస్ మాంబ్రే బౌలింగ్, టీ. దిలీప్‌ ఫీల్డింగ్ కోచ్ లుగా ద్రావిడ్ బృందంలో సహాయకులుగా సేవలు అందించారు. రాహుల్ ద్రావిడ్ చీఫ్ కోచ్ గా భారతజట్టు గత రెండేళ్ల కాలంలో ఐసీసీ టెస్టులీగ్ ఫైనల్ చేరడంతో పాటు భారతజట్టు రన్నరప్ గా నిలవడం, టీ-20 ప్రపంచకప్ సెమీస్ లోనే పరాజయం పొందటం, ఐసీసీ వన్డే ప్రపంచకప్ లీగ్ నుంచి సెమీస్ వరకూ వరుసగా 10 విజయాలు సాధించిన ఏకైకజట్టుగా నిలవడంతో పాటు..ప్రపంచకప్ రన్నరప్ స్థానం సంపాదించడం గొప్పఘనతలుగా మిగిలిపోతాయి.

భారత క్రికెట్ బాగుకోసం గత రెండేళ్లుగా రాహుల్ ద్రావిడ్ అంకితభావంతో అహర్నిశలూ శ్రమించారని, క్రికెట్ మూడు ఫార్మాట్లలోనూ భారత్ ను టాప్ ర్యాంక్ జట్టుగా నిలిపారంటూ బీసీసీఐ కార్యదర్శి ప్రశంసల వర్షం కురిపించారు.

వచ్చే ఏడాది వెస్టిండీస్, అమెరికా దేశాల సంయుక్త ఆతిథ్యంలో జరిగే 2024 టీ-20 ప్రపంచకప్ వరకూ ద్రావిడ్ అండ్ కో కాంట్రాక్టును పొడిగిస్తూ ఓ అవగాహనకు వచ్చినట్లు బీసీసీఐ కార్యదర్శి అధికారికంగా ప్రకటించారు.

లక్ష్మణ్ నిరాసక్తత కారణంగానే....

భారతజట్టు దక్షిణాఫ్రికా పర్యటన ప్రారంభానికి వారంరోజుల ముందే ద్రావిడ్ బృందం కాంట్రాక్టు పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకొంది. గత రెండేళ్ల కాలంలో భారతజట్టు సాధించిన అత్యున్నత ప్రమాణాల కొనసాగింపుకోసం ద్రావిడ్ టీమ్ కాంట్రాక్టు కొనసాగింపు అనివార్యమని వివరించింది.

వాస్తవానికి..ద్రావిడ్ బృందం రెండు సంవత్సరాల కాంట్రాక్టు నవంబర్ 21తోనే ముగిసింది. ఆ తర్వాత నుంచి భారతజట్టు స్టాప్ గ్యాప్ కోచ్ గా వీవీఎస్ లక్ష్మణ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అయితే..పూర్తిస్థాయిలో భారతజట్టుకు కోచ్ గా సేవలు అందించడానికి లక్ష్మణ్ అంతగా ఆసక్తి చూపలేదని బీసీసీఐ వర్గాలు అంటున్నాయి. తన కుటుంబానికి దూరంగా ఉండటానికి లక్ష్మణ్ ఏమాత్రం ఇష్టపడటం లేదని చెబుతున్నారు.

మరో 8మాసాలలో ప్రారంభంకానున్న ఐసీసీ టీ-20 ప్రపంచకప్ కు ద్రావిడ్ బృందాన్నే కొనసాగించాలన్న నిర్ణయాన్ని బీసీసీఐ సంప్రదింపుల ద్వారా విజయవంతంగా అమలుచేయగలిగింది.

బీసీసీఐకి ద్రావిడ్ కృతజ్ఞతలు...

తనను, తన బృందాన్ని 2024 ప్రపంచకప్ వరకూ కొనసాగించాలని బీసీసీఐ నిర్ణయించడం పట్ల చీఫ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ సంతృప్తి వ్యక్తం చేశాడు. గత రెండేళ్లకాలంలో తన ప్రణాళికలను విజయవంతంగా అమలు చేయటానికి బీసీసీఐ ఎంతగానో సహకరించిందని, తమ జట్టు సాధించిన విజయాలు, ప్రగతిని గుర్తించినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ద్రావిడ్ ప్రకటించాడు.

ప్రపంచకప్ కు భారతజట్టును సిద్ధం చేయాలంటే నెలల తరబడి విదేశాలలో గడపాలంటే కుటుంబానికి దూరం కాక తప్పదని, ఈ విషయంలో తన కుటుంబ సహకారం మరువలేనిదని ద్రావిడ్ గుర్తు చేసుకొన్నాడు.

నెలకు కోటిరూపాయల జీతంపైన ద్రావిడ్ తో బీసీసీఐ 2024 ప్రపంచకప్ ముగిసేవరకూ కాంట్రాక్టు కుదుర్చుకోగలిగింది.

Tags:    
Advertisement

Similar News