25న మహిళా ఐపీఎల్ ఫ్రాంచైజీల ఆవిష్కరణ

ఐపీఎల్ తో ఇప్పటికే మోత మోగిస్తున్న బీసీసీఐ మహిళా ఐపీఎల్ కు సైతం రంగం సిద్ధం చేసింది. జనవరి 25న ఐదు ఫ్రాంచైజీల ఆవిష్కరణకు ముహూర్తం ఖరారు చేసింది.

Advertisement
Update: 2023-01-13 09:43 GMT

ఐపీఎల్ తో ఇప్పటికే మోత మోగిస్తున్న బీసీసీఐ మహిళా ఐపీఎల్ కు సైతం రంగం సిద్ధం చేసింది. జనవరి 25న ఐదు ఫ్రాంచైజీల ఆవిష్కరణకు ముహూర్తం ఖరారు చేసింది.

ప్రపంచంలోనే అత్యంత భాగ్యవంతమైన క్రికెట్ బోర్డు బీసీసీఐ.. మహిళా క్రికెట్ తో సైతం లాభసాటి వ్యాపారం చేయాలని నిర్ణయించింది. పురుషుల ఐపీఎల్ తో ఏడాదికి 10వేల కోట్ల రూపాయలకు పైగా సంపాదిస్తున్న భారత క్రికెట్ నియంత్రణమండలి మహిళలకు సైతం ఐపీఎల్ నిర్వహించడానికి కార్యాచరణ రూపొందించింది.

ఐదుజట్లతో ప్రారంభ మహిళా ఐపీఎల్

మహిళా ఐపీఎల్ ను తొలిదశలో ఐదుజట్లతో మాత్రమే నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. దేశంలోని ఐదు ప్రధాన నగరాల నుంచి ఫ్రాంచైజీల కోసం ఇప్పటికే బిడ్లను

స్వీకరించింది. ఐదు ఫ్రాంచైజీల బిడ్ల సీల్డ్ కవర్లను ఈనెల 25న ముంబైలో తెరవడంతో పాటు..వివరాలను అధికారికంగా వెల్లడించనుంది.

తమకు డబ్బు ప్రధానం కాదని, దేశంలో మహిళా క్రికెట్ అభివృద్దే ముఖ్యమని, ఆ కారణంగానే బిడ్లమొత్తాలను ఖరారు చేయలేదని ఐపీఎల్ పాలకమండలి ప్రకటించింది.

ప్రధాన నగరాల నుంచి బిడ్లకు ఆహ్వానం..

దేశంలోని ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్, కోల్ కతా, చెన్నై, బెంగళూరు, ధర్మశాల, లక్నో నగరాల నుంచి ఇప్పటికే బిడ్లు స్వీకరించింది. ఈ నగరాల నుంచి కేవలం ఐదింటిని మాత్రమే ఎంపిక చేయనుంది.

ముంబైలోని గ్రౌండ్ల అందుబాటును దృష్టిలో ఉంచుకొని ఓ కేంద్రాన్ని ఖరారు చేయనున్నట్లు వివరించింది. దేశంలోని ఆరు క్రికెట్ జోన్ల కే పరిమితం కాకుండా ప్రధాన కేంద్రం లేకుండా ఫ్రాంచైజీలను నిర్ణయించే అవకాశం ఉంది.

ఫ్రాంచైజీల వేలం కోసం బిడ్డింగ్ మొత్తాలను నిర్ణయించలేదని, ఫ్రాంచైజీల కోసం పోటీపడుతున్న సంస్థలే తాము చెల్లించదలచుకొన్న మొత్తాలను సీల్డ్ కవర్ల ద్వారా బోర్డుకు పంపాయి.

నగరం వారీగా అధికమొత్తంతో బిడ్లు వేసిన సంస్థలకే ప్రాంచైజీల యాజమాన్యహక్కులు దక్కుతాయి. 10 సీజన్లకుగాను ఒకేసారి యాజమాన్యహక్కులను ఇవ్వనున్నారు.

సీజన్ కు 22 మ్యాచ్ లు..

మహిళా ఐపీఎల్ మొదటి మూడు సీజన్లు ( 2023 నుంచి 2025 వరకూ) సీజన్ కు 22 మ్యాచ్ లు చొప్పున నిర్వహిస్తారు. లీగ్ దశలో ఒక్కోజట్టు మిగిలిన ప్రత్యర్థిజట్లతో రెండేసిమార్లు తలపడనుంది.

లీగ్ దశలో టేబుల్ టాపర్ గా నిలిచిన జట్టు నేరుగా ఫైనల్ చేరుకొంటుంది. రెండు, మూడుస్థానాలలో నిలిచిన జట్లు ఎలిమినేటర్ రౌండ్లో తలపడనున్నాయి. ప్రతి ఏడాది మార్చి నెలలో మాత్రమే మహిళా ఐపీఎల్ టోర్నీని నిర్వహిస్తారు.

2026 సీజన్ నుంచి మ్యాచ్ ల సంఖ్య 33 లేదా 34 వరకూ ఉండే అవకాశం ఉందని బీసీసీఐ వర్గాలు అంటున్నాయి.

Tags:    
Advertisement

Similar News