రాష్ట్రపతి ఎన్నికలో క్రాస్ ఓటింగ్ చేసిన ఎంపీలు, ఎమ్మెల్యేల పరిస్థితేంటి?

విపక్ష అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు పడాల్సిన 126 ఎమ్మెల్యే, 17 ఎంపీ ఓట్లు ద్రౌపది ముర్ముకు పడ్డాయి. దీంతో ద్రౌపదికి మొత్తం ఎలక్టోలర్ కాలేజీలో 64.03 శాతం అంటే.. 6,78,803 విలువైన ఓట్లు దక్కించుకున్నారు.

Advertisement
Update: 2022-07-23 07:23 GMT


రాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముకు అంచనా వేసిన దాని కంటే భారీగా ఓట్లు పోలయ్యాయి. ఎన్డీయే, విపక్ష అభ్యర్థులకు మద్దతు ఇచ్చిన పార్టీలకు ఉన్న ఓట్లను పరిశీలిస్తే భారీగా క్రాస్ ఓటింగ్ జరిగినట్లు స్పష్టం అయ్యింది. విపక్ష అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు పడాల్సిన 126 ఎమ్మెల్యే, 17 ఎంపీ ఓట్లు ద్రౌపది ముర్ముకు పడ్డాయి. దీంతో ద్రౌపదికి మొత్తం ఎలక్టోలర్ కాలేజీలో 64.03 శాతం అంటే.. 6,78,803 విలువైన ఓట్లు దక్కించుకున్నారు. అయితే ఇప్పుడు క్రాస్ ఓటింగ్ చేసినవారి పరిస్థితి ఏంటి? పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఓటేసిన ఎమ్మెల్యే, ఎంపీలను అనర్హులుగా ప్రకటిస్తారా అనే అనుమానాలు నెలకొన్నాయి.

కాగా, క్రాస్ ఓటింగ్ చేసిన ప్రజాప్రతినిధులపై ఆయా పార్టీలు చర్యలు తీసుకోవడం చాలా కష్టం. ఏ రాష్ట్రంలో క్రాస్ ఓటింగ్ జరిగిందో.. ఏ పార్టీల ఎమ్మెల్యే, ఎంపీలు వ్యతిరేకంగా ఓటేసారో తెలుస్తుంది. కానీ కచ్చితంగా ఎవరు క్రాస్ ఓటింగ్ చేశారో మాత్రం కనుక్కోవడం కష్టమని ఎన్నికల అధికారులు అంటున్నారు. రాష్ట్రపతి ఎన్నిక పూర్తిగా సీక్రెట్ బ్యాలెట్ పద్ధ‌తిలో జరగడమే దీనికి కారణమని చెప్తున్నారు.

కాంగ్రెస్ పార్టీ నుంచే ఎక్కువగా క్రాస్ ఓటింగ్ జరిగినట్లు తెలుస్తోంది. కానీ, సదరు ఎమ్మెల్యేలను గుర్తించడం మాత్రం కుదరదు అని చెబుతున్నారు. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు 96 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కానీ అక్కడ 79 ఓట్లు మాత్రమే యశ్వంత్ సిన్హాకు పడ్డాయి. అంటే 17 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేసినట్లు స్పష్టమ‌వుతోంది. అదే సమయంలో ఆ 17 మంది ఎవరని గుర్తించడం మాత్రం సాధ్యమయ్యే పని కాదు. అయితే ఆదివాసీ ఎమ్మెల్యేలే ఈ క్రాస్ ఓటింగ్‌కు పాల్పడి ఉంటారని మాత్రం పార్టీ అంచనాకు వస్తోంది. కానీ, ఈ అంచనాలను బేస్ చేసుకొని మాత్రం వారిపై చర్యలు తీసుకోవడం అనైతికం అవుతుందని పార్టీ వర్గాలు అంటున్నాయి.

జార్ఖండ్‌కు చెందిన ఏడుగురు, చత్తీస్‌గడ్‌కు చెందిన ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా క్రాస్ ఓటింగ్‌కు పాల్పడినట్లు తెలుస్తోంది. రాజ్యసభ ఎంపీల ఎన్నికల సమయంలో ఎమ్మెల్యేలు తమ పార్టీ పర్యవేక్షకులకు ఎవరికి ఓటేస్తున్నామో చూపించాల్సి ఉంటుంది. రాష్ట్రపతి ఎన్నికలో మాత్రం అలా చూపించే అవకాశం ఉండదు. అదే క్రాస్ ఓటింగ్ చేసే ఎమ్మెల్యేలకు కలసి వచ్చినట్లు విశ్లేషకులు చెప్తున్నారు. గుజరాత్‌లో కూడా భారీగా ముర్ముకు క్రాస్ ఓటింగ్ చేశారు. అయితే అలాంటి ఎమ్మెల్యేలపై ఎలాంటి చర్యలు తీసుకోబోమని కాంగ్రెస్ చీఫ్ జగదీశ్ ఠాకూర్ చెప్పారు.

అస్సాంలో కూడా ప్రతిపక్షాల నుంచి 22 మంది క్రాస్ ఓటింగ్ చేశారు. అయితే వారిలో ఎంత మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారనే విషయం తేల్చడం కష్టమని పర్యవేక్షకులు చెప్తున్నారు. ఇక ఉత్తర్‌ప్రదేశ్‌లో ఐదుగురు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారు. అందులో శివ్‌పాల్ యాదవ్ ముందుగానే తాను ముర్ముకు ఓటు వేస్తున్నట్లు వెల్లడించారు. ఇక మిగిలిన నలుగురు ఎవరనేది తేలడం కష్టమే. తెలంగాణలో ఎమ్మెల్యే సీతక్క పొరపాటున ముర్ముకు ఓటేసినట్లు ఆ రోజే వెల్లడించారు. క్రాస్ ఓటింగ్ చేసిన ఒకరిద్దరు బయటకు చెప్పారు. కానీ, మిగిలన ఎమ్మెల్యేలు, ఎంపీలు మాత్రం ఇప్పటి వరకు నోరు మెదపలేదు. ప్రతిపక్ష కాంగ్రెస్, ఎస్పీ వీరిపై చర్యలు తీసుకోవడం కూడా కష్టమేనని తెలుస్తోంది.

15వ రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ముకు ఎలక్షన్ కమిషన్ ధృవీకరణ పత్రాన్ని అందించింది. ఈ నెల 25న ముర్ము రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

Tags:    
Advertisement

Similar News