మమతాను'రాగం' మారింది.. అల్లుడికోసమేనా..?

సీబీఐ హోంశాఖ పరిధిలోకి వస్తుందని, ప్రధాని కార్యాలయానికి దానితో సంబంధం లేదని చెప్పారు. దర్యాప్తు సంస్థల దాడులు ప్రతీకార చర్యలేనంటున్న మమత, ఆ ప్రతీకారంలో మోదీ పాత్ర లేదని క్లీన్ చిట్ ఇచ్చారు.

Advertisement
Update: 2022-09-20 01:29 GMT

మోదీ-మమత.. మొన్నటి వరకూ ఉప్పు నిప్పులా ఉన్నారు. పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా ఇద్దరి మధ్య ఓ రేంజ్ లో మాటల తూటాలు పేలాయి. చివరకు మమత విజయంతో పరిస్థితి తీవ్రత కాస్త తగ్గింది అనుకున్నా, ఆ తర్వాత గవర్నర్ ఎపిసోడ్, రీసెంట్ గా బెంగాల్ లో సీబీఐ, ఈడీ వరుస దాడులు బీజేపీ వర్సెస్ టీఎంసీ పోరాటాన్ని నిత్యాగ్నిహోత్రంలా మార్చేశాయి. కానీ ఇప్పుడు అందులో నీళ్లు చిలకరించాలని చూస్తున్నారు మమతా బెనర్జీ. మోదీపై ఆమె చేసిన తాజా వ్యాఖ్యలే దీనికి నిదర్శనం.

మోదీని వెనకేసుకొస్తున్నారా..?

కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగంపై పశ్చిమబెంగాల్ అసెంబ్లీలో చర్చ జరిగింది. సహజంగా ఇలాంటి చర్చల్లో మమత ఆవేశాన్ని ఎవరైనా ఊహించగలరు. మోదీ-షా ద్వయంపై ఆమె విమర్శలతో విరుచుకుపడతారని అనుకున్నారంతా. కానీ సీన్ రివర్స్ అయింది. సీబీఐ, ఈడీకి భయపడి దేశంలోని వ్యాపారస్థులు విదేశాలకు పారిపోతున్నారని చెప్పిన మమత, ఈ విషయంలో ప్రధాని మోదీ ప్రమేయం ఉందని తాను అనుకోవడంలేదని చెప్పారు. సీబీఐ హోంశాఖ పరిధిలోకి వస్తుందని, ప్రధాని కార్యాలయానికి దానితో సంబంధం లేదని చెప్పారు. దర్యాప్తు సంస్థల దాడులు ప్రతీకార చర్యలేనంటున్న మమత, ఆ ప్రతీకారంలో మోదీ పాత్ర లేదని క్లీన్ చిట్ ఇచ్చారు.

ఆ కొందరు ఎవరు..?

మోదీతోపాటు అమిత్ షా ని కూడా ఆమె తప్పుపట్టకపోవడం విశేషం. బీజేపీలోని ఒక వర్గం నేతలు మాత్రమే తమ స్వలాభం కోసం అధికారాన్ని దుర్వినియోం చేస్తున్నారని ఆరోపించారు మమతా బెనర్జీ. కొందరు బీజేపీ నేతలు తరచూ హోంమంత్రిని కలిసి తమపై కుట్రలు పన్నుతున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అజెండాను, పార్టీ ప్రయోజనాలను కలిపి చూడొద్దని ఈ సందర్భంగా ప్రధాని మోదీని మమత కోరారు. ఇది ఏ ఒక్కరినీ వ్యతిరేకిస్తూ ప్రవేశపెట్టిన తీర్మానం కాదని, స్వతంత్ర దర్యాప్తు సంస్థల ఏకపక్ష వైఖరిని నిరసిస్తూ ప్రవేశ పెట్టిన తీర్మానం అని చెప్పారు. మోదీ తప్పులేదన్న మమత, అమిత్ షా కి కూడా ఎవరో కావాలని తమపై తప్పుడు సమాచారం ఇస్తున్నారని చెప్పుకొచ్చారు. సడన్ గా మమత 'రాగం' ఇలా మారిందేంటా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు.

మొదలైన సెటైర్లు..

కేంద్రంపై నిప్పులు చెరిగే మమత, సడన్ గా చల్లబడిపోవడంతో అందరూ షాకయ్యారు. అయితే బెంగాల్ బీజేపీ నుంచి మాత్రం సెటైర్లు మొదలయ్యాయి. మమత వ్యాఖ్యలపై బెంగాల్ ప్రతిపక్ష నేత సువేందు అధికారి స్పందించారు. బొగ్గు కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అల్లుడు అభిషేక్ బెనర్జీని కాపాడుకోడానికే మమత ఇలా మాట్లాడుతున్నారని విమర్శించారు. మమత కుతంత్రాలను బీజేపీ ఆ మాత్రం పసిగట్టలేదా అని సెటైర్లు వేశారు సువేందు.

Tags:    
Advertisement

Similar News