కేబుల్ బ్రిడ్జి కొలాప్స్ ఘటనలో నమ్మలేని నిజాలు: 'తుప్పుపట్టిన కేబుల్ మార్చలేదు, రంగులువేశారంతే'

గుజరాత్ కేబుల్ బ్రిడ్జి కూలిపోయిన స‍ంఘటన‌కు సంబంధించి కొత్త విషయాలు బైటప‌డుతున్నాయి. పునర్నిర్మాణ కాంట్రాక్ట్ కంపెనీ అసలు తుప్పుపట్టిన కేబుళ్ళను మార్చకుండా పాతవాటికే రంగులద్దిందని ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ రిపోర్ట్ ఇచ్చింది.

Advertisement
Update: 2022-11-02 11:53 GMT

గుజరాత్ కేబుల్ బ్రిడ్జి కూలిపోయిన సంఘటన‌లో నమ్మలేని నిజాలు బైటికి వస్తున్నాయి. అసలు నిర్మాణ రంగంలో అనుభవమేలేని, గడియారాలు తయారు చేసే కంపెనీకి బ్రిడ్జి పునర్నిర్మాణ కాంట్రాక్ట్ అప్పజెప్పారన్నదే నమ్మలేని నిజం అయితే, ఆ కంపెనీ అసలు తుప్పుపట్టిన కేబుళ్ళను మార్చలేదని, పాతవాటికే కొత్త రంగులద్ది యదావిధిగా ఉంచిందనే విషయం ఇప్పుడు బైటప‌డింది.

మోర్బీ బ్రిడ్జి కూలిపోయిన సంఘటనపై ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (ఎఫ్‌ఎస్‌ఎల్) ఇచ్చిన సవివరమైన నివేదికను మంగళవారం సాయంత్రం మోర్బీ ఫస్ట్ క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ముందు పబ్లిక్ ప్రాసిక్యూటర్ హర్సేందు పాంచల్ సీల్డ్ కవర్‌లో దాఖలు చేశారు.

ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ ఇచ్చిన నివేదికలో పలు ఆశ్చర్యకరమైన అంశాలు వెలుగు చూశాయి. పబ్లిక్ ప్రాసిక్యూటర్ హర్సేందు పాంచల్ బుధవారం స్థానిక మీడియాతో మాట్లాడుతూ, ఎఫ్‌ఎస్‌ఎల్ ప్రాథమిక నివేదిక ప్రకారం... కాంట్రాక్టర్ కేబుల్స్ మార్చలేదని, తుప్పు పట్టిన కేబుళ్లకు మాత్రమే పెయింట్ చేశారని, ఫ్లోరింగ్ మాత్రం మార్చారని చెప్పారు.

"కేబుల్స్ మార్చబడలేదని FSL నివేదిక వెల్లడించింది. కాంట్రాక్టు కంపెనీ మేనేజర్‌కి ఇవ్వబడింది. ఒరేవా కంపెనీకి కాదు. అతను అర్హత లేని కార్మికులకు మరమ్మత్తు, పునరుద్ధరణ పనులను అప్పగించాడు.'' అని పాంచాల్ పేర్కొన్నారు.

మరో వైపు సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. "పంజాబ్‌కు చెందిన ఓ వ్యక్తి తప్పిపోయాడు. అతని కోసం గాలింపు కొనసాగుతోంది. అతని కుటుంబానికి సంఘటన గురించి సమాచారం అందించాము. మృతదేహం దొరికే వరకు సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది.'' అని మోర్బి జిల్లా కలెక్టర్ జి.టి.పాండ్యా మీడియాకు తెలిపారు.

అక్టోబర్ 30న వంతెన కూలి 141 మంది ప్రాణాలు కోల్పోయిన సంఘటనకు సంబంధించి అధికారులు కాంట్రాక్టర్, ఏజెన్సీ, కార్మికులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఒరెవా కంపెనీ లిమిటెడ్‌కు చెందిన ఇద్దరు మేనేజర్లు, ఇద్దరు బుకింగ్ క్లర్కులు, ముగ్గురు సెక్యూరిటీ గార్డులు, ఇద్దరు కార్మికులు మొత్తం తొమ్మిది మందిని అక్టోబర్ 31న పోలీసులు అరెస్టు చేశారు.

Tags:    
Advertisement

Similar News