కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో రిగ్గింగ్ ?

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని అధ్యక్షపదవికి పోటీ పడుతున్న శశి థరూర్ ఆరోపించారు. ఈ మేరకు ఆయన బృందం ఎన్నికల అధికారి మిస్త్రీకి లేఖ రాసింది.

Advertisement
Update: 2022-10-19 08:02 GMT

కాంగ్రెస్ అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని అభ్యర్థి శశి థరూర్ అరోపించారు. ఈ రోజు ఓట్ల లెక్కింపు ప్రార౦భమైంది. మరి కొద్ది సేపట్లో ఫలితాలు కూడా వచ్చేస్తాయి. ఈ సమయంలో శశిథరూర్ ఈ ఆరోపణలు చేశారు.

ఉత్తర ప్రదేశ్ లో జరిగిన ఓటింగ్ లో రిగ్గింగ్ జరిగిందని శశి థరూర్, ఆయనకు మద్దతు ఇస్తున్న ఉత్తర ప్రదేశ్ కు చెందిన కాంగ్రెస్ నాయకుడు సల్మాన్ సోజ్ లు ఆరోపించారు.

కౌంటింగ్ ప్రారంభమైన వెంటనే ఈ ఆరోపణలు చేసిన శశిథరూర్ బృందం ఉత్తర ప్రదేశ్ ఓట్లను మొత్తాన్ని చెల్లనివిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.

దేశవ్యాప్తంగా ఉన్న 9500 ఓట్లలో ఒక్క ఉత్తర ప్రదేశ్ నుండే 1200 ఓట్లు ఉన్నాయి.

ఈ ఉదయం ఎన్నిక అధికారి మిస్త్రీకి రాసిన లేఖలో థరూర్ బృందం... "ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణలో చాలా తీవ్రమైన అవకతవకలు జరిగాయి. వాటిని మీ దృష్టికి తీసుకొస్తున్నాము. అక్కడ జరిగిన స‍ంఘటనలు చాలా హేయమైనవి. ఇవి యుపిలో ఎన్నికల ప్రక్రియ విశ్వసనీయతను దెబ్బతీసింది." అని పేర్కొన్నారు.

"మల్లికార్జున్ ఖర్గే మద్దతుదారులు ఉత్తరప్రదేశ్‌లో దుష్ప్రవర్తనకు పాల్పడ్డారు. ఈ విషయం ఆయనకు తెలిస్తే అతను ఎప్పటికీ అనుమతించడు. భారత జాతీయ కాంగ్రెస్‌కు చాలా ముఖ్యమైన ఈ ఎన్నికలను కలుషితం చేయడాన్ని అనుమతించకూడదు" అని థరూర్ బృందం లేఖలో పేర్కొంది

బ్యాలెట్ బాక్సులకు అనధికారిక ముద్రలు వేయడం, పోలింగ్ బూత్‌లలో అనధికారిక వ్యక్తులు ఉండటం , రిగ్గింగ్ చేయడం వంటి సమస్యలను శశి థరూర్ బృందం తమ‌ లేఖలో తెలిపింది.


అయితే ఈ ఆరోపణలను కాంగ్రెస్‌ తీవ్రంగా ఖండించింది. "ఇటువంటి ఆరోపణలు విమర్శకులకు ఉపయోగపడుతాయి. ఇద్దరు సమర్థులు పోటీ పడుతున్నారు. ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి" అని పార్టీ కమ్యూనికేషన్స్ ఇన్‌చార్జి జనరల్ సెక్రటరీ జైరాం రమేష్ చెప్పారు.

Tags:    
Advertisement

Similar News