బిజెపి అధికారంలోకి వ‌చ్చాకే విద్వేషాలు పెరిగాయి..ఆ పార్టీ దేశాన్ని చీలుస్తోంది -రాహుల్ గాంధీ ధ్వ‌జం

అధిక ధరలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఢిల్లీలో ఈ రోజు చేపట్టిన భారీ ర్యాలీలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బీజేపీ పై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ ఈ దేశాన్ని విభజిస్తోందని విరుచుకపడ్డారు.

Advertisement
Update: 2022-09-04 11:32 GMT

దేశంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విద్వేషాలు పెరిగిపోతున్నాయని, ఆ పార్టీ ప్ర‌జ‌ల మ‌ధ్య ద్వేష‌భావాలు పెంచుతూ దేశాన్ని చీలుస్తోంద‌ని కాంగ్రెస్ మాజీ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ విమ‌ర్శించారు. పెరుగుతున్న ద్ర‌వ్యోల్బ‌ణం, రోజురోజుకు ఆకాశాన్నంటుతున్న ధరలు, పెరుగుతున్న నిరుద్యోగం తో ప్ర‌జ‌లు త‌మ భ‌విష్య‌త్తు గురించి భ‌య‌ప‌డుతున్నార‌ని అన్నారు. ధ‌ర‌ల‌ పెరుగుదలకు వ్యతిరేకంగా ఆదివారంనాడు ఢిల్లీలోని రాంలీలా మైదానంలో కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన మెగా ర్యాలీ వేదికపై నుంచి ఆయ‌న బిజెపి విధానాల‌ను తూర్పార‌బ‌ట్టారు. బిజెపి, ఆర్ఎస్ఎస్ లు దేశాన్ని మ‌తంపేరుతో విభ‌జిస్తూ విద్వేషాల‌ను పెంచుతున్నాయ‌ని ఆయ‌న ధ్వ‌జ‌మెత్తారు.

''మెహంగాయ్ పర్ హల్లా బోల్ ర్యాలీ పేరుతో కాంగ్రెస్ పార్టీ నిర్వ‌హించిన ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌జ‌లు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. దేశంలో ఇద్ద‌రు బ‌డా పారిశ్రామిక వేత్త‌లు మాత్ర‌మే ప్ర‌భుత్వం నుంచి అధికంగా ప్ర‌యోజ‌నం పొందుతున్నార‌ని , పేద‌లకు ఒన‌గూరిన ప్ర‌యోజ‌నాలేవీ లేవ‌ని రాహుల్ విమ‌ర్శించారు. విమానాశ్ర‌యాలు, నౌకాశ్ర‌యాలు, రోడ్లు అన్నీ ఆ పారిశ్రామిక వేత్త‌ల‌కే ద‌క్కుతున్నాయ‌ని అన్నారు. ఈ పారిశ్రామిక వేత్త‌ల‌తో మోడీకి స్నేహం ఉంద‌న్న వార్త‌లను ప్ర‌స్తావిస్తూ ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశారు.

'కేవ‌లం ఇద్ద‌రు బ‌డా పారిశ్రామిక వేత్త‌ల‌కే ప్ర‌యోజ‌నాలు క‌లిగించాల‌ని ప్రధానమంత్రి సిద్ధాంతం గా ఉంది. కానీ దేశ ప్రగతిలో ప్రతి ఒక్కరూ లబ్ధి పొందాలనేదే త‌మ సిద్ధాంతం చెబుతోందని రాహుల్ అన్నారు. మోదీ ప్రభుత్వం ఉపాధి కల్పించలేకపోయిందని, ఎంపిక చేసిన ఇద్దరు బడా పారిశ్రామికవేత్తలకు మాత్రమే లబ్ధి చేకూరుస్తోందని ఆరోపించారు. "ప్రధానమంత్రి కోసం ఆ ఇద్ద‌రు పారిశ్రామిక‌వేత్త‌లు, వారి కోసం ప్ర‌ధాని 24 గంటలు పని చేస్తున్నార‌ని ఎద్దేవా చేశారు.

కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దేశంలో ద్వేషం, కోపం, అస‌హ‌నం పెరుగిపోతున్నాయ‌న్నారు. మీడియా, న్యాయవ్యవస్థ, ఎన్నికల సంఘం వంటి సంస్థలపై ఎంతో ఒత్తిడి ఉందని, ప్రభుత్వం వాటన్నింటిపై దాడులు చేస్తోందని రాహుల్ గాంధీ అన్నారు.

దేశంలో ఇంత‌కు ముందెన్న‌డూ ఈ స్థాయిలో ధ‌ర‌లు పెర‌గ‌డం చూడలేదని ఆయన అన్నారు. "సామాన్య ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. చైనాతో ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం త‌దిత‌ర స‌మ‌స్య‌ల‌పై పార్లమెంటులో లేవనెత్తడానికి ప్రతిపక్షాలను అనుమతించరు" అని ఆయన అన్నారు. 'నరేంద్ర మోదీ దేశాన్ని తిరోగ‌మ‌న దిశ‌లో న‌డిపిస్తున్నార‌ని, విద్వేషాలు రెచ్చగొడుతున్నారని అన్నారు. దీని వల్ల పాకిస్థాన్, చైనాలు లబ్ది పొందుతున్నాయని, గత ఎనిమిదేళ్లలో ప్రధాని మోడీ భారత్‌ను బలహీనపరిచారన్నారు.

కాగా సెప్టెంబ‌ర్ 7 వ తేదీనుంచి రాహుల్ గాంధీ భార‌త్ జోడో యాత్ర ప్రారంభించ‌నున్న నేప‌ద్యంలో ఈ భారీ స‌భ జ‌రిగింది. 150 రోజుల పాటు క‌న్యాకుమారి నుంచి క‌శ్మీర్ వ‌ర‌కూ ఆయన యాత్ర‌చేస్తారు. దేశంలో పెరుగుతున్న విద్వేషం, ప్ర‌జ‌ల మ‌ద్య విభ‌జ‌న, నిరుద్యోగం,ద‌ర‌ల పెరుగుద‌ల స‌మ‌స్య‌ల‌పై ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న క‌లిగించే ప్ర‌య‌త్నం చేస్తారు. మ‌త సామ‌ర‌స్యాన్ని, శాంతిని నెల‌కొల్పాలంటూ ప్ర‌జా క్షేత్రంలో వివ‌రించ‌నున్నారు.

Tags:    
Advertisement

Similar News