సైన్యం సామర్థ్యంపై రుజువులు అక్కర్లేదు -రాహుల్ గాంధీ

దిగ్విజయ్ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం అని చెప్పారు రాహుల్ గాంధీ. ఆయన అభిప్రాయాలను పార్టీ తరపున తాము అభినందించట్లేదన్నారు. అవి విరుద్ధమైన వ్యాఖ్యలు అని చెప్పారు.

Advertisement
Update: 2023-01-24 11:05 GMT

రాహుల్ గాంధీ

భారత సైన్యం జరిపిన సర్జికల్ స్ట్రైక్స్ పై దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్న వేళ, రాహుల్ గాంధీ వివరణ ఇచ్చారు. దిగ్విజయ్ వ్యాఖ్యలను ఖండించారు. ఆయన అభిప్రాయాలతో పార్టీకి సంబంధం లేదన్నారు. ప్రస్తుతం జోడో యాత్రలో జమ్మూ కాశ్మీర్ లో పర్యటిస్తున్న రాహుల్ అక్కడి మీడియాతో మాట్లాడారు. దిగ్విజయ్ వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు.

దిగ్విజయ్ ఏమన్నారంటే..?

భారత్‌ జోడో యాత్రలో పాల్గొన్న దిగ్విజయ్‌ నిన్న వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సర్జికల్‌ స్ట్రైక్స్ చేసి టెర్రరిస్ట్ లను చంపామని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం.. దానికి తగిన రుజువుల్ని మాత్రం ఇప్పటివరకు ఎందుకు చూపించలేకపోతోందని ప్రశ్నించారు.


పుల్వామా ఘటనపై కూడా కేంద్రం ఇప్పటివరకు నివేదిక సమర్పించలేదని విమర్శించారు. ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. భారతీయ సైన్యాన్ని అవమానించారంటూ దిగ్విజయ్ వ్యాఖ్యల్ని చాలామంది తప్పుబట్టారు. రక్షణ దళాల పట్ల తనకు గొప్ప గౌరవం ఉందంటూ డిగ్గీరాజా ఆ తర్వాత సర్దిచెప్పుకున్నా ఫలితం లేకపోయింది. చివరకు కాంగ్రెస్ ని అందరూ టార్గెట్ చేశారు. దీంతో రాహుల్ గాంధీ వివరణ ఇచ్చారు.

దిగ్విజయ్ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం అని చెప్పారు రాహుల్ గాంధీ. ఆయన అభిప్రాయాలను పార్టీ తరపున తాము అభినందించట్లేదన్నారు. అవి విరుద్ధమైన వ్యాఖ్యలు అని చెప్పారు. వాటితో పార్టీకి సంబంధం లేదని, పార్టీ అభిప్రాయాలు చర్చల నుంచే వెలువడుతాయన్నారు.


"భారత సాయుధ బలగాల సామర్థ్యం మాకు తెలుసు. వారు అసాధారణ పరిస్థితుల్లోనూ విధులు నిర్వర్తించగలరని మేం నమ్ముతున్నాం. వాళ్లు ఎలాంటి రుజువులు చూపించాల్సిన అవసరం లేదు" అని స్పష్టం చేశారు రాహుల్ గాంధీ. మిగతా కాంగ్రెస్‌ నేతలెవరూ దిగ్విజయ్ వ్యాఖ్యలపై స్పందించలేదు. రాహుల్ వివరణతో ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాలని కాంగ్రెస్ కోరుతోంది. 

Tags:    
Advertisement

Similar News