కాశ్మీర్ కి రాష్ట్రహోదా తథ్యం.. ఎముకలు కొరికే చలిలో రాహుల్ ప్రసంగం

తనపై గ్రెనేడ్లు వేస్తారనే భయం తనకు లేదని, తన తెల్లటి టీ షర్ట్ ని ఎరుపు రంగులోకి మార్చే అవకాశం అలాంటి వారికి ఇవ్వాలనుకున్నానని, కానీ కాశ్మీర్ ప్రజలు ప్రేమను మాత్రమే పంచారన్నారు.

Advertisement
Update: 2023-01-30 11:10 GMT

కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే కాశ్మీర్ కి రాష్ట్రహోదా ఇస్తామని ప్రకటించారు రాహుల్ గాంధీ. భారత్ జోడో యాత్ర ముగింపు సభలో పాల్గొన్న ఆయన లాల్ చౌక్ లో జెండా ఎగురవేశారు. ఎముకలు కొరికే చలిలో రాహుల్ సభ జరగడం విశేషం. జోరున మంచు కురుస్తున్నా కూడా రాహుల్ గాంధీ తన ప్రసంగాన్ని కొనసాగించారు. భారత్ జోడో పాదయాత్ర తనకెన్నో పాఠాలు నేర్పిందని చెప్పారాయన.

జోడో యాత్రలో ప్రజల సహకారం చూసి తనకు చాలా సార్లు కన్నీరు వచ్చిందని చెప్పారు రాహుల్ గాంధీ. ఒక దశలో యాత్ర పూర్తి చేయగలనా లేదా అనుకున్నానని, కానీ వాతావరణ పరిస్థితుల్ని లెక్కచేయకుండా తనతో కలసి నడిచే ప్రజల్ని చూసి తనకు ధైర్యం వచ్చిందని, సజావుగా యాత్ర పూర్తి చేశానని చెప్పారు.

టీషర్ట్ వెనకున్న కథ ఇది..

ప్రజల దీనస్థితి చూసే టీషర్టుతోనే యాత్ర చేయాలని నిర్ణయించుకున్నానన్నారు రాహుల్ గాంధీ. యాత్రలో భాగంగా ఓ రోజు నలుగురు చిన్నారుల తన వద్దకు వచ్చారని, వారు యాచకులని, వారి ఒంటిపై దుస్తులు కూడా సరిగా లేవన్నారు. చలిలో వణికిపోతున్నా కూడా వారు ఏమాత్రం లెక్కచేయలేదని, అలాంటి వారికి స్వెట్టర్లు, జాకెట్లు ఎక్కడినుంచి వస్తాయని ప్రశ్నించారు. భారత్ లో చాలామంది అలాంటి పరిస్థితుల్లో ఉన్నారని, వారిని చూసి తాను కూడా కేవలం టీ షర్ట్ తోనే యాత్ర పూర్తి చేయాలని నిర్ణయించుకున్నానన్నారు రాహుల్.


భయపడితే జీవితమే లేదు..

భయం లేకుండా జీవించడం అనేది తన కుటుంబం నుంచి నేర్చుకున్నానన్నారు రాహుల్ గాంధీ. భయపడుతూ బతికితే అది జీవితమే కాదున్నారు. కాశ్మీర్ లో పాదయాత్ర ఆపేసి వాహనంలో వెళ్లాలని తనకు సెక్యూరిటీ సూచించారని, అయితే తాను కాలి నడకనే ఎంచుకున్నానని చెప్పారు. తనపై గ్రెనేడ్లు వేస్తారనే భయం తనకు లేదని, తన తెల్లటి టీ షర్ట్ ని ఎరుపు రంగులోకి మార్చే అవకాశం అలాంటి వారికి ఇవ్వాలనుకున్నానని, కానీ కాశ్మీర్ ప్రజలు ప్రేమను మాత్రమే పంచారన్నారు.

కాశ్మీర్ లో జరిగిన జోడో యాత్ర ముగింపు సభలో పాల్గొనేందుకు కీలక నేతలంతా హాజరయ్యారు. రాహుల్ సోదరి ప్రియాంక గాంధీ కూడా కాశ్మీర్ చేరుకున్నారు. ఆమెతో రాహుల్ సరదాగా మంచుతో ఆడుకునే వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 145 రోజుల పాటు జోడో యాత్ర చేపట్టిన రాహుల్.. ఇప్పుడు భవిష్యత్ రాజకీయాలపై దృష్టిపెట్టబోతున్నారు. 

Tags:    
Advertisement

Similar News