బిజెపికి వ్య‌తిరేకంగా ఏక‌మ‌వుతున్న పాత మిత్రులు..హ‌ర్యానా వేదిక‌గా ప్ర‌య‌త్నాలు

హర్యానా వేదికగా పాత మిత్రులంతా ఏకమయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇండియ‌న్ నేష‌న‌ల్ లోక‌ద‌ళ్‌(ఐఎన్ఎల్ డి) నేత ఓం ప్ర‌కాష్ చౌతాలా హ‌ర్యానా రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ బిజెపియేత‌ర ప్ర‌భుత్వ ఏర్పాట్ల‌కు చురుకుగా ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

Advertisement
Update: 2022-08-26 08:08 GMT

భార‌తీయ జ‌న‌తాపార్టీ(బిజెపి)కి వ్య‌తిరేకంగా ఒక‌ప్ప‌టి ఆ పార్టీ పాత మిత్రులంతా ఏక‌మ‌వుతున్నారు. ఒక‌ప్పుడు కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని గ‌ద్దె దించేందుకు జ‌రిగిన ప్ర‌య‌త్నాల త‌ర‌హాలోనే ఈ సారి బిజెపి ప్ర‌భుత్వాన్ని సాగ‌నంపేందుకు గ‌తంలో ఆ పార్టీకి మిత్ర ప‌క్షాలుగా ఉన్న రాజ‌కీయ పార్టీల‌న్నీ స‌మాయ‌త్త‌మ‌వుతున్నాయి. 1989లో కేంద్రంలో వి.పి.సింగ్ నేతృత్వంలో కాంగ్రేసేత‌ర ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌డంలో జ‌న‌తాద‌ళ్ నేత ఛౌద‌రి దేవీలాల్ కీల‌క పాత్ర పోషించారు. దాదాపు మూడు ద‌శాబ్దాల త‌ర్వాత ఇప్పుడు ఆయ‌న కుమారుడు,ఇండియ‌న్ నేష‌న‌ల్ లోక‌ద‌ళ్‌(ఐఎన్ఎల్ డి) నేత ఓం ప్ర‌కాష్ చౌతాలా హ‌ర్యానా రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ బిజెపియేత‌ర ప్ర‌భుత్వ ఏర్పాట్ల‌కు చురుకుగా ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

సెప్టెంబర్ 25న దేవీలాల్ జయంతి సందర్భంగా, హర్యానాలోని ఫతేహాబాద్‌లో ఐఎన్ ఎల్ డి 'సమ్మన్ దివస్ ర్యాలీ' (గౌరవ దినోత్స‌వ ర్యాలీ)ని నిర్వహించ‌నుంది. రాష్ట్ర‌, కేంద్రాల‌లో అధికారంలో ఉన్న కాషాయ పార్టీకి వ్యతిరేకంగా మహాకూటమిని ఏర్పరిచే ప్రయత్నంలో భాగంగా బీజేపీకి చెందిన పలు మాజీ మిత్రపక్షాలను ఉమ్మడి వేదికపైకి తీసుకురావడానికి ఐఎన్ ఎల్ డి ఈ సందర్భాన్ని ఉపయోగించుకోనుంది. ఈ స‌భ‌కు జనతాదళ్ (యునైటెడ్) నాయకుడు, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, రాష్ట్రీయ జనతాదళ్ నాయకుడు, బీహార్ మాజీ ముఖ్యమంత్రి, లాలూ ప్రసాద్ యాదవ్, బీహార్ సీనియర్ నాయకుడు కె.సి. త్యాగి, శిరోమణి అకాలీదళ్ (బాదల్) నాయకుడు పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్, సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ములాయం సింగ్ యాదవ్, నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా త‌దిత‌ర‌ప్ర‌ముకుల‌ను ఆహ్వానించ‌డంతో ఈ ర్యాలీకి ప్రాధాన్యం ఏర్ప‌డింది.

ఈ స‌భ‌కు ఆహ్వానితుల్లో ఎవరెవ‌రు వస్తారో చూడాలి. ఒకప్పుడు బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న అనేక ప్రాంతీయ పార్టీలు ఇప్పుడు రాష్ట్రాల‌లో, కేంద్రంలోనూ ఆ పార్టీకి ప్రత్యామ్నాయం కోసం చూస్తున్న తరుణంలో ఈ ర్యాలీ ప్రాధాన్యం సంతరించుకుంది.

కాంగ్రెస్ వ్యతిరేకత నుంచి బీజేపీ వ్యతిరేక పోలరైజేషన్ ..

దేవీలాల్ సోష‌లిస్టు నేప‌ధ్యం నుంచి వ‌చ్చిన నాయ‌కుడు. అంతేగాక బిహార్ లో జ‌న‌తాద‌ళ్ పార్టీ ఎదుగుద‌ల‌లో కీల‌క పాత్ర పోషించాడు. ఆయ‌న జ‌న‌తాద‌ళ్ లో ఉన్న‌ప్పుడ నితీష్ కుమార్ తో క‌లిసి ప‌ని చేశారు. అందువ‌ల్ల ఈ స‌భ త‌మ‌కు ఎంతో ముఖ్య‌మైన‌దిగా భావిస్తున్నారు. నితీష్ కుమార్ 1985లో తొలిసారిగా బీహార్‌లో ఎమ్మెల్యే అయినప్పుడు జనతాదళ్‌లో ఉన్నారు. 1989లో వి.పి.సింగ్ నేతృత్వంలోని జనతాదళ్ ప్రభుత్వంలో దేవీలాల్ ఉప‌ప్ర‌ధానిగా ఉన్నారు.

బిజెపి వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడానికి ఇతర ప్రాంతీయ, జాతీయ పార్టీలతో చర్చలు జరుపుతామని జెడియు జాతీయ అధ్యక్షుడు రాజీవ్ రంజన్ ఇటీవలే చెప్పారు. నితీష్ కుమార్ స్వయంగా వివిధ ప్రతిపక్ష పార్టీల నేతలతో సంప్రదింపులు జరుపుతారని రంజన్ ప్రకటించార‌ని నీర‌జ్ చెప్పారు. బిజెపి బ‌లాన్ని వీలైనంత వరకు తగ్గించి ప్రత్యామ్నాయ రాజకీయాలను ఏర్పాటు చేయాలన్న‌దే త‌మ‌ల‌క్ష్య‌మ‌ని చెప్పారు. 2024లో బీజేపీని ఓడించాల‌నేదే త‌మ స్ప‌ష్ట‌మైన ఎజెండా అన్నారు.

సోషలిస్ట్ రాజకీయాల్లో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించిన బిహార్ సీఎం నితీష్ కుమార్ ను హ‌ర్యానా స‌భ‌కు ఆహ్వానించ‌డం ఆయ‌న ప‌నితీరు సామ‌ర్ధ్యానికి నిద‌ర్శ‌న‌మ‌ని జెడియు అధికార ప్ర‌తినిధి నీర‌జ్ కుమార్ గుర్తు చేసుకున్నారు.

2024 సార్వత్రిక ఎన్నికలు అరవింద్ కేజ్రీవాల్ వర్సెస్ నరేంద్ర మోడీ పోటీ అని ఆప్ ప్రకటించ‌డంపై స్పందిస్తూ, జెడి (యు) లో ఇప్పటి వరకు నాయకత్వ విష‌య‌మై ఎటువంటి చర్చ జరగలేదని నీర‌జ్ కుమార్ అన్నారు. మా పార్టీ అభ్య‌ర్ధే ప్ర‌దాని అవుతార‌ని మేం ఎప్పుడూ చెప్ప‌లేదు. ఇత‌ర పార్టీల‌ను క‌లుపుకుని ముందుకువెళుతూ మా రాజ‌కీయ ప్రాధాన్యాల‌ను అమ‌లు చేయాల‌న‌ల్న‌దే త‌మ ఆ కాంక్ష అన్నారు. "ఆప్ విషయానికొస్తే, బిజెపి విసిరే సవాల్‌ను ఎలా ఎదుర్కోవాలో కూడా ఆలోచించాల‌ని ఆయన అన్నారు.

దేశం ప్రస్తుతం పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది .2024లో తీవ్రమైన సవాలును ఎదుర్కొంటుంది. బిజెపిని గ‌ద్దె దించేందుకు జాతీయ స్థాయిలో కేవలం 40 లోక్‌సభ స్థానాలే కీల‌క‌మ‌ని జెడియు జాతీయ అధ్యక్షుడు ఇప్పటికే పేర్కొన్నారు. అలాగే బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్‌లలోనే ప్రతిపక్షాలు ఈ సీట్లను కూడ‌గ‌ట్టుకోగ‌ల‌మ‌నే విశ్వాసం వ్య‌క్తం చేశారు. మిగతా పార్టీలన్నీ దేశమంతటా ఈ దిశగా కృషి చేస్తే ఇంకా చాలా మంచిద‌న్నారు.

ఫతేహాబాద్ ర్యాలీలో ఒక ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, కనీసం ఇద్దరు పెద్ద నాయకులు - ఎంతో రాజ‌కీయ అనుభ‌వం, రాష్ట్ర అధినేత‌లుగా ఉన్న ఓం ప్ర‌కాష్ చౌతాలా, లాలూ ప్రసాద్ యాద‌వ్. వారు త‌ర్వాత కాలంలో అవినీతి ఆరోపణలపై జైలులో ఉన్నారు. వారు లేనప్పుడు, వారి పార్టీలను వారి కుమారులు అభయ్ సింగ్ చౌతాలా, తేజస్వి యాదవ్ లు న‌డిపినా ఇంకా తండ్రుల ప్ర‌భావం, ఆధిప‌త్యం పార్టీ ల‌పై కొన‌సాగుతోంది.

ఇక హ‌ర్యానా విష‌యానికి వ‌స్తే..ఐఎన్ ఎల్డి చీలిక పార్టీ అయిన జ‌న‌నాయ‌క జ‌న‌తా పార్టీ(జెజెపి) తో క‌లిసి బిజెపి అధికారంలో ఉంది. జెజెపి ని దుష్యంత్ చౌతాలా, ఆయ‌న తండ్రి అజ‌య్ చౌతాలా న‌డిపిస్తున్నారు. విచిత్రం ఏమిటంటే అజ‌య్ చౌతాలా ఐఎన్ ఎల్ డి నేత ఓం ప్ర‌కాష్ చౌతాలా పెద్ద కుమారుడు. బిహార్ లో నితీష్ కుమార్ బిజెపి తో తెగ‌దెంపులు చేసుకుని పాత మిత్రుల‌తో జ‌త క‌ట్టిన విధంగానే హ‌ర్యానాలో జెజెపి కూడా బిజెపితో విడిపోయి వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి పోటీప‌డేలా ప్ర‌య‌త్నాలు జ‌రుగుతాయ‌ని జెడియు అధికార ప్రతినిధి నీర‌జ్ కుమార్ చెప్పారు. అయితే జాతీయ స్థాయిలో బిజెపికి ప్ర‌త్యామ్నాయంగా వేదిక ఏర్పాటు కోసం జ‌రిగుతున్న ప్ర‌య‌త్నాలు ఏ మేర‌కు ఫ‌లిస్తాయో వేచి చూడాలి.

Tags:    
Advertisement

Similar News