ఇది యాక్ట్ ఆఫ్‌ ఫ్రాడ్.. గో బ్యాక్ మోదీ

గుజరాత్ కి మోదీ రావొద్దంటూ ఇప్పటికే సోషల్ మీడియా హోరెత్తిపోతోంది. గో బ్యాక్ మోదీ అనే హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. దీంతోపాటు యాక్ట్ ఆఫ్ గాడ్, యాక్ట్ ఆఫ్ ఫ్రాడ్ అనే హ్యాష్ ట్యాగ్ లు కూడా హైలెట్ అవుతున్నాయి.

Advertisement
Update: 2022-11-01 07:12 GMT

గుజ‌రాత్ మోర్బీ ఘటనపై కన్నీళ్లు పెట్టుకున్న ప్రధాని మోదీ ఇప్పుడు నేరుగా సంఘటన జరిగిన ప్రాంతానికి వస్తున్నారు. ఇప్పటి వరకూ గుజరాత్ ఎన్నికల సందర్భంగా వివిధ అభివృద్ధి కార్యక్రమాలకోసం వచ్చిన మోదీ, ఇప్పుడు పరామర్శకు విచ్చేస్తున్నారు. మోర్బీ ఘటనలో ప్రభుత్వానిదే తప్పయినా తెలివిగా కాంట్రాక్ట్ సంస్థను ఇరికించేశారు. ఎన్నికల వేళ ఈ దుర్ఘటన ప్రభావం బీజేపీ ప్రభుత్వంపై ప‌డకుండా రక్షణాత్మకంగా వ్యవహరిస్తున్నారు. అందులో భాగంగానే మోదీ పరామర్శ యాత్ర అంటూ విమర్శలు మొదలయ్యాయి.

గో బ్యాక్ మోదీ..

గుజరాత్ కి మోదీ రావొద్దంటూ ఇప్పటికే సోషల్ మీడియా హోరెత్తిపోతోంది. గో బ్యాక్ మోదీ అనే హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. దీంతోపాటు యాక్ట్ ఆఫ్ గాడ్, యాక్ట్ ఆఫ్ ఫ్రాడ్ అనే హ్యాష్ ట్యాగ్ లు కూడా హైలెట్ అవుతున్నాయి. గతంలో పశ్చిమబెంగాల్ ఎన్నికల సమయంలో అక్కడ ఓ బ్రిడ్జ్ కూలిపోయిన ఘటనను మోదీ వెటకారం చేసిన సందర్భాన్ని నెటిజన్లు ప్రస్తావిస్తున్నారు. అది యాక్ట్ ఆఫ్ గాడ్ కాదని, యాక్ట్ ఆఫ్ ఫ్రాడ్ అని.. అది బెంగాల్ లో మమత ప్రభుత్వం కూలిపోతుందనడానికి సంకేతం అని చెప్పారు మోదీ. కానీ గుజరాత్ బ్రిడ్జ్ కూలిపోయిన ఘటనను మాత్రం ఆయన రాజకీయం చేయొద్దంటూ స్టేట్ మెంట్ ఇచ్చారు. దీంతో నెటిజన్లు ఆయన రెండు నాల్కల ధోరణిని తీవ్రంగా ఎండగడుతున్నారు. గుజరాత్ బ్రిడ్జ్ కూలిపోవడానికి ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నిస్తున్నారు.

ఇది మరీ దారుణం..

ఇక మోదీ రాక సందర్భంగా మోర్బీలోని సివిల్ ఆస్పత్రికి హడావిడిగా అధికారులు రంగులు వేస్తున్నారు, టైల్స్ పరుస్తున్నారు. ఈ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 141మంది చనిపోయిన ఈ ఘటనలో బాధితులకు అండగా నిలబడాల్సిన అధికారులు, ప్రధాని పర్యటనకోసం ఆస్పత్రికి సోకులు చేస్తారా అంటూ మండిపడుతున్నారు నెటిజన్లు. గుజరాత్ డబుల్ ఇంజిన్ అభివృద్ధికి ఇదే సాక్ష్యం అంటున్నారు. మోదీ కార్పొరేట్లకు కొమ్ము కాస్తున్నారని, బీజేపీని గుజరాత్ నుంచి తరిమికొట్టాలని కామెంట్లు పెడుతున్నారు.

మొత్తమ్మీద ఎన్నికల వేళ మోర్బీ ఘటన బీజేపీ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. అసలే ఆప్ తో పోటీ పడలేక ఆపసోపాలు పడుతున్న బీజేపీకి కొత్తగా మోర్బీ ప్రమాదం మరింత చెడ్డపేరు తెచ్చింది. ఎన్నికల ఏడాదిలో మోదీ కుమ్మరిస్తున్న వేలకోట్ల రూపాయల నిధులు కూడా ప్రజల దృష్టిని మరల్చలేకపోతున్నాయని తేలిపోయింది. మోదీ పతనం మొదలైంది అనడానికి గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలే సంకేతం కావాలని అటు ఆప్, ఇటు కాంగ్రెస్ కూడా సిన్సియర్ గా ట్రై చేస్తున్నాయి.

Tags:    
Advertisement

Similar News