1జీబీ డేటా 10 రూపాయలే..! అడ్డంగా బుక్కైన మోదీ..

మోసపోయేవారెవరూ లేరు మోదీజీ..! ఆ కాలం చెల్లిందంటున్నారు ప్రజలు. అందుకే చౌక డేటా ప్రయోగం సోషల్ మీడియాలో విఫలమైంది.

Advertisement
Update: 2022-10-01 14:54 GMT

"ఒకప్పుడు 1జీబీ డేటా రూ.300 ఉండేది, ఇప్పుడది రూ.10 కి తగ్గింది. దేశంలో సగటున ఒక్కొకరు నెలకు 14 జీబీ డేటా వినియోగిస్తున్నారు, ఈ లెక్కన రూ.4,200 అవ్వాల్సిన చోట రూ.125-150 మాత్రమే వారికి ఖర్చవుతోంది. ప్రభుత్వ కృషి వల్లే ఇది సాధ్యమైంది." దేశవ్యాప్తంగా 5జీ సేవల ప్రారంభంగా ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలివి.

డేటా వరకు బాగానే ఉంది. మరి నిత్యావసరాల సంగతేంటి, పెట్రోల్, డీజిల్ రేట్లెంత పెరిగాయి, గ్యాస్ బండతో సగటు మధ్యతరగతి ప్రజల్ని బాదిపడేసినప్పుడు ఈ ఉదారత్వం ఏమైంది..? గ్యాస్ సిలిండర్ రేట్లు భారీగా పెరిగినప్పుడు లేవని నోర్లు, డేటా రేట్లు తగ్గినప్పుడు ఎందుకు లేస్తున్నాయి. 5జీ సేవలు అందుబాటులోకి రావడంలో, డేటా రేట్లు తగ్గడంలో ప్రభుత్వం గొప్పతనం ఏముంది..? సగటు నెటిజన్ సోషల్ మీడియాలో వేస్తున్న ప్రశ్నలివి. మరి మోదీ వీటికి సమాధానం చెప్పగలరా, కనీసం గొంతు పెగలగలదా..?

నిస్సిగ్గుగా, నిర్లజ్జగా.. డేటా రేట్లు తగ్గడానికి కేంద్ర ప్రభుత్వం కారణం అంటున్నారు నేతలు. మరి దేశవ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరగడానికి, నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటడానికి కారణం ఎవరు..? ఆ ఘనతను తీసుకున్నవారు, ఈ విమర్శలను ఎందుకు స్వీకరించలేరు. కాంగ్రెస్ వల్లే దేశం నాశనమైందనే ప్రచారంతో 2014లో అధికారంలోకి వచ్చిన మోదీ, 2019లో కూడా అవే మోసపు మాటలు చెప్పారు. కాంగ్రెస్ వల్లే ఇప్పుడున్న కష్టాలన్నీ అన్నారు. కానీ ఇప్పుడిక మోదీకి ఆ ఛాన్స్ లేదు. 2022నాటికి పిక్చర్ క్లియర్. ఈ దేశాన్ని పాలించిన వారిలో అత్యంత అసమర్థ ప్రధానిగా మోదీపై ముద్రపడింది. అవినీతి సంగతి వేరు, కానీ మోదీ అసమర్థత వల్ల దేశం వెనక్కి వెళ్లిపోయింది, నిరుద్యోగం తాండవిస్తోంది. మధ్యతరగతి నుంచి ఎగువ మధ్యతరగతిలోకి వెళ్లాల్సిన వారంతా పేదలుగా మిగిలిపోతున్నారు. ధనవంతులు పోటాపోటీగా ఫోర్బ్స్ మ్యాగ‌జైన్‌కి ఎగబాకుతున్నారు. పేద, ధనిక అంతరాలు భారీగా పెరిగాయి. ఇప్పటి వరకూ డీమానిటైజేషన్ ఫలితాలు అందలేదు, కనీసం 2014లో మోదీ ఇచ్చిన వాగ్దానాలు కూడా నెరవేరలేదు. కానీ ఇంకా అవే మోసపు మాటలు, అవే మాయదారి హామీలు. ఇంకా, ఇంకా దేశ ప్రజల్ని మోసం చేయాలనే చూస్తున్నారు మోదీ. డేటా చౌకగా లభిస్తోందని, దానికి కారణం తామేనంటూ బాకాలు ఊదుకుంటున్నారు.

మోసపోయేవారెవరూ లేరు మోదీజీ..! ఆ కాలం చెల్లిందంటున్నారు ప్రజలు. మోదీ మాటలకు, చేతలకు చాలా తేడా ఉంటుందనే విషయం అందరికీ అర్థమైంది. అందుకే చౌక డేటా ప్రయోగం సోషల్ మీడియాలో విఫలమైంది. అదే చౌక డేటాను వాడుకుంటూ మోదీని చెడామడా వాయించేస్తున్నారు నెటిజన్లు. బహుశా డేటా ఖరీదైతే బాగుండేదేమో.. ఈ రేంజ్ లో తిట్లు పడేవి కావేమో అని మోదీ బాధపడుతూ ఉండొచ్చు కూడా.

Tags:    
Advertisement

Similar News