రైతుల పిల్లల పెళ్లిళ్లకు రూ. 2 లక్షల సహాయం.. కుమారస్వామి ప్రకటన

కర్ణాటకలోని జేడీఎస్ పార్టీ అధినేత కుమారస్వామి వ్యవసాయ కుటుంబాలను ఆకట్టుకునే విధంగా ఓ పథకాన్ని ప్రకటించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే రైతుల పిల్లల పెళ్లిళ్లకు రూ. 2లక్షలు ఉచితంగా అందజేస్తామని ప్రకటించారు.

Advertisement
Update: 2023-03-10 11:46 GMT

వ్యవసాయ రంగంపై ఆధారపడి ఎక్కువ మంది జీవనం సాగిస్తున్న దేశాల్లో మన దేశం కూడా ఒకటి. గతంలో వ్యవసాయం చేసే కుటుంబాలకు మంచి గుర్తింపు ఉండేది. రైతులకు పిలిచి మరీ పిల్లను ఇచ్చేవారు. అయితే కాలం మారే కొద్ది ప్రాధాన్యత‌లు మారుతూ వచ్చాయి. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగం, ఐటీ రంగాలు వంటి ఉన్నత ఉద్యోగం చేస్తున్నవారికి తమ బిడ్డలను ఇచ్చి పెళ్లి చేసేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారు. రైతు కుటుంబాలకు పిల్లను ఇచ్చేందుకు తల్లిదండ్రులు అంతగా ముందుకు రావడం లేదు.

ఈ క్రమంలో కర్ణాటకలోని జేడీఎస్ పార్టీ అధినేత కుమారస్వామి వ్యవసాయ కుటుంబాలను ఆకట్టుకునే విధంగా ఓ పథకాన్ని ప్రకటించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే రైతుల పిల్లల పెళ్లిళ్లకు రూ. 2లక్షలు ఉచితంగా అందజేస్తామని ప్రకటించారు. పంచరత్న రథయాత్రలో భాగంగా తాజాగా ఆయన తుమకూరు జిల్లా తిపటూరు నియోజకవర్గం హాల్ మురకి గ్రామంలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జేడీఎస్ అధికారంలోకి వస్తే రైతుల పిల్లల పెళ్లిళ్లకు రూ. 2 లక్షలు చెల్లించే పథకాన్ని తీసుకొస్తామని ప్రకటించారు.

తమకు అధిష్టానం లేదని, పార్టీ తరపున హామీలు ఏవైనా ఇస్తే వాటికి కట్టుబడి నెరవేరుస్తామని చెప్పారు. కర్ణాటకలో కొన్నేళ్లుగా జేడీఎస్ అధికారానికి దూరంగా ఉంది. సొంతంగా గెలవలేని ఆ పార్టీ ఇతర పార్టీలతో కలిసి గతంలో అధికారాన్ని అనుభవించింది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో అయిన సత్తా చాటాలని జేడీఎస్ కీలక నేతలు అయిన దేవేగౌడ, కుమారస్వామి ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభించారు. జనాన్ని ఆకట్టుకోవడం కోసం కొత్త కొత్త పథకాలను ప్రకటిస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News