ఢిల్లీలో మహా పంచాయత్.. రాజధానిలో 144 సెక్షన్..

ఢిల్లీలో మకాం వేసి కేంద్రాన్ని గజగజలాడించి, రైతు చట్టాలను వెనక్కు తీసుకునేట్టు చేసిన అన్నదాతలు, ఈసారి నిరుద్యోగులకు మద్దతిస్తూ చేపట్టిన మహా పంచాయత్ కార్యక్రమం కేంద్రానికి ముచ్చెమటలు ప‌ట్టిస్తోంది.

Advertisement
Update: 2022-08-22 07:10 GMT

మరోసారి ఢిల్లీలో రైతులు కదం తొక్కబోతున్నారు. ఈసారి నిరుద్యోగ సమస్యలపై జరుగుతున్న పోరాటానికి మద్దతుగా వారు రాజధానికి తరలివస్తున్నారు. గతంలో ఏడాదికి పైగా ఢిల్లీలో మకాం వేసి కేంద్రాన్ని గజగజలాడించి, రైతు చట్టాలను వెనక్కు తీసుకునేట్టు చేసిన అన్నదాతలు, ఈసారి నిరుద్యోగులకు మద్దతిస్తూ చేపట్టిన మహా పంచాయత్ కార్యక్రమం కేంద్రానికి ముచ్చెమటలు ప‌ట్టిస్తోంది. దీంతో ముందస్తుగానే దేశ రాజధానిలో 144 సెక్షన్ విధించారు. ఎక్కడికక్కడ అరెస్ట్ లతో ఉద్యమాన్ని అణగదొక్కేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఆదివారం జంతర్ మంతర్ వద్ద సంయుక్త రోజ్‌ గార్‌ ఆందోళన్‌ సమితి ఆధ్వర్యంలో నిరుద్యోగ సమస్యపై రోజ్ గార్ సంసద్ అనే కార్యక్రమం జరిగింది. ఇందులో పాల్గొనడానికి రైతు ఉద్యమ నేత రాకేష్ టికాయత్‌ ఢిల్లీకి వస్తుండగా..ఆయన్ను ఘాజీపూర్ సరిహద్దుల్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోమవారం కూడా జంతర్ మంతర్ వద్ద మహా పంచాయత్ జరగబోతోంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. రైతులంతా వివిధ మార్గాల ద్వారా రాజధాని చేరుకుంటున్నారు. ఆమ్‌ ఆద్మీ పార్టీ నేతలు గోపాల్‌ రాయ్‌, సంజయ్‌ సింగ్‌, రైతు నాయకులు గుర్ణామ్‌ సింగ్‌ చదూనీ, రిషిపాల్‌ తదితరులు ఈ ఆందోళనల్లో పాల్గొంటున్నారు. మరోవైపు పోలీసులు ఆందోళనలను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

పెండింగ్ సమస్యల పరిష్కారం..

ప్రధానంగా నిరుద్యోగ సమస్యపైనే ఉద్యమం జరుగుతున్నా.. పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం రైతాంగం కూడా వారితో కలసి కదం తొక్కుతోంది. గతంలో ఢిల్లీలో జరిగిన ఆందోళనల్లో రైతులపై నమోదు చేసిన కేసుల్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు నాయకులు. గతేడాది అక్టోబర్‌ లో కేంద్రమంత్రి తనయుడు ఆశిష్ మిశ్రా నడిపిన కారు.. రైతు చట్టాలపై నిరసన తెలుపుతోన్న రైతులపైకి దూసుకెళ్లింది. ఆ ఘటనలో మొత్తం 8 మంది మరణించారు. ఆ దుర్ఘటనలో బాధిత కుటుంబాలకు ఇప్పటి వరకు న్యాయం జరగలేదని రైతులు ఆరోపిస్తున్నారు. రైతు ఆందోళనల నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. ఢిల్లీ-హర్యానా సరిహద్దుల్లో అదనపు బలగాలను మోహరించి మరీ పహారా కాస్తోంది. నగరంలో 144 సెక్షన్ విధించడంతోపాటు, నగరంలోకి వచ్చే ప్రతివాహనాన్ని తనిఖీ చేస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News