ఇండియాలో నివసించే వారందరూ హిందువులే : మోహన్ భగవత్

భారత్‌ను తమ మాతృభూమిగా భావించి ఇక్కడ నివసిస్తూ.. ఏ మతాన్ని అనుసరిస్తున్నా, ఏ భాష మాట్లాడుతున్నా.. ఆహార అలవాట్లు, సిద్ధాంతాలు వేరైనా.. వారంతా హిందువులే భగవత్ అని స్పష్టం చేశారు.

Advertisement
Update: 2022-11-16 01:52 GMT

కాబూల్ నుంచి టిబెట్ వరకు, హిమాలయాల నుంచి శ్రీలంక వరకు నివసించే వారందరి డీఎన్ఏ ఒకటే అని.. ఇది అఖండ భారత్ అని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. ప్రస్తుతం ఇండియాలో నివసించే ప్రతీ ఒక్కరు హిందువులే అని ఆయన అభిప్రాయపడ్డారు. చత్తీస్‌గడ్ రాష్ట్రం సుర్గుజా జిల్లాలోని అంబికాపూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. 40వేల ఏళ్లుగా అఖండ భారత్‌లో ఉంటున్న ప్రజలందరి డీఎన్ఏ ఒకేలాగా ఉంటుందని చెప్పుకొచ్చారు.

భారత్‌ను తమ మాతృభూమిగా భావించి ఇక్కడ నివసిస్తూ.. ఏ మతాన్ని అనుసరిస్తున్నా, ఏ భాష మాట్లాడుతున్నా.. ఆహార అలవాట్లు, సిద్ధాంతాలు వేరైనా.. వారంతా హిందువులే అని స్పష్టం చేశారు. భిన్నత్వంలో ఏకత్వం లాంటి సంస్కృతిలో జీవిస్తున్న వారంతా ఒకటేనని అన్నారు. ఈ విషయాన్ని ఆర్ఎస్ఎస్ 1925 నుంచి చెబుతోందని చెప్పారు. ప్రజల మధ్య ఐక్యమత్యం పెంపొందించడమే హిందుత్వ సిద్ధాంతమని భగవత్ చెప్పుకొచ్చారు.

వేల సంవత్సరాలుగా భారత్ ఇదే భిన్నత్వాన్ని చాటుతోందని స్పష్టం చేశారు. మన సంస్కృతి, సంప్రదాయాలను తప్పక పాటించాలని పూర్వీకులు మనకు నేర్పించారు. అలాగే ఇతరుల విశ్వాసాలు, సంప్రదాయాలు కూడా తప్పకుండా మనం గౌరవించాలని చెప్పుకొచ్చారు. సొంత లక్ష్యాల కోసం ఇతరుల సంపదను దోచుకోవద్దని భగవత్ హితవు పలికారు. మన మధ్య ఎన్ని వ్యత్యాసాలు ఉన్నా, క్లిష్ట పరిస్థితుల్లో ఒక్కటిగా నిలబడే గుణం ఉందని అన్నారు.

కరోనా సమయంలో దేశమంతా కలిసి పోరాడిందని, సంస్కృతే మనమంతా ఒక్కటిగా కలిసి పని చేసే గుణాన్ని ఇస్తుందనడానికి నిదర్శనమని తెలిపారు. కరోనా సమయంలో మనం ప్రపంచానికి ఆదర్శంగా నిలిచామని అన్నారు. ఇక ఆర్ఎస్ఎస్ గురించి కూడా కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మేము కబడ్డీ ఆడతాము కానీ క్రీడా సంస్థ కాదు. పాటలు పాడతాము కానీ సంగీత పాఠశాల కాదు. మేం యోగా చేస్తాము కానీ వ్యాయామశాల కాదు. మేం కర్రలను ఉపయోగించి పోరాటాలు నేర్చుకుంటాం. కానీ మేం సైన్యం కాదు. ఇది మనిషి జీవనాన్ని మెరుగుపరిచే ప్రక్రియ మాత్రమే అని చెప్పుకొచ్చారు. ప్రతీ ఒక్కరు శాఖకు వచ్చి ఆర్ఎస్ఎస్ అంటే ఏంటో తెలుసుకోవాలని సూచించారు.

Tags:    
Advertisement

Similar News