పోలవరంతో ముంపు ముప్పు లేదు -కేంద్ర జలసంఘం

గోదావరికి ఇంతవరకు గరిష్ఠంగా 36 లక్షల క్యూసెక్కుల వరద మాత్రమే వచ్చిందని, 50 లక్షల క్యూసెక్కుల ప్రవాహాలను అంచనా వేసి ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపడుతున్నామని కుష్వీందర్‌ ఓరా స్పష్టంచేశారు.

Advertisement
Update: 2023-01-26 02:20 GMT

ఇటీవల గోదావరి వరదలతో భద్రాచలం పరిసర ప్రాంతాలు ముంపు బారిన పడ్డాయి. పోలవరం పూర్తి కాకముందే బ్యాక్ వాటర్ తో ఈస్థాయిలో ముప్పు ఏర్పడితే, ఇక పోలవరం పూర్తయితే పరిస్థితి ఎలా ఉంటుందోననే భయాలు మొదలయ్యాయి. అటు ఒడిశా కూడా పోలవరంపై కొత్త అనుమానాలు లేవనెత్తింది. ఈ దశలో ఎగువ రాష్ట్రాల అనుమానాలు, అభ్యంతరాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాల మేరకు కేంద్ర జలసంఘం ఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేసింది. పోలవరంతో ముంపు ముప్పు లేదని స్పష్టం చేసింది. ఈ ప్రాజెక్ట్ పై ఇప్పటికే అధ్యయనం పూర్తయిందని, మరోసారి ఈ విషయంపై అధ్యయనం చేయాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది.

కేంద్ర జలసంఘం ఛైర్మన్‌ కుష్వీందర్‌ ఓరా ఆధ్వర్యంలో ఢిల్లీలో పోలవరం సాంకేతిక అంశాలపై భాగస్వామ్య రాష్ట్రాలతో సమావేశం నిర్వహించారు. గోదావరికి ఇంతవరకు గరిష్ఠంగా 36 లక్షల క్యూసెక్కుల వరద మాత్రమే వచ్చిందని, 50 లక్షల క్యూసెక్కుల ప్రవాహాలను అంచనా వేసి ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపడుతున్నామని కుష్వీందర్‌ ఓరా స్పష్టంచేశారు. ఇప్పటికే కేంద్ర జలసంఘం పోలవరం ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ ప్రభావంపై అధ్యయనం పూర్తిచేసిందని తేల్చిచెప్పారు. ఇదే విషయాన్ని కేంద్రానికి నివేదిస్తామన్నారు. 2022 జులై, ఆగస్టు నెలల్లో గోదావరికి వచ్చిన వరద వల్ల భద్రాచలం, మణుగూరు, బూర్గంపాడులో 891 ఎకరాలు ముంపు బారిన పడ్డాయని తెలంగాణ అధికారులు తమ వాదనలు వినిపించారు. అయితే ముంపుకి పోలవరం కారణం కాదని, స్థానిక భౌగోళిక పరిస్థితుల వల్ల అలాంటి పరిస్థితి వచ్చి ఉండొచ్చని సీడబ్ల్యూసీ చెప్పింది.

బూర్గంపాడు మనిగిపోతోందని, ప్యాకేజీ చెల్లించాలని తెలంగాణ అధికారులు డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన ఏపీ అధికారులు మిగతా 7 మండలాల లాగే బూర్గంపాడుని కూడా ఏపీలో విలీనం చేయాలని కోరారు. లేదంటే భూసేకరణ చట్టం 2013 ప్రకారం ముంపు భూమికి, నిర్వాసితులకు పరిహారం ఇవ్వడానికి సిద్ధమని స్పష్టం చేశారు. 

Tags:    
Advertisement

Similar News