పీఎం కిసాన్ కాదు.. కిసాన్ బలవన్మరణ్ అని మార్చండి

దేశవ్యాప్తంగా గతేడాది లక్షా 64 వేల మంది ఆత్మహత్యలకు పాల్పడినట్టు నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డులు తేటతెల్లం చేశాయి. అందులో 10,881 మంది వ్యవసాయదారులే. అంటే రోజుకి 30 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు.

Advertisement
Update: 2022-09-21 07:21 GMT

ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకంతో దేశవ్యాప్తంగా రైతుల స్థితిగతులు మారిపోయాయంటూ ప్రచారం చేసుకుంటోంది కేంద్రం. రైతుల ఆదాయం రెట్టింపు చేశామని కూడా ప్రకటనలు ఇచ్చుకుంది. అయితే ఎన్డీఏ హయాంలో భారత్‌లో రైతుల ఆదాయం రెట్టింపు కాలేదని, రైతుల ఆత్మహత్యలు పెరిగాయని విమర్శిస్తోంది కాంగ్రెస్ పార్టీ. దీనికి బీజేపీ విధానాలే కారణం అని మండిపడుతున్నారు కాంగ్రెస్ నేతలు.

గంటకో రైతు ఆత్మహత్య..

2014-2021 మధ్య కాలంలో దేశంలో 53,881 మంది రైతులు ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. అంటే రోజుకి 21 మంది చనిపోయారు. గతేడాది ఈ సంఖ్య మరింత పెరిగింది. దేశవ్యాప్తంగా గతేడాది లక్షా 64 వేల మంది ఆత్మహత్యలకు పాల్పడినట్టు నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డులు తేటతెల్లం చేశాయి. అందులో 10,881 మంది వ్యవసాయదారులే. అంటే రోజుకి 30 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. సగటున గంటకి ఒకరి కంటే ఎక్కువమంది చనిపోయారు. ఈ ఆత్మహత్యలకు బాధ్యత ఎవరు వహిస్తారంటూ ప్రశ్నించారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనతే. ప్రభుత్వ అసంబద్ధ విధానాల వల్లే దేశంలో రైతులు ఆదాయం లేక ఆత్మహత్యలే శరణ్యంగా భావిస్తున్నారని మండిపడ్డారు. ఇటీవల పుణెలో ఆత్మహత్య చేసుకున్న ఓ రైతు, బీజేపీ విధానాలే తన మరణానికి కారణం అంటూ సూసైడ్ నోట్ రాయడం సంచలనంగా మారింది. ఆత్మహత్యలు చేసుకున్న రైతులంతా సూసైడ్ నోట్‌లు రాసినట్టయితే కచ్చితంగా తప్పు బీజేపీ ప్రభుత్వానిదే అని ప్రస్తావించేవారని విమర్శిస్తున్నారు కాంగ్రెస్ నేతలు.

ఇక సాగు చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతూ గతేడాది దాదాపు 700 మంది రైతులు ప్రాణాలు కోల్పోయిన విషయాన్ని సుప్రియా గుర్తుచేశారు. రైతులు, వ్యవసాయ రంగాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం వల్లే ఇలా జరిగిందని చెప్పారు. డీజిల్‌ ధరల పెరుగుదలతో పాటు ఫర్టిలైజర్లు, ట్రాక్టర్లు, వ్యవసాయ పరికరాలపై జీఎస్టీ భారం వేస్తూ రైతులను బీజేపీ ప్రభుత్వం లూటీ చేస్తోందని అన్నారు. పీఎం-కిసాన్ పేరుతో చేస్తున్న ఆర్థిక సాయం ఎందుకూ పనికిరాకుండా పోతోందని విమర్శించారు.

Tags:    
Advertisement

Similar News