బెంగుళూరులో వరదలకు కాంగ్రెస్ పార్టీయే కారణమట !

బెంగుళూరులో వచ్చిన వరదలకు గత కాంగ్రెస్ ప్రభుత్వాలే కారణమని కర్నాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై ఆరోపించారు. ప్రస్తుత దుస్థితికి గత కాంగ్రెస్ ప్రభుత్వాల దుష్పరిపాలన,ప్రణాళిక లేని పరిపాలనే కారణం అని నిందించిన బొమ్మై, చెరువులున్న ప్రాంతాలలో, ట్యాంక్ బండ్లు, బఫర్ జోన్‌లలో నిర్మాణాలకు అనుమతులు ఇచ్చారని, అందువల్లే ఈ పరిస్థితి దాపురించిందని బొమ్మై అన్నారు.

Advertisement
Update: 2022-09-06 11:11 GMT

దేశంలో జరుగుతున్న పేదరికం, అధిక ధరలు, హింస, హత్యలు, అత్యాచారాలు...ఒకటేమిటి అన్ని అపసవ్య‌తలకు నెహ్రూనే కారణమని బీజేపీ నాయకులు ఆరోపణలు గుప్పిస్తూ ఉంటారు. ఏ సమస్య గురించి ప్రశ్నలడిగినా కాంగ్రెస్ ను కారణంగా చూపుతారు. ఆ పార్టీ అగ్ర నేతలే అలా మాట్లాడితే మిగతా వాళ్ళు వాళ్ళ బాటలోనే నడుస్తారు కదా !

రెండు రోజులుగా తీవ్ర వర్షాలతో బెంగుళూరు నగరం చిగురుటాకులా వణికి పోతోంది. రోడ్లు నదులుగా మారాయి. షాపుల్లోకి, అనేక సంస్థల్లోకి నీళ్ళు చేరిపోయాయి. నగరానికి మంచి నీళ్ళు సప్లై చేసే పంపులు నీట మునగడంతో రెండు రోజుల పాటు మంచి నీళ్ళ సరఫరా ఆగిపోయింది. అనేక ప్రాంతాలో పవర్ సప్లై లేదు. దీనంతటికీ కారణం వర్షాలు, వరద‌లు. అయితే ఆ వరదలకు కారణం కాంగ్రెస్ పార్టీయేనని కర్నాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఈరోజు ఆరోపించారు.

నగరం ఇలా అవడానికి తమ బాధ్యత ఏమీ లేదని పూర్తి బాధ్యత కాంగ్రెస్ పార్టీదేనని బొమ్మై అన్నారు. అలాగే నగరమంతా సమస్య ఉందని జరుగుతున్న ప్రచారం కూడా అబద్దమని ఆయన అన్నారు.

"ప్రాథమికంగా ఈ వరదల సమస్య రెండు జోన్లలో మాత్రమే ఉంది, ప్రత్యేకించి మహదేవపూర్ జోన్‌లో 69 చెరువులు ఉండటం వల్ల, కొన్ని ప్రాంతంలో ఆక్రమణల వల్ల, లోతట్టు ప్రాంతాలు కావడం వల్ల వరదలు వచ్చాయి'' అని బొమ్మై అన్నారు.

ప్రస్తుత దుస్థితికి గత కాంగ్రెస్ ప్రభుత్వాల దుష్పరిపాలన,ప్రణాళిక లేని పరిపాలనే కారణం అని నిందించిన బొమ్మై, చెరువులున్న ప్రాంతాలలో, ట్యాంక్ బండ్లు, బఫర్ జోన్‌లలో నిర్మాణాలకు అనుమతులు ఇచ్చారని, అందువల్లే ఈ పరిస్థితి దాపురించిందని బొమ్మై అన్నారు.

చెరువుల‌ నిర్వహణ గురించి కాంగ్రెస్ ఏనాడూ ఆలోచించలేదని ఆరోపించారు సీఎం.

"ఇప్పుడు నేను దానిని సవాలుగా తీసుకున్నాను. నీటి కాలువల అభివృద్ధికి నేను 1,500 కోట్ల రూపాయలు ఇచ్చాను, నేను నిన్ననే 300 కోట్ల రూపాయలను విడుదల చేశాను. అన్ని ఆక్రమణలను తొలగిస్తాను, తద్వారా నీటి ప్రవాహానికి ఎలాంటి ఆటంకాలు, అడ్డంకులు ఉండవు'' అని తెలిపారు.

Tags:    
Advertisement

Similar News