ఢిల్లీలో ఆ వాహనాలు నిషేధం.. నగరవాసులకు నరకం

తీవ్ర చలిగాలుల కారణంగా ఢిల్లీలో ఈనెల 15వరకు స్కూళ్లకు సెలవలు పొడిగించింది ప్రభుత్వం. తాజాగా కార్లపై నిషేధం అమలులోకి తెచ్చింది. శుక్రవారం వరకు దేశ రాజధానిలో బీఎస్3 పెట్రోల్, బీఎస్4 డీజిల్ కార్లపై నిషేధం విధించారు.

Advertisement
Update: 2023-01-10 03:03 GMT

చలిగాలులు, పొగమంచు.. ప్రకృతి ధర్మం. కాలుష్యం మానవ తప్పిదం. ఈ రెండూ కలగలిపి ఇప్పుడు ఢిల్లీ వాసులకు నరకం చూపిస్తున్నాయి. మొన్నటి వరకూ కాలుష్యంతో కూడిన వాతావరణం వల్ల వాహనాలపై నిషేధం అమలులో ఉంది. ఇప్పుడు పొగమంచు కూడా తోడయింది, ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో మళ్లీ కార్లపై నిషేధం విధించింది ఢిల్లీ సర్కారు.

తీవ్ర చలిగాలుల కారణంగా ఢిల్లీలో ఈనెల 15వరకు స్కూళ్లకు సెలవలు పొడిగించింది ప్రభుత్వం. తాజాగా కార్లపై నిషేధం అమలులోకి తెచ్చింది. శుక్రవారం వరకు దేశ రాజధానిలో బీఎస్3 పెట్రోల్, బీఎస్4 డీజిల్ కార్లపై నిషేధం విధించారు. సోమవారం ఢిల్లీలో గాలి నాణ్యత మరింత దిగజారడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు అధికారులు. పొగమంచు, చలిగాలులకు వాయు కాలుష్యం తోడవడంతో గాలి నాణ్యత దారుణంగా పడిపోయింది. దీంతో ఈరోజు నుంచి బీఎస్3 పెట్రోల్, బీఎస్4 డీజిల్ కార్లను ఉపయోగించడంపై తాత్కాలిక నిషేధం విధించింది ఢిల్లీ ప్రభుత్వం.


గాలి నాణ్యత మెరుగుపడితే శుక్రవారం లోపు నిషేధాన్ని ఎత్తివేసే అవకాశముంది. దేశ రాజధానిలో ఆదివారం ఎయిర్ క్వాలిటీ ఇండెక్ట్ 371 కాగా.. సోమవారం సాయంత్రం 434 కి చేరింది. మరింత ప్రమాదకర స్థాయికి చేరుకోకముందే ప్రభుత్వం అలర్ట్ అయింది.

నగరవాసులకు నరకం..

ప్రస్తుతం బీఎస్3 పెట్రోల్, బీఎస్4 డీజిల్ కార్లు ఉన్నవారు నరకం చూస్తున్నారు. తెల్లారితే మీ కారు బయటకు తీయడానికి లేదు అని రాత్రికి రాత్రి సడన్ గా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ట్యాక్సీలు, ఇతర ప్రైవేట్ వాహనాలు కూడా బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఏడాదిలో సగం రోజులు ఇలా నిషేధాజ్ఞల్లో మగ్గిపోతున్నామని ఢిల్లీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News