సిక్కింలో ఘోర ప్రమాదం.. 16 మంది సైనికుల దుర్మరణం

శుక్రవారం ఉదయం భారత్ -చైనా సరిహద్దు సమీపం సిక్కింలోని ఛటెన్ నుంచి తాంగు వైపు వెళ్తున్న కాన్వాయ్‌లో ఓ వాహనం మూలమలుపు వద్ద అదుపు తప్పి లోయలో పడిపోయినట్లు అధికారులు తెలిపారు.

Advertisement
Update: 2022-12-23 13:00 GMT

భారత ఆర్మీలో ఘోర విషాద ఘటన చోటుచేసుకుంది. ఆర్మీ సిబ్బంది ప్రయాణిస్తున్న ట్రక్కు లోయలో పడిన ఘటనలో 16 మంది సైనికులు మరణించారు. చనిపోయిన వారిలో 13 మంది సైనికులు కాగా, ముగ్గురు ఆర్మీ అధికారులని ఆ వర్గాలు తెలిపాయి. శుక్రవారం ఉదయం భారత్ -చైనా సరిహద్దు సమీపం సిక్కింలోని ఛటెన్ నుంచి తాంగు వైపు వెళ్తున్న కాన్వాయ్‌లో ఓ వాహనం మూలమలుపు వద్ద అదుపు తప్పి లోయలో పడిపోయినట్లు అధికారులు తెలిపారు. జెమా వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుందని చెప్పారు.



వెంటనే అప్రమత్తమై రెస్క్యూ సిబ్బంది రక్షణ చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. గాయపడిన నలుగురు సైనికులను వాయుమార్గంలో ఆస్పత్రికి తరలించారు. ఘటన జరిగిన సమయంలో వాహనంలో 20 మంది జవాన్లు, జూనియర్ కమిషన్ అధికారులు ఉన్నారు. కాగా ప్రమాదంలో పెద్ద ఎత్తున సిబ్బంది మరణించడంపై ఆర్మీ విచారం వ్యక్తం చేసింది. సైనికుల కుటుంబాలకు సంతాపం తెలియజేసింది.



మరోవైపు ప్రమాదంపై కేంద్రరక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 'రోడ్డు ప్రమాదంలో ఆర్మీ సిబ్బంది మరణవార్త తీవ్రంగా కలచివేసింది. వారి సేవలకు, నిబద్ధతకు దేశం తరఫున కృతజ్ఞతలు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను' అని ఆయన ట్వీట్ చేశారు.


రాష్ట్రపతి దిగ్భ్రాంతి

ఆర్మీ వాహనం ప్రమాదానికి గురికావడంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వీర జవాన్ల ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని అన్నారు. బాధిత కుటుంబాలకు సంతాపం తెలిపారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా ఈ ఘటనపై విచారణ వ్యక్తం చేశారు. గాయపడ్డ వారికి అవసరమైన వైద్య సాయం అందిస్తామని ప్రకటించారు.

Tags:    
Advertisement

Similar News