ఆ మూడు తినడం జయలలిత చేసిన తప్పు..

తాజాగా ఎయిమ్స్ వైద్యబృందం ఆ కమిషన్ కు నివేదిక ఇవ్వడం, ఆ నివేదికలోని అంశాలు బయటకు రావడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఆ నివేదికలో జయలలిత అప్పుడు తీసుకున్న ఆహారం వివరాలు కూడా పొందుపరిచారు.

Advertisement
Update: 2022-08-22 07:25 GMT

ఆస్పత్రిలో ఉన్న రోగులు వైద్యుల సూచన మేరకు ఆహారం తీసుకోవాలి. వీఐపీ పేషెంట్ల విషయంలో కొంత వెసులుబాటు ఇచ్చినా మరీ ఆరోగ్యానికి హానికరం అనుకునే పదార్థాలను తీసుకోవడాన్ని వైద్యులు కూడా వ్యతిరేకిస్తారు. కానీ అక్కడ బెడ్ పై ఉన్నది పురుచ్చితలైవి. జయలలితకి ఎదురు చెప్పడానికి వైద్యులు సాహసించలేదేమో.. అందుకే ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నా కూడా ద్రాక్ష, స్వీట్లు, కేక్ వంటి ఆహారాన్ని తీసుకున్నారు. ఆ మూడు ఆమెను మరింతగా దెబ్బతీశాయి. అప్పటికే థైరాయిడ్‌, బీపీ, షుగర్‌ సమస్యలతో బాధపడుతున్న జయలలిత.. స్వీట్లు, ద్రాక్ష, కేక్ తినడం వల్ల తీవ్ర అనారోగ్యం పాలయ్యారు. ఊపిరితిత్తుల సమస్య కూడా మొదలైంది. లండన్ వైద్యులు, ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు కూడా చెన్నైలోని అపోలో ఆస్పత్రికి వచ్చి చికిత్స అందించారు. కానీ లాభం లేదు. జయలలిత చనిపోయారు.

అప్పటికే తీవ్ర అనారోగ్యంతో ఉన్న జయలలిత 2016లో అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే ఆమె మృతిపై అనుమానం ఉందని మాజీ సీఎం పన్నీర్ సెల్వం అభ్యంతరం తెలపడంతో అప్పటి సీఎం పళనిస్వామి నేతృత్వంలో ఓ కమిషన్ ఏర్పాటు చేశారు. జయలలిత మరణంపై పలువురిని విచారించిన ఆ కమిషన్ ఇప్పటి వరకూ ఏమీ తేల్చలేదు. ప్రభుత్వం మారాక, అన్నాడీఎంకేలో లుకలుకలు మొదలయ్యాక అసలు ఆ కమిషన్ ఉందని కూడా ఎవరూ గుర్తించడంలేదు. అయితే తాజాగా ఎయిమ్స్ వైద్యబృందం ఆ కమిషన్ కు నివేదిక ఇవ్వడం, ఆ నివేదికలోని అంశాలు బయటకు రావడం ఇప్పుడు సంచలనంగా మారింది.

ఆ నివేదికలో జయలలిత అప్పుడు తీసుకున్న ఆహారం వివరాలు కూడా పొందుపరిచారు. ఆ మూడింటి వల్లే ఆమెకు ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ ఎక్కువైనట్టు చెప్పారు. దీంతో అక్టోబర్‌ 7న ఆమెకు ట్రాకియోస్టమీ చికిత్స ప్రారంభించారు. డిసెంబర్‌ 3న ఆమె ఆరోగ్యం మరింత క్షీణించగా, 4న శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడ్డారని ఆ తర్వాత ఎక్మో ఏర్పాటు చేశారని నివేదికలో పేర్కొన్నారు. డిసెంబర్ 5న మెదడు, గుండె పనిచేయకపోవడంతో జయలలిత మరణాన్ని ధృవీకరించారు వైద్యులు. ఆమెకు అందించిన చికిత్సలో ఎలాంటి లోపాలు లేవని నివేదికలో పేర్కొన్నారు.

Tags:    
Advertisement

Similar News