LTTEప్రభాకరన్ బతికున్నట్టు ఆధారాలులేవు ..శ్రీలంక ఆర్మీ ప్రకటన‌

శ్రీలంక డైరెక్టర్ మీడియా, ఆర్మీ అధికార‌ ప్రతినిధి బ్రిగేడియర్ రవి హెరాత్ మాట్లాడుతూ, ప్రభాకరన్ చనిపోయినట్లు నిరూపించడానికి శ్రీలంకలో డిఎన్‌ఎ సర్టిఫికెట్లు సహా అన్ని రికార్డులు ఉన్నాయని చెప్పారు.

Advertisement
Update: 2023-02-13 13:54 GMT

LTTE ఛీఫ్ వెలుపిళ్ళై ప్రభాకరన్ ఇంకా బతికే ఉన్నట్టు తమిళ నేషనలిస్ట్ మూవ్‌మెంట్ (TNM) నాయకుడు పీ. నెడుమారన్ చేసిన ప్రకటన ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆయన ప్రకటనను చాలా మంది కొట్టిపడేస్తున్నప్పటికీ నమ్ముతున్నవాళ్ళు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో నెడుమారన్ ప్ర‌కటనలో ఏ మాత్రం నిజం లేదని శ్రీలంక ఆర్మీ ప్రకటించింది.

శ్రీలంక డైరెక్టర్ మీడియా, ఆర్మీ అధికార‌ ప్రతినిధి బ్రిగేడియర్ రవి హెరాత్ మాట్లాడుతూ, ప్రభాకరన్ చనిపోయినట్లు నిరూపించడానికి శ్రీలంకలో డిఎన్‌ఎ సర్టిఫికెట్లు సహా అన్ని రికార్డులు ఉన్నాయని చెప్పారు.

"...మా రికార్డుల ప్రకారం, ప్రభాకరన్ జీవించి ఉన్నారని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవు. కాబట్టి, మీడియా ఈ విషయంలో రుజువులను, బతికున్నాడని ప్రకటన‌ చేసిన వారినే అడగాలి "అని బ్రిగేడియర్ రవి హెరాత్ అన్నారు.

2009లో ప్రభాకరన్‌ను శ్రీలంక బలగాలు హతమార్చాయని హెరాత్ చెప్పారు: " ఆపరేషన్ ముగిసిన 2009 చివరి నాటికి, DNA సర్టిఫికెట్లు, ఈ ధృవీకరణలన్నీ తీసుకున్నాము." అన్నారు.

ఈ న సమాచారంపై శ్రీలంక ప్రభుత్వం స్పందించడం గానీ ఏదైనా చర్య తీసుకోవడం కానీ చేస్తుందా? అని అడిగినప్పుడు, హెరాత్, "అలాంటి ప్రణాళికలు లేవు. అయితే సమీప భవిష్యత్తులో విదేశాంగ మంత్రి అధికారిక ప్రకటన ఉండవచ్చు.'' అన్నారు

శ్రీలంక విదేశాంగ మంత్రి అలీ సబ్రీ మాత్రం ఈ అంశంపై ఆచితూచి స్పందించారు. నివేదికలను పరిశీలించి చెప్తానని అన్నారు.

కాగా, ఈ రోజు తమిళనాడులో జరిగిన విలేఖరుల సమావేశంలో, ప్రముఖ తమిళ జాతీయవాద నాయకుడు పజా నెడుమారన్, ప్రభాకరన్ బతికున్నాడని, త్వరలోనే బైటికి వస్తాడని ప్రకటించారు. తాను ప్రభాకరన్ కుటుంబం అనుమతితోనే ఈ ప్రకటన చేస్తున్నట్టు ఆయన చెప్పారు. 

Tags:    
Advertisement

Similar News