నేపాల్‌లో భూకంపం.. 69 మంది మృతి

రాత్రి సమయం కావడం.. పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడటం వల్ల ఆయా ప్రాంతాలకు వెళ్లేందుకు వీలుకాని పరిస్థితి ఏర్పడిందని అక్కడి అధికారులు తెలిపారు.

Advertisement
Update: 2023-11-04 02:24 GMT

నేపాల్‌లో భారీ భూకంపం సంభవించింది. దీని ప్రభావంతో ఇప్పటివరకు 69 మంది మృతిచెందినట్టు తెలిసింది. పదుల సంఖ్యలో ప్రజలు గాయాలపాలయ్యారు. నేపాల్‌లోని వాయువ్య జిల్లాల్లో గల పలు ప్రాంతాల్లో శుక్రవారం రాత్రి 11 గంటలు దాటిన తర్వాత ఈ భూకంపం సంభవించినట్టు అక్కడి అధికారులు వెల్లడించారు. భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 6.4గా నమోదైందని యూఎస్‌ జియోలాజికల్‌ సర్వే తెలిపింది. భూకంప కేంద్రం 11 మైళ్ల లోతులో ఉన్నట్లు గుర్తించింది. నేపాల్‌ రాజధాని ఖాఠ్మండూకి 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న జజర్‌కోట్‌లో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు నేపాల్‌ జాతీయ భూకంప పర్యవేక్షణ, పరిశోధన కేంద్రం తెలిపింది. భూకంప తీవ్రతకు పలు ప్రాంతాల్లో ఇళ్లు నేలమట్టం అయ్యాయి. రుకమ్‌ జిల్లాలో ఇళ్లు కూలి సుమారు 35 మంది, జజర్‌కోట్‌లో 34 మంది మృతి చెందినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు.




సహాయక చర్యలకు ఆటంకం...

రాత్రి సమయం కావడం.. పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడటం వల్ల ఆయా ప్రాంతాలకు వెళ్లేందుకు వీలుకాని పరిస్థితి ఏర్పడిందని అక్కడి అధికారులు తెలిపారు. దీంతో తక్షణ సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడిందని వివరించారు. ప్రజలందరూ నిద్రకు ఉపక్రమించే సమయంలో భూకంపం సంభవించడం వల్ల ప్రాణనష్టం భారీగా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ఘటనపై నేపాలి ప్రధాని పుష్ప కమల్‌ స్పందిస్తూ.. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. 2015లో 7.8 తీవ్రతతో వచ్చిన భూకంప ప్రభావం వల్ల 9 వేల మంది మృత్యువాత పడ్డారు.




భారత్‌లోనూ ప్రకంపనలు..

ఈ భూకంప తీవ్రతకు భారత్‌లోని పలు ప్రాంతాలు కూడా ప్రకంపనలకు గురయ్యాయి. భూకంపానికి గురైన ప్రాంతానికి 800 కిలోమీటర్ల దూరంలో ఉన్న దేశ రాజధాని ఢిల్లీతో పాటు యూపీ, బిహార్‌లోని పలు ప్రాంతాల్లోనూ ప్రకంపనలు వచ్చాయి. ఈ ప్రకంపనలతో ఢిల్లీలోని ప్రజలు భయాందోళనలతో రోడ్లపైకి పరుగులు పెట్టారు. దీనికి సంబంధించి పలువురు సోషల్‌ మీడియాలో పోస్టులు చేశారు.

Tags:    
Advertisement

Similar News