ఆర్థిక సంక్షోభం లో చిక్కుకున్న పాకిస్తాన్ IMF షరతుల గుప్పెట్లోకి...

విదేశీ మారక నిల్వలు దారుణంగా క్షీణించి పదేళ్ళ కనిష్టానికి చేరాయి. 16.1 శాతం విదేశీ మారక ద్రవ్య నిధులు క్షీణించి ప్రస్తుతం 3.09 బిలియన్ డాలర్లకు చేరాయి. ఇవి మూడు వారాల దిగుమతులకు మాత్రమేసరిపోతాయి.

Advertisement
Update: 2023-02-04 03:08 GMT

ఆర్థికంగా దివాళా తీసి, సంక్షోభంలో కూరుకుపోయి, ప్రజలకు ఆహారం దొరకడం కూడా గగనం అయిపోయిన స్థితిలో పాకిస్తాన్ ను అప్పుపేరుతో IMF తన నిబందనల, షరతుల చట్రంలో ఇరికించింది.

దాదాపు రెండు నెలలకు పైగా పాకిస్తాన్ క్రమక్రమంగా తీవ్రమైన సంక్షోభంలోకి జారిపోతూ ఉంది. ఆహార సంక్షోభంతో ప్రజలు, ఆకలితో, అర్దాకలితో జీవిస్తున్నారు. వారికి అత్యవసర ఆహారమైన గోదుమ పిండి కోసం ప్రజలు తమలో తాము ఘర్షణలకు పాల్పడే పరిస్థితి దాపురించి. మరో వైపు ఇంధన సంస్ఖోభం పాకిస్తాన్ ను భయాందోళనలకు గురి చేస్తోంది. పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొనేందుకు పాకిస్తాన్ దగ్గర విదేశీ మారక ద్రవ్యం లేక ఏం చేయాలో అర్దం కాని పరిస్థితుల్లో పడిపోయింది ప్రభుత్వం. ఈ వారంలో ఇంధన నిల్వలు అయిపోతాయని అధికారులు చెప్తున్నారు.

విదేశీ మారక నిల్వలు దారుణంగా క్షీణించి పదేళ్ళ కనిష్టానికి చేరాయి. 16.1 శాతం విదేశీ మారక ద్రవ్య నిధులు క్షీణించి ప్రస్తుతం 3.09 బిలియన్ డాలర్లకు చేరాయి. ఇవి మూడు వారాల దిగుమతులకు మాత్రమేసరిపోతాయి.

ఇటువంటి పరిస్థితుల్లో స్నేహ దేశాలు కూడా పాక్ ను కాపాడడానికి ముందుకు రావడంలేదు. ఇక పాక్ కు మిగిలింది అంతర్జాతీయ ద్రవ్య సంస్థ(IMF). పాక్ ప్ర‌భుత్వం IMF వద్ద దాదాపు సాగిలపడింది. ఏదేశానికి IMF అప్పు ఇచ్చినా ఆ దేశంలో పన్నులు పెరగడం, ప్రజలకు ఉచితంగా ఇచ్చే పథకాలు ఆగిపోవడం, సంక్షేమం గాలిలో కలవడం సహజం. ఇప్పుడు పాకిస్తాన్ కు అదే పరిస్థితి ఎదురు కానుంది.

అడగ్గా అడగ్గా IMF పాకిస్తాన్ కు బెయిల్ అవుట్ ప్యాకేజ్ ఇవ్వడానికి ఒప్పుకున్నది. అయితే ఆ సంస్థ పెట్టిన షరతులు ఆ దేశ ప్రజల పరిస్థితిని మరింత దిగజారిస్తాయనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అన్ని వస్తువులపై, సేవలపై పన్నులు పెంచాలి. రాయితీలు పూర్తిగా రద్దు చేయాలి. ఉచితాలు ఆపేయాలి...ఇంకా ఇలాంటి చాలా షరతులతో IMF పాకిస్తాన్ కు అప్పు ఇవ్వబోతుంది. IMF షరతుల వల్ల ఇప్పటికే లీటర్ పెట్రోల్ ధర అక్కడ 250 రూపాయలకు చేరింది. రూపాయి మారకంపై ఉన్న పరిమితులను తొలగించాలన్న షరతు వల్ల ఇంటర్ బ్యాంక్ మార్కెట్ లో పాకిస్తాన్ రూపాయి విలువ 270 వద్ద ట్రేడవుతోంది.

త్వరలోనే ఎన్నికలున్న పాకిస్తాన్ లో IMF షరతులు అమలు చేస్తే ప్రభుత్వం పై ప్రజల్లో వ్యతిరేకత పెరిగి తాము ఓడిపోతామని అధికారపక్షం భయపడుతోంది. అయినా తమకు మరో గత్యంతరం లేదని పాకిస్తాన్ ప్రధాని షేబాజ్ అన్నారు. ''ప్రస్తుతం దేశ ఆర్థిక పరిస్థితి ఊహకు కూడా అందడం లేదు. కాబట్టి ఐఎంఎఫ్ నిబంధనలను అంగీకరించాల్సిందే. వారి కండిషన్లు చాలా కఠినంగా ఉన్నప్పటికీ ఓకే చెప్పక తప్పని పరిస్థితి నెలకొంది’’ అన్నారాయన.

పాకిస్తాన్ ఇప్పుడున్న సంక్షోభ దశ నుండి IMF షరతుల కారణంగా మరో సంక్షోభం దిశగా ప్రయాణం చేస్తుందేమోనని నిపుణులు ఆందోళన చెందుతున్నారు. ఈ షరతులు ప్రజలపై భరించలేని భారాన్ని మోపబోతున్నాయని నిపుణుల భావన.

Tags:    
Advertisement

Similar News