ఆఖరికి బంగ్లాదేశ్ కంటే కూడా వెనకబడ్డామా..?

బంగ్లాదేశ్ తలసరి ఆదాయం కంటే భారత్ తలసరి ఆదాయం ఇప్పుడు పడిపోయింది. ప్రపంచ దేశాల తలసరి ఆదాయాల లెక్కతీస్తే.. భారత్ లోయర్ మిడిల్ ఇన్ కమ్ గ్రూప్‌లో ఉంది. అంటే సగటు భారతీయుడి సంపాదన విషయంలో భారత్ పరిస్థితి ఘోరంగా ఉంది.

Advertisement
Update: 2022-08-18 05:42 GMT

భారత్ పక్కన ఉన్న ఓ చిన్న దేశం బంగ్లాదేశ్. అక్కడ ఉపాధి లేక, ఆర్థిక పరిస్థితులు బాగోలేక నిత్యం వలస బాటపడుతుంటారు ప్రజలు. ఈ క్రమంలో బంగ్లేదేశీయులు భారత్‌కి కూడా వస్తుంటారు. విచిత్రం ఏంటంటే.. పైకి బాగానే ఉంది అనుకున్నా.. భారత్ పరిస్థితి బంగ్లాదేశ్ కంటే దీనంగా ఉంది, హీనంగా మారింది. బంగ్లాదేశ్ తలసరి ఆదాయం కంటే భారత్ తలసరి ఆదాయం ఇప్పుడు పడిపోయింది. ప్రపంచ దేశాల తలసరి ఆదాయాల లెక్కతీస్తే.. భారత్ లోయర్ మిడిల్ ఇన్ కమ్ గ్రూప్‌లో ఉంది. అంటే సగటు భారతీయుడి సంపాదన విషయంలో భారత్ పరిస్థితి ఘోరంగా ఉంది. ఎంత ఘోరం అంటే పాకిస్తాన్ కంటే ఎక్కువ, బంగ్లాదేశ్ కంటే తక్కువ అన్నట్టుగా ఉంది. భారత్ తలసరి ఆదాయం 2170 డాలర్లు కాగా, బంగ్లాదేశ్ తలసరి ఆదాయం 2620 డాలర్లు.

బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా... ఈ దేశాలన్నీ అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలుగా బ్రిక్స్ అనే కూటమి ఏర్పాటు చేసుకున్నాయి. అంటే అమెరికా లాంటి సంపన్న దేశాలతో పోటీ పడేందుకు తమలో తాము సహకరించుకోవాలనే ప్రతిపాదనతో ప్రతి ఏడాదీ సదస్సులు నిర్వహించుకుంటున్నాయి. విచిత్రం ఏంటంటే.. భారత్ మినహా ఇందులో మిగతా దేశాలన్నీ తమ ఆర్థిక వ్యవస్థను పదిలంగా కాపాడుకుంటూ ఉన్నాయి. కానీ భారత్ మాత్రం పతనావస్థకు చేరుకుంది. బ్రిక్స్ సమూహం అంటే గౌరవంగా చూసే ఇతర దేశాల కంటే భారత్ దిగజారిపోయిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మరీ బంగ్లాదేశ్ కంటే దీనస్థితికి చేరుకుంది భారత్.

పేద, ధనిక అంతరం..

భారత్ జీడీపీ పెరుగుతోంది. అంటే భారత్‌లో సంపాదన పెరుగుతుందే కానీ, సంపాదనాపరులు పెరుగుతున్నట్టు కాదు. ధనికులు మరింత ధనికులుగా మారుతున్నారు. పేద, మధ్యతరగతి అలాగే ఉంటోంది. ధరల పెరుగుదల, విద్య, వైద్యం ఖర్చులతో మధ్యతరగతి కూడా పేదరికంలోకి దిగజారిపోతోంది. కేంద్రం మాత్రం జీడీపీ లెక్కలు వేసుకుంటూ తలసరి ఆదాయాన్ని దాచి ఉంచాలని చూస్తోంది. ఇలా దాచి ఉంచినా కూడా ఆ పతనం ఆగలేదు, చివరకు బంగ్లాదేశ్ కంటే దిగజారింది. ఇప్పటికైనా జీడీపీ లెక్కలు కట్టిపెట్టి, తలసరి ఆదాయం లెక్కలు తీసి భారత్‌ పరిస్థితిని మెరుగుపరిచేందుకు కేంద్రం కృషి చేయాలి. లోకపోతే పాకిస్తాన్ కంటే భారత్ వెనకపడే రోజులొస్తాయి.

Tags:    
Advertisement

Similar News