పండగ బంగారం.. కస్టమర్లలో నీరసం..

నిత్యావసరాల కొనుగోళ్లకే ప్రజల ఆదాయం ఖర్చవుతోంది. పొదుపు, పెట్టుబడులు, పండగల ఖర్చుల గురించి ఆలోచించే స్థితిలో భారత ప్రజలు లేరు. అందుకే ఏడాది బంగారం విక్రయాలు తగ్గిపోతున్నాయని తెలుస్తోంది.

Advertisement
Update: 2022-10-20 04:22 GMT

ఈ ఏడాది పండగ సీజన్‌ లో భారత్‌ లో బంగారు ఆభరణాల విక్రయాలు ఆశించిన స్థాయిలో ఉండకపోవచ్చనే అంచనాలు వెలువడ్డాయి. గతేడాదితో పోల్చి చూస్తే ఇప్పటికే అమ్మకాలు నీరసంగా ఉన్నాయని, ఈ సెంటిమెంట్ కొనసాగే అవకాశముందని చెబుతున్నారు నిపుణులు. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (WGC) అంచనాల మేరకు ఈ ఏడాది దసరా సీజన్లో కూడా అనుకున్న స్థాయిలో బంగారం అమ్మకాలు జరగలేదు. ధనత్రయోదశి, దీపావళి సీజన్ కూడా ఇలాగే ఉంటుందనే అంచనాలున్నాయి.

కరోనా తర్వాత హెచ్చు తగ్గులు..

కరోనా తర్వాత బంగారం అమ్మకాల్లో తీవ్ర హెచ్చుతగ్గులు చోటు చేసుకున్నాయి. 2020 పండగ సీజన్‌లో భారీగా పడిపోయిన బంగారం అమ్మకాలు, 2021లో అనూహ్యంగా పుంజుకున్నాయి. 2020తో పోల్చి చూస్తే ఆ తర్వాతి ఏడాది నగల అమ్మకాలు రెట్టింపయ్యాయి. గతేడాది అక్టోబరు- డిసెంబరు మధ్యకాలంలో భారతీయలు రికార్డు స్థాయిలో 344 టన్నుల బంగారం కొనుగోలు చేసినట్టు WGC తెలిపింది. అయితే ఈ ఏడాది మాత్రం పండగ సీజన్ అమ్మకాలు ఆ స్థాయిలో ఉండక పోవచ్చని అంటున్నారు. ఈ ఏడాది ప్రథమార్ధంలో ఇప్పటికే అమ్మకాలు బాగా తగ్గాయి. కానీ డిసెంబర్ నాటికి పరిస్థితి మెరుగ్గా ఉంటుందని తెలుస్తోంది. ఎంత మెరుగ్గా ఉన్నా గతేడాది రికార్డ్ లు మాత్రం భద్రంగానే ఉంటాయట. గతేడాది మొత్తం బంగారు అమ్మకాలు 800 టన్నులు కాగా, ఈ ఏడాది 750 టన్నుల వద్ద ఆగిపోవచ్చని WGC అంచనా వేస్తోంది.

కారణం ఏంటి.. ?

బంగారం అమ్మకాల్లో హెచ్చుతగ్గులు సహజమే. అయితే కరోనా తర్వాత ఒక్కసారిగా పుంజుకున్న అమ్మకాలు ఇప్పుడు తగ్గిపోవడానికి కారణం ఏంటి..? బంగారం కొనుగోళ్లపై అమిత ఆసక్తి చూపే ప్రజలు ఈ ఏడాది ఎందుకు వెనకపడ్డారు..? జీవన వ్యయాలు పెరగడమే దీనికి కారణం అంటున్నారు నిపుణులు. నిత్యావసరాల కొనుగోళ్లకే ప్రజల ఆదాయం ఖర్చవుతోంది. పొదుపు, పెట్టుబడులు, పండగల ఖర్చుల గురించి ఆలోచించే స్థితిలో భారత ప్రజలు లేరు. అందుకే ఏడాది బంగారం విక్రయాలు తగ్గిపోతున్నాయని తెలుస్తోంది. ధర స్థిరంగానే ఉన్నా.. పండగ సీజన్లో అమ్మకాలు మాత్రం జోరందుకోలేదు.

Tags:    
Advertisement

Similar News