హెపటైటిస్ వ్యాధులతో జాగ్రత్త!

ప్రమాదకరమైన హెపటైటిస్‌ వ్యాధుల వల్ల ఏటా లక్షల్లో ప్రాణాలు పోతున్నాయని ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది.

Advertisement
Update: 2024-04-29 06:03 GMT

ప్రమాదకరమైన హెపటైటిస్‌ వ్యాధుల వల్ల ఏటా లక్షల్లో ప్రాణాలు పోతున్నాయని ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. హెపటైటిస్‌ వ్యాధుల వల్ల 2019లో 11 లక్షల మంది, 2022లో 13 లక్షల మంది మరణించారని నివేదికలు చెప్తున్నాయి. అసలేంటీ హెపటైటిస్.. దీనికై ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

హెపటైటీస్ అనేది ముఖ్యంగా ఒక వైరల్ వ్యాధి. ఇది కాలేయానికి సంబంధించింది. లివర్‌‌లోని కణజాలం వాపుకి గురయితే దాన్ని హెపటైటిస్ అనొచ్చు. ఇది ఎక్కువగా వైరస్ వల్ల సంభవిస్తుంది. కొన్నిసార్లు ఇతర కారణాలు కూడా ఉండొచ్చు. ఇందులో ఎ, బి, సి, డి, ఈ.. అను పలు రకాలున్నాయి. ముఖ్యంగా హెపటైటిస్–బి, హెపటైటిస్–సి వల్ల ప్రాణనష్టం ఎక్కువగా ఉంటోంది.

హెపటైటిస్ రావడానికి వైరస్ ప్రధానమైన కారణం. అలాగే అతిగా ఆల్కహాల్ సేవించడం, ఫుడ్ పాయిజనింగ్ వంటివి కూడా కొన్ని సార్లు కారణాలు కావొచ్చు. ఈ వ్యాధి వల్ల కాలేయంలోని కణాలన్నీ వాపుకి గురవుతాయి. కొన్నిసార్లు ఇది లివర్ క్యాన్సర్ కు కూడా దారితీస్తుంది. కళ్లు, చర్మం పచ్చగా మారడం, నీరసం, వాంతులు, ఆకలి లేకపోవడం, కడుపు నొప్పి, విరేచనాలు వంటివి హెపటైటిస్ లక్షణాలు.

హెపటైటిస్–బి

హెపటైటిస్–బి ని తీవ్రమైన జబ్బుగా పరిగణిస్తారు. ఇది చాలా లేట్‌గా తెలుస్తుంది. వైరస్ సోకిన కొన్ని నెలల తర్వాత లక్షణాలు కనిపిస్తాయి. కొన్ని సందర్భాల్లో కాలేయాన్ని మార్చాల్సి కూడా రావొచ్చు. వికారం, వాంతులు, కడుపునొప్పి, జ్వరం, కీళ్ల నొప్పులు, ఆకలి లేకపోవడం, కళ్లు పసుపు రంగులోకి మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. వ్యాధి ముదరక ముందే చికిత్స మొదలుపెడితే ప్రాణాపాయ స్థితి నుంచి రక్షించొచ్చు.

హెపటైటిస్–సి

హెపటైటిస్–బి తో పోలిస్తే హెపటైటిస్–సి కాస్త తక్కువ ప్రమాదకరమైంది. ఇది దీర్ఘకాలిక స్టేజీకి వెళ్తే చికిత్స కష్టం అవుతుంది. మొదటి దశలో యాంటీ వైరల్ మందుల ద్వారా తగ్గించొచ్చు.

హెపటైటిస్‌– ‘బి’,‘సి’ లు దీర్ఘకాలికంగా శరీరంలో ఉండిపోతాయి. జీవితాంతం మందులు వాడాల్సిరావొచ్చు. హెపటైటిస్ ఉన్నప్పుడు నీళ్లు, లిక్విడ్స్ ఎక్కువగా తీసుకోవాలి. వీలైనంత వరకు విశ్రాంతి తీసుకోవాలి. క్రమం తప్పకుండా మందులు వాడాలి. తాజా ఆహారాలే తీసుకోవాలి. ఇకపోతే హెపటైటిస్‌– ‘ఎ’,‘డి’,‘ఈ’ రకాలు కొద్దిపాటి మందులతో వాటంతట అవే తగ్గిపోతాయి. కళ్లు పచ్చగా అవ్వడం, లోగ్రేడ్ ఫీవర్, నీరసం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

Tags:    
Advertisement

Similar News